హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): 42 శాతం రిజర్వేషన్లతో బీసీలకే నష్టమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ముస్లింలకు బీసీ-ఈ పేరుతో 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని, ఇప్పుడు దానిని 10 శాతానికి పెంచి బీసీలకు అన్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. బీసీలను ఏదో ఉద్ధరించినట్టు రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ చెప్పుకుంటున్నారని, 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు పోగా, బీసీలకు 32 శాతమే దక్కుతాయని స్పష్టంచేశారు. రాజకీయ లబ్ధి కోసమే బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఎత్తుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇతరులకు నీతులు చెప్పేముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి బీసీని సీఎం చేయాలని డిమాండ్ చేశారు.