హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): కిడ్నీ రోగులను కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూస్తున్నదని బా ధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్లోని జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కారు జిల్లా దవాఖానలు, సీహెచ్సీల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించిందని గుర్తుచేశారు.
కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా మెరుగైన చికిత్స అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు. గత జనవరి ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా, మంత్రులు, అధికారులను కలిసి విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. కిడ్నీ రోగులకు ప్రతినెలా రూ.10వేల పింఛన్ ఇవ్వాలని, డయాలసిస్ సేవలను విస్తరించాలని డిమాండ్ చేశారు.