ఖమ్మం రూరల్: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఒక అభిమాని తన కోరికను బయటపెట్టాడు. ఇరుముడితో శబరిమలైకి వెళ్లిన అతను.. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఫ్లెక్సీలను ప్రదర్శించాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ సోషల్మీడియా బాధ్యుడు మేకల ఉదయ్ ఇటీవల అయ్యప్ప మాల ధరించాడు. ఇరుముడి సమర్పించేందుకు ఇటీవల తోటి స్వాములతో కలిసి శబరిమలై బయల్దేరి వెళ్లాడు. స్వామివారికి ఇరుముడి సమర్పించే ముందు అయ్యప్ప సన్నిధానం ప్రాంగణంలో తన బలమైన కోరికను బయటపెట్టాడు.
తెలంగాణలో మళ్లీ కేసీఆర్ రావాలని.. పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని వారి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.