జగిత్యాల, అక్టోబర్ 23: పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్, రాహుల్‌గాంధీ ఎప్పుడూ వ్యతిరేకమేనని, రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ మెజారిటీతో ఉందని, అలాంటప్పుడు ఇతర పార్టీల వాళ్లని చేర్చుకోవడం ఎందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం మూలంగా ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెసు క్యాడర్లో అయోమయం నెలకొందని, దీంతో పదేండ్లు ప్రతిపక్షంలో ఆ పార్టీ నాయకులతో పోరాటం చేసిన వారికి పార్టీ ఫిరాయింపుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు. ఈ నెల 22న దారుణ హత్యకు గురైన జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మారు గంగారెడ్డి కుటుంబ సభ్యులను బుధవారం ఆయన పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను మొదటి నుంచీ పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తన అనుభవం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నానని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే సస్పెండ్ చేయాలని చట్టంలో ఉందని పేర్కొన్నారు.