హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేతలు పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న, బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ మంగళవారం డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్‌కు చెందిన చంద్రన్న 1979లో ఇంటర్ చదువుతుండగా, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ఎస్యూ)లో ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న దగ్గు రాజలింగుతో పరిచయం ఏర్పడింది. ఆయన ప్రేరణతో ప్రభావితమై, 1980లో కిషన్‌జీకి అనుచరుడిగా మారాడు. అదే ఏడాది సంగ్రామ్ నాయకత్వంలో దండకారణ్య ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సాయుధ దళంలో చేరాడు. 1981లో పీపుల్స్‌వార్‌లో చేరి, 1983లో కమాండర్ అయ్యాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2024లో కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో తెలంగాణ రాష్ట్ర కమిటీకి మార్గదర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు. ఆరోగ్యం క్షీణించడం, దీర్ఘకాలిక మోకాళ్ల వ్యాధి, భద్రతా దళాల నిరంతర ఒత్తిడి, నాయకత్వంతో ఏర్పడిన సిద్ధాంతపరమైన భేదాభిప్రాయాలతో లొంగిపోయాడు’ అని వివరించారు.
జైలు నుంచి మళ్లీ దళంలోకి
బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన వారని డీజీపీ తెలిపారు. 1984లో సెంట్రల్ కమిటీ సభ్యుడు చంద్రన్న నాయకత్వంలో సాయుధ దళంలో చేరాడని చెప్పారు. 1985 జనవరి 5న వీటీ అబ్రహాం హత్య కేసులో అరెస్టయి వరంగల్ సెంట్రల్ జైలులో ఉంటుండగా.. 1988లో ఆదిలాబాద్ సబ్‌జైలుకు బదిలీ చేశారు. అదే ఏడాది ఆదిలాబాద్ సబ్ జైలు నుంచి తప్పించుకున్నాడని, 1989 నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు తెలిపారు. తిరిగి 1992లో మల్కాజిగిరి ప్రాంతం లో పోలీసులు బండిప్రకాశ్ను ఆరెస్ట్ చేశారని, అదే ఏడాది అబ్రహాం హత్య కేసులో జీవిత ఖైదు పడటంతో చంచల్‌గూడ జైలుకు తరలించినట్టు చెప్పారు. 2004లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయనను జైలు నుంచి విడుదల చేశారు.
అనంతరం మళ్లీ దళంలో చేరిన ప్రకాశ్ 2008లో చర్ల-శబరి ఏరియా కమిటీ ఇన్చార్జిగా పనిచేశాడు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడం, భద్రతా దళాల ఒత్తిడి, నాయకత్వంతో భేదాభిప్రాయాల కారణంగా పార్టీని వీడి లొంగిపోయినట్టు డీజీపీ తెలిపారు. చంద్రన్నపై రూ.25లక్షలు, బండి ప్రకాశ్‌పై రూ.20లక్షల రివార్డును గతంలో పోలీసులు ప్రకటించగా.. ఆ మొత్తాన్ని వారికే అందించనున్నట్టు డీజీపీ వెల్లడించారు. ఇంకా తెలంగాణకు చెంది న 64 మంది మావోయిస్టులుగా కొనసాగుతున్నట్టు తెలిపారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేతలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కరెక్ట్ కాదని, అవసరమైతే వారికి రక్షణ కల్పిస్తామని డీజీపీ స్పష్టంచేశారు. ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్టులను కోరారు. ఈ సందర్భంగా పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న మీడియాతో మాట్లాడుతూ తమది లొంగుబాటు కాదని, అభివృద్ధిలో కలిసి పనిచేసేందుకు వచ్చినట్టు తెలిపారు. తమ సిద్ధాంతం ఓడిపోలేదని, ఓడించడం ఎవరితరం కాదని వ్యాఖ్యానించారు.