BJP | హైదరాబాద్/సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రివర్గంలో రాష్ర్టానికి రెండు పదవులు దక్కాయి. సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి మరోసారి కేంద్ర క్యాబినెట్ హోదా దక్కగా, కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్‌కి కేంద్ర సహాయమంత్రి హోదా దక్కింది. రాష్ట్రపతిభవన్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో వీరిద్దరూ మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్ర బీజేపీకి అధ్యక్షులుగా పనిచేసిన ఇద్దరూ ఈ క్యాబినెట్లో కేంద్ర మంత్రులు కావడం గమనార్హం. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రం నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. సిద్ధాంతమే ఊపిరిగా, పార్టీ కోసం పనిచేసిన సాధారణ కార్యకర్తలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకొచ్చి కేంద్ర మంత్రులుగా తీర్చిదిద్దిన ఘనత బీజేపీదేనని పేర్కొన్నారు.వచ్చే ఐదేండ్లు సంకల్ప పత్రాన్ని అమలు చేసేందుకు, తెలుగు రాష్ర్టాల అభివృద్ధి కోసం ఉత్సాహంతో, అంకితభావంతో పనిచేస్తామని చెప్పారు.
రాష్ర్టాభివృద్ధికి పనిచేస్తా: బండి సంజయ్
కేంద్ర మంత్రిగా వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రగతితోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వినియోగిస్తానని బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్రమంత్రిగా పూర్తిస్థాయిలో సహాయ సహకారాలందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కేంద్రమంత్రి పదవి దక్కడం చాలా ఆనందంగా ఉన్నదని చెప్పారు. తనపై నమ్మకం వచ్చిన ప్రధాని మోదీకి, పార్టీ జాతీయ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యకర్తల కృషి ఫలితంగానే భారీ మెజార్టీ విజయం సాధించానని, కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
కిషన్‌రెడ్డి ప్రస్థానం
రంగారెడ్డి జిల్లా కందుకూరు మం డలం తిమ్మపూర్‌లో జన్మించిన కిషన్‌రెడ్డి 1977లో జనతా పార్టీలో చేరారు. 1980లో రంగారెడ్డి జిల్లా బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో హిమాయత్‌నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2014లో అంబర్‌పేట నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ చేతుల్లో ఓటమిపాలయ్యారు. అనంతరం జరిగిన ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బరిలో నిలిచి ఎంపీగా గెలుపొందారు. 2021లో జరిగిన క్యాబినెట్ విస్తరణలో తొలిసారి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచి, మరోసారి క్యాబినెట్ హోదా దక్కించుకున్నారు.