నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ) : ‘రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు ఇక్కడ చెల్లవు.. నా సొంత పాలసీలే మునుగోడులో అమలవుతాయి’ అని స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేస్తున్న ప్రకటనలు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో అటు పార్టీలో కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్త మద్యం పాలసీ మునుగోడులో చెల్లదంటూ తాను సూచిస్తున్న సొంత పాలసీకి అనుగుణంగా ఇక్కడ షాపులు నడుపుతామంటేనే టెండర్లల్లో పాల్గొనాలని ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి స్పష్టంచేశారు. దీంతో ప్రస్తుతం మునుగోడులో మద్యం టెండర్లు వేసేందుకు వ్యాపారులు వెనుకంజ వేస్తున్నారు. ఇదే విషయమై నల్లగొండ జిల్లా ఎక్సైజ్ శాఖ ప్రభుత్వానికి నివేదించింది.
దీంతో పాటు గతంలో ఇక్కడ మద్యం వ్యాపారం చేసిన కొందరు రాజగోపాల్‌రెడ్డి తీరుపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా జూపల్లి స్పందిస్తూ ఎమ్మెల్యేల స్థానిక నిర్ణయాలు చెల్లబోవంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మద్యం పాలసీనే అమలవుతుందని రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో రాజగోపాల్‌రెడ్డి తన స్వరాన్ని మరింత పెంచుతూ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టేశారు. అసలు బెల్ట్‌షాపులను ఎత్తివేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిందే కాంగ్రెస్ పార్టీ కదా? అని కౌంటర్‌కు దిగారు. దీంతో వివాదం మరింత ముదిరిపాకన పడ్డట్టయింది.
ఇప్పటికే మునుగోడులో ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్నట్టుగా ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తి కావస్తున్నా నేటికీ మునుగోడు గడ్డపై సీఎం గాని, మంత్రి గాని అడుగుపెట్టిన దాఖలాల్లేవు. తాను మంత్రి కావాలి.. అప్పుడే తనతో కలిసి సీఎం లేదా ఇతర మంత్రులు మునుగోడు రావాలన్న పంతం పట్టారు. దీనికి తోడు తనకు కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రి పదవి ఇస్తానని చెప్పి మోసం చేసిందన్న ఆక్రోశంతో ప్రభుత్వ పెద్దలపైన తరుచూ విరుచుకు పడుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌ను ఎక్స్ వేదికగా పలుమార్లు టార్గెట్ చేసిన రాజగోపాల్‌రెడ్డి తాజాగా తుంగతుర్తిలో జరిగిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి దశదినకర్మలో సీఎం ముఖం చూసేందుకు ఇష్టపడక ఆయన వెళ్లిపోయాకే అక్కడికి వచ్చి వెళ్లారు. ఇదంతా జరుగుతుండగానే మద్యం టెండర్ల విషయంలో ఈ నెల 13న ప్రభుత్వ పాలసీని టార్గెట్ చేస్తూ సొంత ఎజెండా ప్రకటించారు. ఇది ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నది.
రేవంత్‌రెడ్డి సర్కారు ఓ వైపు మద్యం టెండర్లతో పాటు మద్యం అమ్మకాలతో విచ్చలవిడి ఆదాయం కోసం టార్గెట్లు పెటి వేదిస్తుంటే రాజగోపాల్‌రెడ్డి మాత్రం మునుగోడులో అదేం చెల్లదన్నట్లుగా హుకూం జారీ చేశారు. ఇప్పటికే నిరుడు ఇక్కడ బెల్ట్‌షాపులను నిషేధించిన రాజగోపాల్‌రెడ్డి ప్రస్తుత మద్యం టెం డర్లపైనా దృష్టి సారించారు. మునుగోడులో మద్యం దుకాణాలు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే నడపాలని, ఊరికి దూరంగా మద్యం షాపులు ఏర్పాటు చేయాలని, మద్యం షాపుల వద్ద సిట్టింగ్‌లను, గ్రామాల్లో బెల్ట్ షాపులను, మద్యం సిండికేట్లను అనుమతించబోమని ప్రకటించారు. మద్యం దుకాణాలకు ఆయా మండలాలకు చెందిన స్థానికులే టెండర్లు వేయాలని స్పష్టం చేశారు.
ఈ నిబంధనలకు ఒప్పుకొంటేనే మద్యం టెండర్లలో పాల్గొనాలని ఆదేశించారు. మద్యంపై ఈ నిర్ణయాలు ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో మంటలు రేపుతున్నాయి. ఓ వైపు మద్యం ద్వారా విచ్చలవిడి ఆదాయం కోసం కాంగ్రెస్ సర్కారు దరఖాస్తు ఫీజులను రూ.2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచింది. మున్సిపాలిటీల పరిధిలో టెండర్లో షాపు వచ్చిన వ్యాపారి ఆ మున్సిపాలిటీలో ఎక్కడైనా దుకాణం ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీంతోపాటు గడువు సైతం ఈ నెల 23 వరకు పొడగించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మద్యంపై ఆ దాయం కోసం అర్రులు చాస్తుంటే రాజగోపాల్‌రెడ్డి మాత్రం ఇవేమీ తనకు సంబంధం లేదంటూ ప్రభుత్వ పాలసీపై ధిక్కారస్వరం వినిపిస్తున్నారు.
రాజగోపాల్‌రెడ్డి తాజాగా ఓ యూట్యూబ్ చానల్ వేదికగా చేసిన వ్యాఖ్యలు సొంత ప్రభుత్వాని, పార్టీ పెద్దలను మరింత ఇరకాటంలోకి నెట్టాయి. ఇప్పటికే సీఎంను నేరుగా టార్గెట్ చేస్తూ ఎక్స్ వేదికగా పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తన నియోజకవర్గానికి అస్సలు నిధులే ఇవ్వడం లేదని చెప్తున్నారు. సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే నిధులన్నీ మోసుకెళ్తున్నారని విమర్శించారు. తాజాగా మద్యం పాలసీ విషయంలో ప్రభుత్వం తీరునే నేరుగా టార్గెట్ చేశారు. మునుగోడులో తన సొంత ఎజెండా అమలు కోసం నేరుగా కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని అంశాలను తెరపైకి తెచ్చారు. సొంత ప్రభుత్వంలో విపక్ష ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, ఆయన తరుచూ చేస్తున్న వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్‌కు ‘గొంతులో పచ్చి వెలక్కాయ’ చందంగా మారుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.