హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర రైతాంగానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకుని రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మరణశాసనం లిఖిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ మండిపడ్డారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యవసాయాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టి రైతుల బతుకులను ఛిద్రం చేశారని ఆరోపించారు. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ధీమాగా బతికిన రైతులు.. ఇప్పుడు మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి కష్టాల్లోకి నెట్టివేయబడ్డారని విమర్శించారు.
ఎన్నికల సమయంలో ప్రతిగింజనూ కొనుగోలు చేస్తామని, రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి అబద్ధపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని ఎద్దేవా చేశారు. 71 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం, ఒక్కసారైనా పంట కొనుగోళ్లపై కేంద్రంతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నాడు కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులతో సాగునీరు అందించి 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, రైతుబీమా పథకాలతో కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చరని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, వేధింపులతో ఇప్పటికే రాష్ట్రంలో వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన ప్రతిగింజనూ కొనకుంటే రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని కోలేటి దామోదర్ హెచ్చరించారు.