హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లోకాయుక్త, ఉప లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సమాచార హక్కు చట్టం కమిషనర్ల నియామకంపై ఎట్టకేలకు ముందడుగు పడింది. 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నది. దీనిపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఆయా పోస్టుల భర్తీ కోసం ముఖ్యమంత్రి నేతృత్వంలో శనివారం సచివాలయంలోని సీఎం కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. కమిటీలో స్పీకర్ ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఉన్నారు. ఆయా పోస్టుల కోసం ఇప్పటికే వందలాది మంది దరఖాస్తు చేసుకున్నారు.