ఖమ్మం కమాన్బజార్, మార్చి 31: ఖమ్మం శివారు ప్రాంతంలోని వెలుగుమట్లలో ఇండ్లు కోల్పోయిన పేదలందరికీ ఇండ్ల స్థలాలు, ఇండ్లు కేటాయించాలని బాధితులు మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. భూదాన్ భూముల్లో ఇండ్లను తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వం, బాధితులకు సరైన పునరావాసం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అర్హులైన ప్రతి కుటుంబానికీ ఇండ్లు ఇచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. బాధితులంతా అద్దె ఇండ్లలో జీవనం సాగిస్తున్నరని తెలిపారు. 729 కుటుంబాలకు గాను 300 మందికి మాత్రమే ఇంటి స్థలాలు కేటాయించారని, మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అనంతరం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు.