Konatham Dileep | హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నాయకుడు కొణతం దిలీప్ అరెస్ట్‌కు ప్రభుత్వం ఉబలాటపడుతున్నది. పోలీసులు ఇప్పటివరకు దిలీప్‌ను మూడుసార్లు అరెస్ట్ చేశారు. కానీ.. సరైన ఆధారాలు లేకపోవడంతో ప్రతిసారి భంగపడుతున్నారు. సోమవారం కూడా మరోసారి ప్రభుత్వానికి చేదు అనుభవం ఎదురైంది. మొదట.. ఆర్టీసీ పేరుతో నకిలీ లోగో సృష్టించి, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారనే ఆరోపణలపై ఈ ఏడాది మే నెలలో కేసు నమోదు చేశారు.
ఈ కేసు అక్రమమని ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో విచారించిన న్యాయస్థానం.. దిలీప్‌ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. కేవలం నోటీసులు ఇచ్చి, విచారణకు వివరాలు సేకరించాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 5న సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారణం చెప్పకుండా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ భవన్లో నిర్బంధించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు జగదీశ్‌రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్, క్రిశాంక్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు సీసీఎస్‌కు చేరుకున్నారు. దిలీప్‌ను ఎందుకు నిర్బంధించారో చెప్పాలని డిమాండ్ చేశారు.
అయినా పోలీసులు కొన్ని గంటలపాటు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. చివరికి.. ఆసిఫాబాద్‌లో జరిగిన అల్లర్లపై వీడియోలను ఓ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారని, దానిని దిలీప్ నిర్వహిస్తున్నట్టు తెలిసి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇందుకు ఆధారాలు చూపెట్టాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టడంతో.. చేసేది లేక అర్ధరాత్రి దిలీప్‌ను విడిచిపెట్టారు. ఒక రోజంతా హైడ్రామా జరిగింది. సోమవారం కూడా ఇదే సీన్ రిపీట్ అయింది.
పోలీసులు విచారణకు పిలిచినప్పుడు సహకరించాలని దిలీప్‌కు గతంలో హైకోర్టు సూచించింది. పోలీసులు సోమవారం విచారణకు పిలవగా, ఆయన సీసీఎస్ పోలీసుల ముందు హాజరయ్యారు. దాదాపు రెండుమూడు గంటలపాటు ఖాళీగా కూర్చోబెట్టారని, ఆ తర్వాత పాత కేసులో అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ కుట్రను గుర్తించిన న్యాయస్థానం.. దిలీప్ రిమాండ్‌ను తిరస్కరించింది. దీంతో ప్రభుత్వానికి ముచ్చటగా మూడోసారి ఎదురుదెబ్బ తగిలింది.
ప్రభుత్వ అసమర్థతను, పాలనా విధానాలను ప్రజలకు చేరవేస్తున్న కొణతం దిలీప్‌ను సోషల్ మీడియా నుంచి కొన్నాళ్లపాటు దూరం చేయాలని ప్రభుత్వ పెద్దలు మొదటి నుంచీ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఎలాగైనా అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించినట్టు చర్చ జరుగుతున్నది. పై నుంచి వస్తున్న ఒత్తిడితో ఇప్పటికి మూడుసార్లు పోలీసులు కొణతం దిలీప్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌కు ప్రయత్నించారు. కానీ న్యాయస్థానంలో వారికి ఎదురుదెబ్బ తగిలింది.
తాజాగా సోమవారం రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ కావడంతో ప్రభుత్వ పెద్దల అహం దెబ్బతిన్నట్టు చర్చ జరుగుతున్నది. అంత సులభంగా ఎలా వదిలిపెట్టారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా సరే కొత్త కేసులు నమోదు చేయాలని, కచ్చితంగా అరెస్ట్ చేయాలని హుకూం జారీ చేసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే.. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు ఎలా నమోదు చేస్తామని, అవి న్యాయస్థానాల ముందు ఎలా నిలబడుతాయని పోలీసులు అసహనం వ్యక్తం చేస్తున్నారట.