మంచిర్యాల, జూలై 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘రాష్ట్ర ప్రభుత్వం 49 జీవోను ఆపేసింది.. ఒకవేళ ఈ జీవో ను మళ్లీ తెస్తే అధికార పార్టీ నుంచి మొట్టమొదటగా రాజీనామా చేసేది నేనే..’ అంటూ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన రేషన్‌కార్డుల పంపిణీలో ఆయన మాట్లాడారు. తమ ప్రాంతానికి ఎవరైనా అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోనని, ఎంత ధైర్యముంటే రాజీనామా చేస్తానని చెబుతున్నానో ఆలోచించాలని పేర్కొన్నారు. కవ్వాల్ టైగర్‌జోన్‌లో వాహనాల రాకపోకలు ఆపితే చూస్తూ ఊరుకోబోమని, తు క్కు తుక్కుగా.. తరిమి కొడతాం అంటూ అటవీశాఖ అధికారులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫారెస్టోడు ఎవ్వడైనా అతిగా ప్రవరిస్తే బాగుండదని హెచ్చరించారు. పోడు రైతులు, యాదవు లు, మేదరోళ్లు పొలం పనులకు, గొర్రెలు, బర్రెలు మేపడానికి, కట్టెలకు అడవిలోకి వెళ్తే ఫారెస్ట్ వాళ్లు ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. వాళ్లను ఇబ్బంది పెడితే మొన్న ఆదిలాబాద్ జిల్లా సిరిచెల్మలో ముల్తానీలు తిరుగుబాటు చేసినట్టే.. ఇక్కడి బిడ్డలు సైతం తిరుగుబాటు చేస్తారని, దానికి తానే నాయకత్వం వహిస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిరంగంగానే రాజీనామా విషయాన్ని ప్రస్తావించడం, ఫారెస్ట్ అధికారులను తీవ్రంగా హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది.