హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురసరించుకుని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించాలని సూచించారు.
దశాబ్దాలపాటు సాగిన అణచివేతపై పోరాడి, అనేక ఆవాంతరాలను అధిగమించి, ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఆ తెలంగాణను దేశానికే దిక్సూచిగా కేసీఆర్ తీర్చిదిద్దారని చెప్పారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, విద్య, వైద్యం తదితర సంక్షేమ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఒకనాడు ఎడారిలా ఉన్న తెలంగాణను, నేడు కోటి ఎకరాల మాగాణంగా మార్చి, అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని కోలేటి దామోదర్ తెలిపారు.