చౌటుప్పల్,ఆగస్టు15 : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఎల్లగిరిలో శుక్రవారం రాత్రి వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పదవులు మీకే.. పైసలు మీకే’ అని కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నానని కార్యకర్తలకు వివరించారు.
20 నెలల నుంచి నియోజకవర్గంలో రోడ్డు కాంట్రాక్టర్లకు నిధులు రావడం లేదని, దీనిపై మంత్రి వద్దకు వందసార్లు తిరిగినా ఫలితంలేకుండాపోయిందని చెప్పారు. దీంతో కాంట్రాక్టర్లు చౌటుప్పల్,వలిగొండ రోడ్డు పనులు చేయడం లేదని తెలిపారు. మంత్రి పదవి ఇవ్వనందుకు కనీసం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అయినా ఇవ్వండి అని వేడుకున్నారు. స్థానిక సంస్థలలో పనులకోసం డబ్బులు అడిగే వారిని ఎన్నుకోవద్దని ప్రజలకు సూచించారు.