హైదరాబాద్: పనిముట్లనే ఆయుధాలుగా చేసుకొని ప్రజలు నిజాంపై పోరాటం చేశారని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. రజాకార్ల ఆగడలతో ఇక్కడి ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవించారని చెప్పారు. నిజాం హయాంలో బలవంతపు మత మార్పిడిలు జరిగాయని, హిందూ మహిళలను బలవంతంగా ఎత్తుకెళ్లి అఘాయిత్యాలు చేశారన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్థాన్‌లో కలపాలని నిజాం భావించాడని, చర్చలు కూడా జరిపారని వెల్లడించారు. కేంద్ర పభ్రుత్వ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది హైదరాబాద్ ముక్తి దివాస్ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారని వెల్లడించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నిజాం చెరిపేసే ప్రయత్నం చేశారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా చరిత్రను తొక్కి పెట్టారన్నారు. స్వాతంత్యం కోసం చేసిన త్యాగాలు, బలిదానాలు దాచడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని ఆదేశాలతో 2022 నుంచి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లో కూడా ఇదే వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
సర్దార్ పటేల్ నిజాంతో ముందుగా శాంతి చర్చలు జరిపారని, తమ సంస్థానం జోలికి వస్తే హైదరాబాద్‌లో ఉన్న కోటిన్నర హిందువులను చంపేస్తామని ఖాసిం రజ్వీ బెదిరించారన్నారు. అందుకే ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారని తెలిపారు. ఈ గడ్డకు స్వాతంత్ర్యం వచ్చిన రోజును జరపకుండా పాలకులు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తాము నిర్వహించే ఈ ఉత్సవాలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. మనకు వాస్తవ చరిత్ర తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. చరిత్ర గాడి తప్పితే భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడతాయన్నారు. పథకం ప్రకారం చరిత్రను పక్కదారి పట్టిస్తున్నారు. ఆగస్ట్ 15 ఎంత ముఖ్యమో.. సెప్టెంబర్ 15 కూడా అంతే ముఖ్యం. చరిత్రను పట్టించుకోని పార్టీలను తరిమికొడదామని పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు సహకరించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Live: At the Hyderabad Liberation Day celebrations by the Government of India at the Parade Grounds, Secunderabad.#HyderabadLiberationDay https://t.co/fwA1yS60Cu
— G Kishan Reddy (@kishanreddybjp) September 17, 2024