హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై బీజేపీ అసలు రంగు బయటపడింది. ఆ పార్టీ ఎటువైపు అన్నది ఖుల్లం ఖుల్లాగా మరోసారి తేటతెల్లమైంది. తెలంగాణపై వివక్ష మరోసారి బట్టబయలైంది. తెలంగాణ సమాజం నమ్మి ఓట్లేసి గెలిపిస్తే.. కేంద్రమంత్రయిన కిషన్‌రెడ్డి సొం తరాష్ట్రంపైనే అక్కసు వెళ్లగక్కారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడంపై పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారు. విభజన చట్టంలోనే ఆ అంశముందంటూ అసత్యాలను అంతే నిస్సిగ్గుగా వల్లెవేశారు. దీంతో కేంద్రమంత్రి వ్యా ఖ్యలపై బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యు లు నిప్పులు చెరిగారు. తీవ్ర అ భ్యంతరం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగారు. వ్యాఖ్యలను వెంటనే వెనకి తీసుకోవాలని, లేదంటే, సభా హకుల ఉల్లంఘ న తీర్మానాన్ని ప్రవేశపెడుతామని హెచ్చరించారు. దీంతో పెద్దలసభలో గురువారం ఒకసారిగా ఉద్రిక్తత ఏర్పడింది.
సురేశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. బీజేపీ ప్రభుత్వ పెద్దల తరహాలోనే అసత్య ఆరోపణలకు దిగారు. భద్రాచలంలోని గ్రామాలను ఏపీలో కలపాలనే ప్రతిపాదనను ఆనాటి కాంగ్రెస్ సరారే విభజన బిల్లులో పొందుపరిచిందంటూ పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు పలికారు. ఆ రోజు సోనియాగాంధీని ఎందుకు ప్రశ్నించలేదంటూ వితండవాదం చేశారు. వాస్తవంగా ఏడు మండలాల విలీనం అంశం పునర్విభజన చట్టంలోనే లేదు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసింది. ఆ మేరకు పునర్విభజన చట్టాన్ని సవరించింది.
ఈ చర్యను నాడు బీఆర్ఎస్ అధినేత తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు యావత్ తెలంగాణ బంద్‌కు సైతం పిలుపునిచ్చారు. బీజేపీ విద్రోహచర్యను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు.. ఆ ఏడు మండలాలను కలిపితే కానీ ప్రమాణ స్వీకారం చేయబోనని ప్రధాని మోదీని హెచ్చరించి, సాధించానని అనేకసార్లు పత్రికాముఖంగా, బహిరంగ సభావేదికలపై నుంచి ప్రకటించారు. ఇప్పటికీ ఆ విషయాన్ని చెప్తూనే ఉన్నారు. కానీ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాత్రం ఏడు మండలాల విలీనం అంశం విభజన చట్టంలోనే ఉందంటూ పార్లమెంట్ వేదికగా పచ్చి అబద్ధాలు చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపైనా ఆయన అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. అసత్య ప్రచారాలకు పూనుకున్నారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యుడు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఘాటుగా స్పందించారు. తెలంగాణను సాధించిన, రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టిన మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కిషన్‌రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సభ మారిపోయింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో బీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎంపీలు దీటుగా బదులిచ్చారు. అదే సమయంలో కేంద్రం వైఖరిని సైతం ఎండగట్టారు. వ్యాఖ్యలను వెనక్కితీసుకోవాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో రాజ్యసభలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది.
రాజ్యసభ సాక్షిగా కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవని, వెంటనే సభకు క్షమాపణ చెప్పాలని సురేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించాలని కోరారు. అబద్ధాలతో సభను తప్పుదోవ పట్టించిన మంత్రిపై సభా హకుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026పై జరిగిన చర్చలో ఆయన ప్రసంగిస్తూ కేంద్రం తీరును ఎండగట్టారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, బ్యాంకు రుణాలతో మాజీ సీఎం కేసీఆర్ ఆ ప్రాజెక్టును అద్భుతంగా నిర్మించారు. లక్ష కోట్లు కొట్టుకుపోయాయని కేంద్ర మంత్రి ఏ ప్రాతిపదికన మాట్లాడుతున్నారు? కేవలం 300 కోట్ల రూపాయల రిపేరు పనులను భూతద్దంలో చూపిస్తూ లక్ష కోట్లు అని అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు.
కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు.. అది మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 15 వేల కిలోమీటర్ల పైప్లైన్లు, 25 టన్నెళ్లతో కూడిన అతిపెద్ద వ్యవస్థ. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఒక బ్యారేజీలోని రెండు పిల్లర్లకు పగుళ్లు వచ్చాయి. దానిని రిపేరు చేయడానికి రూ.300 కోట్లు అవసరమవుతాయి. ఆ కొద్దిపాటి నిధులు వెచ్చించి ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకుండా అడ్డుగోలుగా మాట్లాడుతున్నారు’ అని నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా సురేశ్‌రెడ్డి అభివర్ణించారు. కేంద్రం సహాయం చేయకున్నా కేసీఆర్ దార్శనికతతో కాళేశ్వరం పూర్తిచేయడం వల్లే నేడు తెలంగాణ దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానానికి చేరుకుందని గుర్తుచేశారు. ఈ విజయానికి తెలంగాణ రైతాంగం, బీఆర్ఎస్ ప్రభుత్వం పడిన శ్రమ కారణమని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గతంలో పార్లమెంట్ సైతం ప్రశంసించిందని గుర్తుచేశారు.
ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. పదేండ్ల్లలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిందని, వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి వచ్చిన అనేక అవార్డులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాన్ని కేసీఆర్ స్వాగతించారని, ‘ప్రాంతాలవారీగా వేరు అవుదాం.. అన్నదమ్ముల్లా కలిసి ఉందాం’ అంటూ కేసీఆర్ చెప్పారని, ఇప్పటికీ తమ పార్టీ విధానం అదేనని స్పష్టంచేశారు. అయినప్పటికీ 12 ఏండ్లుగా తెలంగాణ సాధించిన ప్రగతిని ఓర్వలేక ఏపీకి చెందిన కొందరు, కేంద్ర మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సురేశ్‌రెడ్డి ఆక్షేపించారు. తల్లిని చంపి బిడ్డను వేరుచేశారని, తలుపులు మూసి రాష్ర్టాన్ని విభజించారని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఏపీలో కలిపిన ఏడు మండలాలను తిరిగి ఇవ్వాలని సురేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. కనీసం భద్రాచలానికి ఆనుకొని ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని సూచించారు. ఆ ఐదు గ్రామాలు తెలంగాణ ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్నాయని, మహాభారతంలో పాండవులు నాడు అడిగినట్టుగా నేడు ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపాలని అభ్యర్థిస్తున్నామని తెలిపారు. భద్రాద్రి రామాలయ భూములు ఆ గ్రామాల్లోనే ఉన్నాయని, వాటిని తక్షణమే తిరిగి తెలంగాణలో కలపాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒకే శరీరానికి రెండు కండ్లు వంటివని, కేంద్రం ఒక కంటికి వెన్న.. మరో కంటికి సున్నం అన్నట్టుగా వ్యవహరించకూడదని సురేశ్‌రెడ్డి హితవు పలికారు.
ఏపీ పునర్నిర్మాణానికి మద్దతు ఇస్తున్నట్టే, తెలంగాణకు రావాల్సిన విభజన హామీలను, జాతీయ హోదాను కూడా నెరవేర్చాలని కోరారు. ఏపీలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా.. తెలంగాణలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, ఐటీఐఆర్‌ను తెలంగాణకు తిరిగి కేటాయించాలని కోరారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ వంటి చట్టబద్ధమైన హామీలను కేంద్రం తుంగలో తొకిందని మండిపడ్డారు.
రాజ్యసభలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కీలక అంశాలను లేవనెత్తారు. తెలంగాణను సాధించిన, రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలబెట్టిన మాజీ సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించడాన్ని తమ పార్టీ స్వాగతిస్తున్నదని చెప్పారు. విభజన సందర్భంలో తెలంగాణకు చెందిన 7 మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పగించారని గుర్తుచేశారు. వీటిలోని 5 గ్రామాలు ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండాల.. భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉంటాయని వివరించారు.
బీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తిన అంశాలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ ఎదురుదాడికి దిగారు. బీజేపీ ప్రభుత్వ పెద్దలు, కేంద్ర మంత్రుల తరహాలోనే అబద్ధాలను వల్లెవేశారు. ఏపీలో విలీనమైన గ్రామాలపై బీఆర్ఎస్ ఎంపీలు ఇప్పుడు మాట్లాడటమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలం వద్ద ఉన్న ఏడు మండలాలను ఏపీలో కలపాలని పునర్విభజన చట్టంలో ఇన్‌బిల్ట్‌గా చేర్చిందంటూ అబద్ధాలు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ పూర్తిగా నీళ్లలో మునిగిపోయిందని, కేసీఆర్ లేదా బీఆర్ఎస్ పార్టీ సొంత పైసలతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారా.?
అంటూ వితండవాదానికి దిగారు. బీజేపీ పెద్దలు, ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు ఆదినుంచీ పదేపదే ప్రచారం చేస్తున్న తీరులోనే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని కేంద్రమంత్రి సైతం ఆరోపణలకు దిగారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కాళేశ్వరంపై ఎంక్వైరీ వేసి, కేసీఆర్‌ను జైలుకు పంపుతామని చెప్పిందని, ఇప్పటికీ ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అన్నారు. కేంద్రమంత్రి వాఖ్యలపై బీఆర్ఎస్ ఎంపీలు మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. ఆ వ్యాఖ్యలను తక్షణం రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్‌రావు, బండి పార్థసారథిరెడ్డి రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న సీఆర్ పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు. మరో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలూ అభ్యంతరకరమేనని, ఆ మాటలనూ రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. తమ విజ్ఙప్తిపై రాజ్యసభ చైర్మన్ సానుకూలంగా స్పందించారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ బృందం తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి బీఆర్ఎస్పై యుద్ధం చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఆ రెండు పార్టీలు అవగాహనతో పని చేస్తున్నాయని, ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నాయని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.
రాజ్యసభలో గురువారం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026పై జరిగిన చర్చలో బీఆర్ఎస్ సభ్యుడు సురేశ్‌రెడ్డి మాట్లాడారు. ఏపీ పునర్విభజన చట్టాన్ని తిరిగి ఏపీ పునర్నిర్మాణం బిల్లుగా మార్చొద్దని హితవు పలికారు. కేంద్రంలోని బీజేపీ గత 12 ఏండ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం ‘ఏపీ పునర్విభజన చట్టం-2014’కు ఎన్నిసార్లు సవరణలు చేసిందని నిలదీశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన ఏ హామీనీ కేంద్రం నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. అయినా తెలంగాణ సొంత నిధులతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకుంటే రూ.లక్ష కోట్లు నీటిలో కొట్టుకుపోయాయని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఎలా అంటారని నిప్పులు చెరిగారు. ఆయన తన మాటలు వెనకి తీసుకొని, క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. లేదంటే.. కేంద్ర మంత్రిపై సభా హకుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని సభాపతిని కోరారు.
అమరావతి చట్టబద్ధత కల్పించే బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. అమరావతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. అమరావతి గతంలోనే కేసీఆర్ మద్దతు తెలిపారని స్పష్టంచేశారు. అమరుల త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని, దేశంలోనే తెలంగాణను నంబర్‌వన్‌గా నిలబెట్టుకున్నామని అన్నారు. ప్రాంతాల వారీగా వేరైనా అన్నదమ్ముల్లా కలిసుందామని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి 22 అక్టోబర్ 2015 చారిత్రాత్మక రోజుగా ఆయన అభివర్ణించారు. ఆ రోజు ప్రధాని మోదీ, రెండు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమక్షంలో అమరావతి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు.