నల్లగొండ ప్రతినిధి, జూన్ 8 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి నిరాశే మిగిలింది. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా మంత్రి పదవి ఖాయమన్న ధీమాతో ఉన్న ఆయనకు ఆదివారం షాక్ తగిలింది. మంత్రివర్గ విస్తరణలో తన పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆగ్రహంతో రగిలిపోతూ తెల్లవారుజామునే జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి నేరుగా మెయినాబాద్‌లోని ఫాంహౌస్‌కు వెళ్లిపోయినట్టు తెలిసింది. ఆ తర్వాత రోజంతా ఎవరికీ అందుబాటులోకి రాలేదు. రాజగోపాల్‌రెడ్డిని బుజ్జగించేందుకు గడ్డం వివేక్ ఆదివారం ఉదయం ఆయనింటికి వెళ్లారు.
అయితే, అప్పటికే రాజగోపాల్‌రెడ్డి ఫాంహౌస్‌కు వెళ్లిపోవడంతో వెనుదిరిగారు. వివేక్‌తో పాటు పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ రాజగోపాల్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని తెలిసింది. ఎంపీ ఎన్నికల సమయంలో భువనగిరిలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. తనకు మంత్రి పదవి రాకుండా కొన్ని శక్తులు అధిష్ఠానం వద్ద కుట్రలు చేస్తున్నాయని రాజగోపాల్‌రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఇక నేరుగా అధిష్ఠానంతోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అయినా మంత్రి పదవి రాకపోతే రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా కార్యాచరణకు సిద్ధం చేయాలని నిర్ణయించినట్టు విశ్వాసనీయ వర్గాల సమాచారం.
రాజగోపాల్‌రెడ్డి ఆది నుంచీ మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. నల్లగొండ జిల్లా నుంచి తన అన్న వెంకట్‌రెడ్డికి అప్పటికే మంత్రి పదవి ఉండగానే నిరుడు జరిగిన ఎంపీ ఎన్నికల సమయంలో రాజగోపాల్‌రెడ్డికి అధిష్ఠానం మంత్రి పదవి హామీ ఇచ్చింది. భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటామని అప్పటి ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు హామీ ఇచ్చారు. దీంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని చామలను గెలిపించారు. అదే సమయంలో తన భార్య కోమటిరెడ్డి లక్ష్మికి ఎంపీ టికెట్ ఇస్తే గెలిపించుకుంటానని ప్రతిపాదన పెడితే ఆమెకు ఎంపీ సీటిస్తే మంత్రి పదవి కష్టమని పార్టీ ముఖ్యులు చెప్పినట్టు అప్పట్లో చర్చ జరిగింది. అందుకే తన భార్య ఎంపీ టికెట్టును కూడా తన మంత్రి పదవి కోసం పక్కన పెట్టి చామల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఎంపీగా చామల గెలిచినా రాజగోపాల్‌రెడ్డి మంత్రి కాలేకపోయారు.
రాజగోపాల్‌రెడ్డి విషయంలో ప్రధానంగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రి పదవే అడ్డంకిగా ప్రచారం జరుగుతున్నది. ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ ముఖ్య నేతలు భావిస్తుండడంతోనే తాజా విస్తరణలో రాజగోపాల్‌రెడ్డికి చోటు దక్కలేదని తెలిసింది. ఈ విషయంలో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం బలమైన సా మాజిక వర్గం నుంచి ఒకే ఇంట్లో, ఒకే జిల్లా నుంచి రెండు మంత్రి పదవులు ఎలా సాధ్యమంటూ సందేహాలు లేవనెత్తినట్టు సమాచారం. ఒకవేళ రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే అన్న వెంకట్‌రెడ్డిని మంత్రి పదవి నుంచి తప్పించాలని గతంలోనే రాహుల్‌గాంధీ తేల్చిచెప్పినట్టు తెలిసింది.
ఈ కారణంగానే రాజగోపాల్‌రెడ్డికి ఇప్పుడు స్థానం లభించలేదన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతున్నది. అయితే, గడ్డం వివేక్ ఇంట్లో ఇప్పటికే కొడుకు వంశీ పెద్దపల్లి ఎంపీగా, సోదరుడు వినోద్ ఎమ్మెల్యేగా ఉండగా ఇప్పుడు వివేక్‌కు మంత్రి పదవి వచ్చింది. ఇదే విషయాన్ని రాజగోపాల్‌రెడ్డి లేవనెత్తుతున్నారు. వివేక్‌కు లేని అభ్యంతరం తనకే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తన భార్య ఎంపీ టికెట్టు అడిగితే అది మంత్రి పదవికి ఆటంకంగా మారుతుందని వెనక్కితగ్గి పార్టీ సూచించిన చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి సపోర్టు చేసిన విషయాన్ని రాజగోపాల్‌రెడ్డి గుర్తు చేస్తున్నారు. పార్టీ చెప్పినట్టు నడుచుకుంటూ సొంతంగా జేబు నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎంపీగా చామలను గెలిపించుకోస్తే ఇప్పుడు పార్టీ నమ్మక ద్రోహం చేయడం ఎంతవరకు సబబని రాజగోపాల్‌రెడ్డి రగిలిపోతున్నారు.
మంత్రివర్గ విస్తరణ చర్చకు వచ్చిన ప్రతి సారీ కొందరు పనిగట్టుకుని మరీ తనను అడ్డుకుంటున్నట్టు రాజగోపాల్‌రెడ్డి భావిస్తున్నారు. కొందరు మంత్రులతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి సైతం తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నట్టు అనుమానిస్తున్న ఆయన ఈ విషయాన్ని కేసీ వేణుగోపాల్‌తోపాటు మీనాక్షి నటరాజన్ తేల్చుకోవాలని భావిస్తున్నారు.