న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) నిర్వహించిన 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని(యూటీ) 9 చోట్ల తుది ఓటరు జాబితాల్లో 7.9 శాతం లేదా 1.70 కోట్ల ఓటర్లు తగ్గారు. గుజరాత్లో అత్యధికంగా 13 శాతం లేదా 68 లక్షల ఓటర్ల తొలగింపు జరిగింది. కేరళలో అత్యల్పంగా 3.2 శాతం ఓటర్ల తొలగింపు జరిగింది. 2026 అక్టోబర్ 27న సర్‌ను ప్రారంభించినపుడు అండమాన్ , నికోబార్ ద్వీపం, పుదుచ్చేరి, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 21,45,62,215 ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 19,75,33,701కి తగ్గిపోయింది. మొత్తం 1,70,28,514 ఓట్ల తొలగింపు జరిగింది.
పుదుచ్చేరి, లక్షద్వీప్‌కు చెందిన ఓటర్ల జాబితాలు ఫిబ్రవరి 14న విడుదల కాగా గుజరాత్ జాబితా ఫిబ్రవరి 17న విడుదలైంది. మిగిలిన ఆరు రాష్ర్టాల ఓటర్ల జాబితాలు శనివారం విడుదలయ్యాయి. నిరుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మొదటిసారి బీహార్‌లో నిర్వహించిన సర్ని కూడా కలుపుకుంటే ఇప్పటివరకు నికరంగా 2.16 కోట్ల మంది ఓటర్ల పేర్లు లేదా 7.3 శాతం మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు.