Kishan Reddy | కొత్తగూడెం సింగరేణి, జనవరి 25: కొత్తగూడెంలో రెండు రోజుల పర్యటన జరిపిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి నైని కోల్ బ్లాక్‌లో జరిగిన అవినీతి, అక్రమాలపై ఏమీ తేల్చలేదు. కేవలం సింగరేణి అభివృద్ధి, ఆ సంస్థకు సంబంధించిన ఆర్థిక అంశాలతోపాటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్పై నిందారోపణలకే పరిమితమై తన పర్యటన ముగించారు. ఈ పర్యటన సందర్భంగా సింగరేణి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఒక రకంగా, ఆ తర్వాత బీజేపీ కార్యకర్తల సమావేశంలో మరో రకంగా మాట్లాడి అందరినీ గందరగోళంలోకి నెట్టారు. కొత్తగూడెంలోని ఇల్లెందు క్లబ్లో శనివారం రాత్రి సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు, అన్ని విభాగాల జీఎంలతో సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపిన కిషన్‌రెడ్డి.. ఆ తర్వాత ఓబీ కాంట్రాక్టర్లతో కూడా సమావేశమయ్యారు.
అనంతరం ఆయన మీ డియాతో మాట్లాడుతూ.. సింగరేణి సంస్థలో వృథా ఖర్చులను, బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలని, యువ కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేయాలని, ఇతర ఖనిజాలను కూడా ఉపయోగించుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారా న్ని అభివృద్ధి చేసుకోవాలని డైరెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు చెప్పారు. డబుల్ మస్టర్ విధానాన్ని రద్దుచేసి వారం రోజులు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటే సింగరేణికి ఏటా రూ.250 కోట్లు ఆదా అవుతుందని, ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని సూచించినట్టు తెలిపారు. నైనీ బ్లాక్ గురించి విలేకరులు ప్రశ్నించడంతో.. ఆ వ్యవహారంపై కమిటీ వేశామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో సైట్ విజిట్ నిబంధనను మార్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆదివారం కొత్తగూడెం ఏరియా పీవీకే మైన్‌ను సందర్శించినప్పుడు కూడా ఆయన సౌమ్యంగానే మాట్లాడారు. సింగరేణి అభివృద్ధే తమ ధ్యేయమని గారడీ మాటలు మాట్లాడి వెళ్లిపోయారు.
కొత్తగూడెం క్లబ్లో జరిగిన మున్సిపల్ ఎ న్నికల విజయ సంకల్ప సభలో కిషన్‌రెడ్డి మా ట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సింగరేణి దోపిడీకి గురైందని, ఆ తర్వాత వచ్చి న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దోపిడీకి పాల్పడుతున్నదని ఆరోపించారు. ప్రస్తుతం కార్మికులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో సింగరేణి ఉన్నదని, బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి జీతా లు ఇస్తున్నదని చెప్పారు. అర్జెంటీనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్‌కు వస్తే సింగరేణి సంస్థ నుంచి రూ.10 కోట్లు ఖర్చు చేశార ని ఆవేదన వ్యక్తంచేశారు. ‘సింగరేణిలో కాం ట్రాక్టు కార్మికులకు జీతాలు, మెడికల్ రీయంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బుల్లేవు. కానీ, విదే శీ క్రీడాకారుడికి డబ్బులు ఇస్తారు. మన సింగరేణి కార్మికులు కష్టపడి సంపాదించిన డబ్బు ను అడ్డగోలుగా ఖర్చు పెట్టే అధికారం సీఎం రేవంత్‌కు ఎవరిచ్చారు?’ అంటూ ఆగ్ర హం వ్యక్తంచేశారు.
జెన్‌కోల్లో విద్యుత్తు ఉత్పత్తి కోసం సింగరేణి బొగ్గును ఉపయోగించుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.35 వేల కోట్లు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.51 వేల కోట్లు బకాయి పడిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నా రు. రేవంత్ ప్రభుత్వం సింగరేణి నుంచి బొగ్గు తీసుకోవడమే తప్ప ఒక్క రూపాయి చెల్లించిన దాఖలాలు లేవని, అందుకే సింగరేణిలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశా రు. దీంతో నైనీ బ్లాక్‌లో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికితీసేందుకు కిషన్‌రెడ్డి వచ్చారనుకున్న కార్మికులు ఆయన వైఖరి చూసి కంగుతిన్నారు. కిషన్‌రెడ్డి సింగరేణిని కాపాడేందుకు వచ్చారా? లేక సీఎం, డిప్యూటీ సీఎం, మరో మంత్రి నుంచి వాటా కోసం వచ్చారా? లేక బీజేపీ కార్యకర్తల కోసం వచ్చారా? అనే విష యం అర్థంకాక సింగరేణి కార్మికులు, సంఘా ల నాయకులు గందరగోళంలో పడ్డారు.