నల్లగొండ ప్రతినిధి, ఆగష్టు18(నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో 22-ఏ నిషేధిత జాబితాపై సమగ్ర విచారణ జరిపితే అసలు దోషులెవరో తేలుతుంది. ఆ తర్వాత ఎవరు రాజీనామా చేయాలో? ఎవరిపై చర్యలు తీసుకోవాలో? అన్న విషయంపై స్పష్టత వస్తుంది’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి బాధ్యలైన వారిని వదిలపెట్టే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. 22-ఏ జాబితా తెచ్చినందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామాకు బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు డిమాండ్ చేస్తున్నారన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు మంత్రి కోమటిరెడ్డి పైవిధంగా స్పందించారు. ఇది పొరపాటున జరిగిందా? ఎవరైనా కుట్రతో చేశారా? అధికారులే కావాలని చేశారా? అన్న అంశాలపై విచారణ చేపడుతున్నామని తెలిపారు.
ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా అనిపిస్తున్నదని, అందుకు బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విచారణలో ఈ జాబితాను అడ్డుపెట్టుకొని డబ్బులు తీసుకున్నా తేలుతుందని, అది అధికారులా? ఇంకెవరా? అనేది కూడా వెల్లడవుతుందని చెప్పారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని ఓ హోటల్లో మంగళవారం ఓ మూడు టీవీ చానళ్ల ప్రతినిధులతో మంత్రి 22-ఏ నిషేధిత జాబితా గురించి ప్రత్యేకంగా మాట్లాడటం గమనార్హం. సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన అనంతరం క్యాబినెట్లో ఈ అంశంపై చర్చిస్తామని, అవసరమైతే శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు.
22-ఏ నిషేధిత జాబితా గురించి సీఎం రేవంత్‌రెడ్డికి మూడు నెలల క్రితమే తెలుసని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. తానే ఆ విషయాన్ని సీఎంకు చెప్పానని, ఇప్పుడు ప్రతిపక్షాలు చెప్తున్నాయని పే ర్కొన్నారు. సీఎం ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉన్నదని చెప్తున్నారని, దీన్ని వదిలిపెట్టబోమంటూ చెప్పుకొచ్చారు. యాదగిరిగుట్టలో 42వేల ఎకరాల భూములు ఈ నిషేధిత జాబితాలోకి వెళ్లాయని, అక్కడి ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తనకు మూడు నెలల కిందటే చెప్పారని పేర్కొన్నారు. వారంతా తనను, ఎమ్మెల్యే అయిలయ్యను కలిస్తే భయపడొద్దని భరోసా ఇచ్చామని వివరించారు. నిషేధిత జాబితాలో ఆస్తులున్న వారు తనను నేరుగా కలిసినా తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.