కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలు ఇప్పిండని.. అన్యాయాలను ప్రశ్నించిండని, మోసాలను ఎండగట్టిండని కేటీఆర్‌పై ముఖ్యమంత్రి పగబట్టిండు. ఇది కేటీఆర్ మీద దాడి కాదు.. రాష్ట్ర ప్రజల మీద, బీఆర్ఎస్ మీద, ప్రశ్నించే గొంతుకల మీద దాడి.
-హరీశ్‌రావు
Harish Rao | మెదక్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ)/నర్సాపూర్ : ‘పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. పోరాడితే పోయేదేం లేదు రైతుబంధు వస్తది.. రుణమాఫీ జరుగుతది.. మీ అందర్నీ చూస్తుంటే మళ్లీ ఉద్యమ రోజులు గుర్తుకు వస్తున్నయ్’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారంలో నిర్వహించిన రైతు గర్జనకు తరలివచ్చిన వేలాది మంది రైతులను చూసి ఆయన ఉత్సాహంగా ప్రసంగించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హరీశ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రైతు రుణమాఫీ చేసేందుకు ఎమ్మెల్యే సునీతారెడ్డి రైతు దీక్ష ఏర్పాటు చేశారని చెప్పారు. పంట చేతికొచ్చినా రైతుబంధు ఇవ్వలేని కాంగ్రెస్ సర్కార్ అసమర్థతను ఎత్తిచూపేందుకే ఈ దీక్ష అని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా, ఎవరూ అడగకున్నా రైతుల కోసం రైతు బంధు పెట్టింది కేసీఆర్ అని గుర్తుచేశారు. ఎకరానికి పదివేల రైతుబంధు, ఐదు లక్షల రైతుబీమా అందించిందీ కేసీఆరేనని చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చింది, రైతుల పంటను గింజ లేకుండా కొన్నది కూడా కేసీఆరేనని, అందుకే కేసీఆర్ రైతుల సీఎంగా పేరు తెచ్చుకుంటే రేవంత్‌రెడ్డి బూతుల సీఎంగా చరిత్రలో నిలిచాడని హరీశ్ ఎద్దేవాచేశారు.
కూల్చిందెక్కడ.. నడిచిందెక్కడ?
‘నువ్వు కూల్చిన ఇండ్లెక్కడ.. కాలిన కడుపులెక్కడ, నువ్వు నడిచిందెక్కడ?’ అని రేవంత్‌రెడ్డిని హరీశ్ సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లో పేదల ఇండ్లు కూల్చి, వారి కడుపు కాల్చి పాదయాత్ర చేసేది మాత్రం నల్లగొండలోనా అంటూ చురకలంటించారు. ‘రేవంత్‌రెడ్డీ.. కూల్చిన ఇండ్ల వద్దకు వెళ్దాం.. కాలిన కడుపులను అడుగుదాం.. హైదరాబాద్‌లో నడుద్దాం రా’ అంటూ సవాల్ విసిరారు. ‘ఎక్కడైతే మూసీలో ఇండ్లు కూలగొట్టావో అక్కడి నుంచే పాదయాత్ర చేద్దాం’ అని చెప్పారు. ‘66 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీల పుణ్యమే మూసీ కాలుష్యం.. కేసీఆర్ రూ.3800 కోటు ్లఖర్చు పెట్టి మూసీ పునర్జీవాన్ని మొదలుపెట్టిండ్రు’ అని గుర్తుచేశారు.
రేవంత్ నోరు తెరిస్తే అబద్ధాలు
రేవంత్‌రెడ్డి మాటలు చూస్తుంటే రాజకీయాల్లో కూడా ఏ సర్టిఫికెట్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవాచేశారు. నాయకుడు ఎవరైనా ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలని, మంచిబాటలో నడవాలని సూచించారు. ‘రేవంత్‌రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప ఏమీ రావు’ అని ఎద్దేవాచేశారు. తెలంగాణ కోసం మొట్టమొదటి రాజీనామా చేసిన కొండా లక్ష్మ ణ్ బాపూజీ నల్లగొండలో పుట్టిండని రేవంత్‌రెడ్డి అంటున్నాడని.. కొండా లక్ష్మణ్ బాపూజీ పుట్టింది ఆదిలాబాద్‌లో అని, ఈ ముఖ్యమంత్రి నోటికొచ్చిన అబద్ధాన్ని చెప్తూ సీఎం కుర్చీ విలువ దిగజార్చుతున్నాడని మండిపడ్డారు.
అధికారులు, పోలీసులు ఖబర్దార్
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ 100 సీట్లతో అధికారంలోకి రావడం ఖాయమని హరీశ్ ధీమా వ్యక్తంచేశారు. ‘ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంటి మీదనే దాడి చేశారు.. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టినా, వేధించినా తస్మాత్ జాగ్రత్త.. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వ మే.. అధికారులు, పోలీసులు ఖబర్దార్.. మా ప్రభుత్వంలో వడ్డీతో సహా చెల్లిస్తం ’ అని హెచ్చరించారు.
మంత్రిపై ఎందుకు కేసు పెట్టరు?
కాంగ్రెస్ గ్యారెంటీలపై కేవలం ప్రశ్నించినందుకే సోషల్ మీడియా ఆక్టివిస్ట్ రంజిత్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని, మరి తెలంగాణ సాధకుడు కేసీఆర్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చంపేస్తానని, మూడు ముక్కలు చేసి మూసీలో వేస్తానని బహిరంగంగా మాట్లాడినా పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదని హరీశ్ ప్రశ్నించారు. హింసను ప్రేరేపించేలా ఓ మంత్రి మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడని మండిపడ్డారు. ‘డీజీపీని సూటిగా అడుగుతున్నా.. రంజిత్‌రెడ్డి మీద కేసు పెట్టారు.. మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి మీద ఎందుకు కేసు పెడుతలేరు?’ అని ప్రశ్నించారు. ఇలా మాట్లాడిన వారిని మంత్రివర్గం నుంచి భర్త్తరఫ్ చేయాలని గవర్నర్ కోరుతున్నట్టు చెప్పారు. నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలో నిరహారదీక్ష చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇతన్ని వదిలేసింది.. కేసీఆర్ ఆదేశాలతో మేమంతా వెళ్లి ఆయనకు ధైర్యం చెప్పినం. కేసీఆరే దీక్ష విరమింపజేసి ప్రాణాన్ని కాపాడిండు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొడుకు చనిపోతే కేసీఆర్ ఓదార్చిండు.. అటువంటి కేసీఆర్‌ను పట్టుకొని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇటువంటి భాష మాట్లాడవచ్చునా?’ అని హరీశ్ నిలదీశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో పాటు ఏడోది బూతుల గ్యారెంటీ అని పెట్టింటే బాగుండేదని ఎద్దేవా చేశారు.
30శాతం వడ్లు దళారుల పాలు
తెలంగాణలో 30 శాతం వడ్లు దళారులు పాలయ్యాయని, ప్రభుత్వం ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదని, రైతులు దళారులకు రూ.1700కు అమ్ముకుంటున్నారని హరీశ్‌రావు తెలిపారు. ‘రైతులకు రూ.2300 మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ కలిపి రూ.2800 కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి. కానీ, రేవంత్‌రెడ్డి చేతగాని ప్రభుత్వం వల్ల వెయ్యి రూపాయలు రైతు నష్టపోతున్నాడు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రకు పోతే డిప్యూటీ సీఎం మరో ప్రత్యేక విమానంలో జార్ఖండ్ వెళ్లారట, ఇంకో మంత్రి సీతక్క కేరళకు, మరో మంత్రి శ్రీధర్‌బాబు మలేషియాకు వెళ్లారట. ప్రజలేమో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే గాలి మోటర్లపై సీఎం, మంత్రులు జల్సాలు చేస్తున్నరు.. రైతులను, ప్రజలను గాలికి వదిలేసిండ్రు’ అని దుయ్యబట్టారు. ఏం సాధించారని 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు జరుపుతారని ప్రశ్నించారు.
మల్లన్నసాగర్ లేకుంటే మూసీకి గోదావరి నీళ్లు వస్తయా?
కేసీఆర్ మల్లన్న సాగర్ కట్టి ఉండకపోయే గోదావరి నీళ్లు మూసీకి వస్తాయా? అని హరీశ్ ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా మీద రేవంత్‌రెడ్డి ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నాడని, నల్లగొండ ప్రజల నుంచి ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొట్టింది కేసీఆర్ అని గుర్తుచేశారు. నల్లగొండ ప్రజల నడుములు వంకర పోవడానికి రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలే కారణమని చెప్పారు.
రాష్ట్ర ప్రతిష్ఠ పెంచిన కేటీఆర్..
మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తామని లీకులు పంపిస్తున్నారని, కేటీఆర్ ఏం చేశాడని అరెస్ట్ చేస్తారని ప్రభుత్వాన్ని హరీశ్ ప్రశ్నించారు. కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచాడని, రాష్ట్ర గౌరవ ప్రతిష్టలు పెంచాడని, ముంబయి, ఢిల్లీ, బెంగళూర్‌ను కాదని హైదరాబాద్‌కు పెట్టుబడులు తెచ్చాడని, ఐటీలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపాడని కొనియాడారు. డైవర్షన్ రాజకీయం కోసం కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం అని కాంగ్రెస్ నాయకులు లీకులిస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి అంటే వినాశనం : దేశపతి
‘కేసీఆర్ అంటే వికాసం.. రేవంత్ రెడ్డి అంటే వినాశనం’ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. కొల్చారం రైతు గర్జనలో ఆయన మాట్లాడుతూ ‘డిసెంబర్ 7 వస్తే యాడాది దినం.. సంవత్సరీకం.. ఏడాది కూడా నిండలేదు.. ఈ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది.. మార్పు మార్పు అన్నారు.. ఇది మార్పు కాదు ఏమార్పు’ అని మండిపడ్డారు. రైతు గర్జనలో ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్యరావు, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, యాదవరెడ్డి, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మె ల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మెదక్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, సమావేశంలో వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్ పాల్గొన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో అబద్ధాలు సిగ్గుచేటు
తెలంగాణలో ఆరు హామీలు అమలు చేశామని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చెప్పుకొంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదని హరీశ్ మండిపడ్డారు. ‘మహిళలకు రూ.2500 ఇస్తామన్నరు.. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నరు.. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నరు.. 4వేల పెన్షన్ ఇస్తామన్నరు.. ఒక్కటైనా నెరవేర్చిండ్రా?’ అని నిలదీశారు. అన్ని హామీలను ఎగ్గొట్టి తెలంగాణ ప్రజలను మోసం చేసిన రేవంత్‌రెడ్డి.. మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం గ్యారెంటీలు అమలు చేశామని అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని దెప్పిపొడిచారు. ‘రేవంత్‌రెడ్డి వచ్చాక గ్యారెంటీకి.. బాండ్ పేపర్‌కు విలువ లేకుండా పోయింది. కాంగ్రెస్ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి గ్యారెంటీ అనే పదానికే విలువ తీసేసింది’ అని ఎద్దేవాచేశారు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని రేవంత్‌రెడ్డి వాగుతున్నడు.. యాదాద్రిలో పూజ చేసిన ఆలయమే కేసీఆర్ ఆనవాలుకు ప్రతిరూపం కదా? కేసీఆర్‌ను తిడుతవ్.. కేసీఆర్ కట్టిన గుడిలో పూజలు చేస్తవ్.. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడమంటే తెలంగాణనే లేకుండా చేయడం.
-హరీశ్‌రావు
నల్లగొండకు ఫ్లోరైడ్ పీడ కాంగ్రెస్, టీడీపీల పుణ్యమే.. కేసీఆర్, తెలంగాణ విలువ ఆంధ్రాబాబుల బ్యాగులు మోసిన రేవంత్‌రెడ్డికి ఎలా తెలుస్తది? తెలంగాణను ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దింది కేసీఆర్.. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగవు.. రేవంత్‌రెడ్డి తిట్లకు ఈ గులాబీ జెండాలు భయపడవు..
– హరీశ్‌రావు
మూసీ కంపు కంటే రేవంత్‌రెడ్డి నోటి కంపు ఎక్కువైంది.. ఇంత బజారు భాష మాట్లాడే ముఖ్యమంత్రి దేశంలోనే ఎక్కడా లేడు. టీవీలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతుంటే కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ల పిల్లలు చెడిపోతారనే భయంతో చానళ్లు మారుస్తున్నరు. రేవంత్‌రెడ్డికి ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి. సినిమాలకు సెన్సార్ బోర్డు ఉన్నట్టు రాజకీయ నాయకుల భాషకు కూడా ఓ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. – హరీశ్‌రావు