హైదరాబాద్, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ) : సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ వెళ్లొచ్చే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ నివారణకు ఫ్రీవే ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు, అవసరమైతే టోల్ట్యాక్స్ను ప్రభుత్వమే చెల్లించేందుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
సంక్రాంతి సం దర్భంగా హైదరాబాద్ – విజయవాడ రహదారిపై ట్రాఫిక్ రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి కోమటిరెడ్డి మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయో గుర్తెరిగి అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ ట్రాఫిక్ అంశంపై సీరియస్ గా ఉన్నారని, సంక్రాంతి వేళ ట్రాఫిక్ ఇబ్బందు లు లేకుండా టోల్‌ప్లాజాల వద్ద ఫ్రీ వే ఏర్పాటుకు కేంద్రానికి రిక్వెస్ట్ చేస్తామని, ఈ మేరకు కేంద్రమంత్రి గడరీకి లేఖ రాశామని, అవసరమైతే స్వయంగా కలుస్తానని స్పష్టం చేశారు. తప్పనిసరి అయితే టోల్‌ప్లాజాల వద్ద నామినల్ పేమెంట్ చేయడానికి ఆర్అండ్బీ సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు.
జనవరిలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం వెళ్లే లక్షలాది మంది భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని కేంద్రాన్ని కోరుతామని, టోల్ ప్లాజాల వద్ద ఫ్రీగా ఉంటే ప్రయాణానికి అంతరాయం ఉండదనే విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ప్రత్యేక కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని, అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. స్వయంగా మోటర్‌సైకిల్‌పై తిరిగి పరిస్థితిని సమీక్షిస్తానని, ఆయా జిల్లాల కలెక్టర్లు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. బుధవారం తూప్రాన్ పేట్,అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాలను పరిశీలిస్తానని, అధిక వాహనరద్దీ ఉండే రోడ్లపై ప్యాచ్ వర్క్‌లు, ఇతర సౌకర్యాలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులంతా విధుల్లోనే ఉండి సంక్రాంతికి ట్రాఫిక్ ఫ్రీరోడ్లు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
పండుగ రద్దీ రోజుల్లో లేన్లు మూసే పనులు, భారీ యంత్రాలతో చేసేవి అస్సలే వద్దని, అత్యవసరంగా చేయాల్సి వస్తే ట్రాఫిక్ తకువ ఉన్నప్పుడు, రాత్రివేళల్లో మాత్రమే నిర్వహించాలని మంత్రి సూచించారు. రోడ్డు పనులు జరుగుతున్న ప్రతిచోటా స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని, రద్దీ ఎకువగా ఉండే కీలక ప్రాంతాల్లో అదనపు ట్రాఫిక్ పోలీసులను మోహరించాలని ఆదేశించారు. సమీక్షలో ఆర్అండ్బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు హనుమంత రావు, ఇలా త్రిపాఠి, తేజస్ నందలాల్ పవార్, ఎన్హెచ్ఏఐ, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ప్రాంతీయ అధికారులు, ఇంటెలిజెన్స్ ఎస్పీ జగదీశ్వర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ రఘు, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, ఆర్అండ్బీ ఈఎన్సీలు పాల్గొన్నారు.