కొమురవెల్లి : కోరిన వారి కోర్కెలు తీర్చే కోర మీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కల్యాణ వేడుక ఆదివారం ఉదయం అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణు శరణు అంటూ జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. కన్నుల పండువగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు బారులుతీరారు. శివశక్తులు శివాలెత్తి పోయారు. ఒగ్గు పూజారులు ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా మల్లన్న కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లన్న పెళ్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి హరీశ్ రావు మల్లన్న కల్యాణోత్సవానికై స్వామి వారికి బంగారు కిరీటం, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను వెండి పల్లెంలో నెత్తిన పెట్టుకుని సంప్రదాయబద్దంగా మేళ, తాళలతో వచ్చి సమర్పించారు.
బృహన్మఠాదీశుడు సిద్ధగురు మణికంఠ శివాచార్యుల పర్యవేక్షణలో స్వామి వారి కల్యాణం జరిగింది.
మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు మల్లన్న కల్యాణంతో ప్రారంభమయ్యాయి. యేటా మార్గశిర మాసం చివరి ఆదివారం నాడు స్వామి వారి కల్యాణం జరగడం ఆనవాయితీగా వస్తున్నది. వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం కల్యాణ మహోత్సవం జరిగింది. వధువుల తరఫున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా… వరుడి తరఫున పడిగన్నగారి వంశస్థులు కన్యాదానం స్వీకరించారు.
ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక సదుపాయ అభివృద్ది సంస్థ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.