కరువు కాలం మీద పడి తరుముతుంటే.. తెలంగాణ జనం వలవల ఏడ్సుకుంట బొంబాయ్, దుబాయ్ వలసలు పోతున్నప్పుడు చూసి గుండెలు బాదుకున్నోడు కేసీఆర్. పల్లెపల్లెన పల్లేర్ల దారులు..బీడుబారిన పొలాలు.. పొక్కిలైన వాకిళ్లు..కన్నీరింకిన ముఖాలు చూసి బావురుమన్నోడు కేసీఆర్. ఆ వలపోత నుంచి, ఆ దుఃఖధార నుంచి పుట్టిన నినాదమే ‘జై తెలంగాణ’. దగాపడిన వర్గాలతో దండుకట్టించి, తిరుగుబాటు జెండా పట్టించి, బరిగీసి కొట్లాడి తెలంగాణ తెచ్చింది కేసీఆర్. ఆయన ఎవరికి జాతిపిత అని ఇప్పుడు అడుగుతున్నవాళ్లు..పల్లెపల్లె పిడికిళ్లెత్తిననాడు ఎక్కడున్నరు? ‘సారు’తో గొంతు కలిపి జై తెలంగాణ అని ఒక్కరోజైనా నినదించిండ్రా? ఇయ్యాల పచ్చబడ్డ తెలంగాణ మీద పెత్తనం చేస్తున్నరు. చేయనీ..! జనం బమిసిండ్రు..ఓటేసిండ్రు. అధికారం ఇచ్చిండ్రు. అధికారం దొరికినప్పుడు ఎట్ల చేయాలె? పాడి బర్రె తీరు రాష్ర్టాన్ని సాకి సవరిచ్చి ఇంకింత పెంపు చేయాలె. ఎకరం ఎక్కువ పారించో..బస్తా ఎక్కువ పండించో.. చూపించాలె. గోడు, గోస లేని రాజ్యంగా నిలబెట్టాలె. రెట్టింపు సంక్షేమాన్ని, సంతోషాన్ని నింపాలె, అంతకుముందు పాలించిన పాలకుడిని మరిపించాలె. అగో..! అదీ పరిపాలన తరీక.
కాంగ్రెస్ రెండేండ్ల ఏలుబడి ఏం చేసింది? 880 మంది రైతులను మింగింది. 126 మంది పసిపిల్లల చావులతో బడులనే వల్లకాడు చేసింది. తెలంగాణను మళ్లీ మృత్యుముఖంలో నిలిపింది. పల్లెపల్లెన మళ్లీ చావు డప్పు మోగించింది. అయినా ఈ మానవ పెను హననంతో వారికేం పని? ఖజానాల పడ్డ ఇత్తు పడ్డట్టుగా కడగ నాకాలె. అంతో ఇంతో మిగిల్తే ఢిల్లీకి మూట గట్టాలె. అంతకుమించి ఈ తెలంగాణతో వాళ్లకేం పని? ఇక్కడి జీవితాలతో వాళ్లకేం పట్టి?
అధికారం అప్పజెప్పిన పొద్దు నుంచి ఈ పొద్దు వరకు గురుకులాలే మృత్యుకుహరాలై..126 మంది పసిబిడ్డల గొంతు నులిమింది. ‘సారు’ పూనుకొని, సాగును సక్కదిద్ది, సావు కోరల నుంచి రైతును బయటకు తీసినట్టే అనుకున్న ఆనందం కండ్ల ముందే ఆవిరైపోతున్నది. భరోసా దొరకని రైతు మళ్లీ చావు దిక్కే మొగ్గుతున్నడు. మిత్తికి పోయి, అప్పులపాలై బలవన్మరణాల బాట పడుతున్నడు. కేసీఆర్ దిగిపోయే చివరి ఏడాది నాటికి రైతు ఆత్మహత్యలను 56కు కుదించి ఆకుపచ్చ తెలంగాణను కాంగ్రెస్ పాలకుల చేతుల్లో పెట్టిండు. వాళ్లేమో ఈ రెండేండ్లలో 880 మంది రైతు ఆత్మహత్యలను ముందు పెట్టిండ్రు.
కట్టుకున్న ఇండ్లను పట్టపగలే పాలకుల బుల్డోజర్ నేలమట్టం చేస్తుంటే దిక్కుతోచక బిక్కచచ్చిన జనం గగ్గోలు పెడుతున్నరు. ఆయన కొలువు కూటం మీదకి ఎక్కిన దినం నుంచి ఖమ్మం జిల్లా వెలుగుమట్ల విధ్వంసం వరకు 4 వేల ఇండ్లు కూలగొట్టినట్టు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ లెక్కలు చెప్తున్నది. మూసీ ప్రక్షాళన పేరుతో మరో 10,017 వేల ఇండ్లు నేలమట్టం చేసేదాకా నిద్రపోమని ఏలికలు గెజిట్ పత్రం పట్టుకొని తిరుగుతున్నరు.
సింగపూర్ కన్సల్టెంట్లు రూపొందించిన ప్రజెంటేషన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గాలిలో గ్రాఫిక్స్ మేడలు కడుతుంటే..అచ్చంగా అమరావతి డిజైన్ల చంద్రబాబే పూనినట్టు అనిపించింది. మూసీ బాధిత జనులను, వారికి అండగా నిలిచిన ఉద్యమకారులను గృహనిర్బంధం చేసి శుక్రవారం తాజ్ కృష్ణా హోటల్లో కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య చేసిన గ్రాఫికల్ పవర్ పాయింట్లో రేవంత్‌లో ఆసాంతం అబ్రకదబ్ర చంద్రబాబు నాయుడే కనిపించాడు. అభివృద్ధిని విస్మరించి, విధ్వంసాలను విస్తరించాలనే కుతూహలాన్ని..ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్‌తో నింపేసిన పవర్ పాయింట్ రంగులరాట్నం బయటపెట్టింది.
2025 డిసెంబర్లో రైతుల ఖాతాల్లో జమ చేయవలసిన రైతు భరోసా డబ్బులు 2026 మార్చి వరకు కూడా దిక్కులేదు. ఇంకో నెల రోజులు పోతే ఖరీఫ్ సీజన్ అందుకుంటది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్నది. ఎన్ని దేవుండ్ల మీద ఒట్టేసి చెప్పినా..ఇప్పట్లో ఇచ్చే సూచనలైతే కనిపించటం లేదు. ‘నేనైతే రైతు భరోసా వేసిన! కానీ రైతుల ఖాతాల్లో పడ్డయో, లేదో నాకైతే తెల్వది’ అని ముఖ్యమంత్రి అమాయకపు ప్రకటన వెనుక మర్మమేమిటి? కేసీఆర్ ఉన్నప్పుడు సరిగ్గా నాటుకు, నాటుకు మధ్య రైతుబంధు పడ్డది. రేవంత్‌రెడ్డి వచ్చి ఓటుకు, ఓటుకు మధ్య భరోసా పెట్టిండు. ఎప్పుడు ఓట్లొస్తే అప్పుడు, ఎక్కడ ఓట్లొస్తే అక్కడ నిధులు జమ చేస్తున్నడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇదే ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు..‘కేసీఆర్ రైతుబంధు రూ.5 వేల చొప్పున రెండు పంటలకే ఇచ్చిండు. మూడు పంటలు పండిస్తే మూడుసార్లు రైతుబంధు ఎందుకు ఇస్తలేవు? అతి తెలివి తేటలా?’ అని నోటికి ఎంతొస్తే అంత అన్నడు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతుకు, కమతం రైతుకు ఇద్దరికీ రైతు భరోసా! ఇప్పుడు తీసుకుంటే రూ.10 వేలే! అదే మా ప్రభుత్వం వచ్చాక రైతుభరోసా తీసుకుంటే రూ.15 వేలు!’ అని నమ్మబలికిండు. గద్దెనెక్కి అసలు రంగు బయటపెట్టిండు. కౌలు రైతుకు, కమతం రైతుకు ఇద్దరికీ మొండిచెయ్యి చూపించిండు.
రేవంత్ పాలనలో అంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం వైపు నుంచి ఒక్క ప్రకటన కూడా లేదు. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లోని వెల్కిచర్లలో భగీరథ ప్రయత్నంలో దగాపడిన ఓ కుటుంబం మూకుమ్మడి ఆత్మహత్యకు పాల్పడ్డది. 6 ఎకరాల భూమిలో 300 ఫీట్ల లోతుకు బోరు వేసినా నీళ్లు పడలేదు. భర్త మరో బోరు వేయించేందుకు సిద్ధమైన నేపథ్యంలో అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నామనే భయంతో ఆ రైతు భార్య శైలజ తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఈ పాటికి పూర్తయి ఉంటే, సాగునీళ్లు అందుంటే..ఆ సావులు ఉండేవా? ఆ సామూహిక హననానికి కారణం కాంగ్రెస్ సర్కార్ కాదా?
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు మొదలు పెట్టారు. 170 టీఎంసీల జలాలను ఒడిసిపట్టి ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో 90 శాతం పనులు పూర్తి చేశారు. మిగిలిన ఇంకో 10 శాతం పనులు ఇప్పటి పాలకులు పూర్తి చేసి ఉంటే పాలమూరు పచ్చబడేది. రైతు ఆత్మహత్యలు ఆగేవి. ఇటువంటి ఆలోచనలు కేసీఆర్ తప్ప ఎవరు చేస్తా రు? ‘గాంధీ’ కుటుంబానికి కష్టమొస్తే రూ.1,00 0 కోట్లు పోగేసి మూటగట్టి ఢిల్లీకి మోయాలనే ఆలోచన చేస్తారు. కానీ. రైతు కష్టాలు వాళ్లకు ఎందుకు తడుతయ్.
ప్రత్యేక రాష్ట్రం వచ్చేనాటికి తెలంగాణలో 294 గురుకులాలు ఉండేవి. పదేండ్లలో కేసీఆర్ వాటిని 1,023 చేసి, పిల్లల ప్రతిభకు పదును పెడితే దేశమంతా తెలంగాణ వైపు చూసింది. ఎంసెట్‌తో సహా, నీట్, జేఈఈ, సీయూఈటీ లాంటి జాతీయ ఎంట్రెన్స్ టెస్టుల్లో గురుకుల విద్యార్థులు తమ సత్తా చాటారు. ఏడుగురు తెలంగాణ గురుకుల విద్యార్థులు ఆఫ్రికాలోకెల్లా అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించి, ఆ కొండ కొమ్మున 100 అడుగుల జాతీయ జెండా, ఆ పక్కనే కేసీఆర్ చిత్రపటాన్ని నిలబెట్టి సెల్యూట్ కొట్టి గుండెల నిండా గాలి పీల్చుకున్న సన్నివేశాలు చూశాం. ఆ తర్వాత తెలంగాణ గురుకులాల నుంచి పర్వతారోహకులు వరుస కట్టారు. ఇపుడు కాంగ్రెస్ హయాంలో కేవలం రెండేండ్లలో గురుకులాలు ఎకాఎకిన పాతాళానికి దొర్లిపడి మరణం అంచున మూలుగుతున్నయి.
చదువుల సంగతి దేవుడెరుగు.. కనీసం విద్యార్థుల ప్రాణాలకు భద్రత లేకుండా పోతున్నది. గురుకులాల్లో కలుషితాహారం, విషపు కీటకాదుల భౌతిక దాడితో విద్యార్థులు తలలు వాలుస్తున్నారు. ఈ రెండేండ్ల కాలంలో 54 మంది బాలికలు, 72 మంది బాలురను గురుకులాలు మింగేశాయి. నిన్నటికి నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో విషాహారం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థత బారిన పడ్డారు. అంతకుముందు జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో నెల రోజుల వ్యవధిలో ఆరుగురు విద్యార్థులను పాము కాటేసింది. వీరిలో ఇద్దరు చనిపోయారు. ఖమ్మం జిల్లా దానవాయిగూడెం బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థినికి ఎలుకలు కరిచాయి. ఒకసారి రెండుసార్లు కాదు..ఏకంగా 15సార్లు ఎలుకలు కరిచినట్టు చెబుతున్నారు. అయినా ప్రభుత్వం గురుకులాల్లో విద్యార్థుల భద్రత కోసం ఒక్క ప్రణాళిక కూడా రూపొందించిన దాఖలాలు లేవు.
పరిపాలనపై ముద్ర వేయడం అంటే సుతారం లేకుండా తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలను విధ్వంసం చేయటం కాదు. మూసీ నది ప్రక్షాళన పేరుతో ఇండ్లను ఆగం, అంగడి చేయడమూ కాదు. కపాలంలో మెదడు కరిగేటట్టు రాష్ట్ర వికాసం కోసం ఆలోచనలు చేయటం. కడుపుల పేగులు కదిలే దాకా పనిచేయటం. కడుపు కట్టుకొని నిలబడి వ్యవస్థలను ప్రక్షాళన చేయటం. కూలిపోయిన చెరువులను పునరుద్ధరించటం. నదులకు నడకలు నేర్పి, పరుగెత్తే నీళ్లను కరువు నేల మీదికి మళ్లించటం. బడిపిల్లల భవిష్యత్తుకు హామీ ఇవ్వటం. కరోనా లాంటి విలయం వచ్చినా..మా సీఎం ఉన్నడు..తడకలు అడ్డం పెట్టయినా ప్రళయాన్ని ఆపుతాడనే నమ్మకం, ధైర్యం సామాన్యునిలో కల్పించటం. ఒక్కొక్క రంగాన్ని చక్కదిద్ది జనజీవన ప్రమాణాల్లో మార్పు తీసుకరావడం, అట్టడుగు వ్యక్తి కూడా పురోగమించగలిగే సాధికార వాతావరణం కల్పించడం.
మనకు బీడువడ్డ తెలంగాణ వద్దు. నిన్నటి బంగారు తెలంగాణ కావాలి. ఆనాడు సబ్బండ జాతులం, సకల జనులం ఏకమై కేసీఆర్ నాయకత్వంలో జై తెలంగాణ అని ఎైట్ల్లెతే నినదించామో.. ఇప్పుడు అదే ‘సారు’ నాయకత్వంతో ‘సేవ్ తెలంగాణ’ అని రణనినాదం చేద్దాం. ప్రాకృతిక, మానవ వనరుల సంపూర్ణ విధ్వంసం జరుగకముందే తెలంగాణ రాష్ర్టాన్ని కాపాడుకుందాం.
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు