Kishan Reddy | హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మరిచిపోయిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలుకు గ్యారంటీనే లేకుండాపోయిందని ఎద్దేవా చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ టీజీపీఎస్సీ ఎదుట ధర్నాకు దిగిన బీజేవైఎం నేతలపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండించారు.
సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం పనిచేస్తున్నదని వెల్లడించారు. సింగరేణి ప్రైవేటీకరణ శుద్ధ అబద్ధమని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అత్యంత పారదర్శకంగా బొగ్గు గనుల వేలం కొనసాగుతున్నదని, 107 బొగ్గు గనులు వేలం వేయగా భారీగా ఆదాయం సమకూరిందని వివరించారు. బొగ్గు గనుల వేలం ద్వారా వచ్చే ఆదాయంలో ఒక్కపైసా కూడా కేంద్రం తీసుకోదని, కార్మికుల సంక్షేమం కోసమే ఈ ఆదాయాన్ని ఖర్చు చేస్తామని కిషన్రెడ్డి పేర్కొన్నారు.