Mahesh Kumar Goud | హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఏమైనా సమస్యలుంటే తనకు, లేదంటే పీసీసీ చీఫ్, రాష్ట్ర ఇన్చార్జి దృష్టికి తీసుకురావాలని పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఒకవేళ తమకు చెప్పడం ఇష్టం లేకుంటే రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ ఇప్పిస్తానని, ఆయనకు చెప్పాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు గురువారం ఎంసీఆర్‌హెచ్చార్డీలో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో పలు అంశాలపై సీఎం రేవంత్ ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సొంత ఎజెండాలను సహించేది లేదని హెచ్చరించినట్టు సమాచారం. సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవం చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపైనే ఉన్నదని స్పష్టంచేసినట్టు తెలిసింది.
రెండు, మూడు రోజుల్లో పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్టు, ఇందుకు సంబంధించి డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించినట్టు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. సీఎల్పీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. కులగణన, ఎస్సీ వర్గీకరణపై తమ ఎమ్మెల్యే అనుమానాలను నివృత్తి చేసినట్టు చెప్పారు. సమావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరూ రాలేదన్నారు. ఎస్సీ వర్గీకరణపై మెదక్‌లో, కులగణనపై సూర్యాపేటలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్టు, మెదక్ సభకు ఖర్గేను, సూర్యాపేట సభకు రాహుల్‌గాంధీని ఆహ్వానించనున్నట్టు వెల్లడించారు.
పార్టీలో గొడవలు సహజమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎల్పీ సమావేశం అనంతరం మాట్లాడుతూ.. పార్టీ కుటుంబం లాంటిదని, చిన్న చిన్న గొడవలు పరిష్కరించుకుంటామని తెలిపారు.