ఖమ్మం, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ వారిని తమ ఏజెంట్లుగా మార్చిన నీచ చరిత్ర కేంద్ర ప్రభుత్వానిదని కేరళ ముఖ్యమంత్రి, సీపీఎం జాతీ య నాయకుడు పినరాయి విజయన్ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలో లేని రాష్ర్టాల్లో గవర్నర్లను ఏజెంట్లుగా మార్చుకొని అక్కడి ప్రభుత్వాలపై ఉసిగొల్పుతున్నదని విమర్శించారు. గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉన్నత విద్యపైనా కేంద్రం కర్రపెత్తనం చెలాయిస్తున్నదని మండిపడ్డారు. కేరళ వంటి రాష్ర్టా లు ఈ తరహా ధోరణిని వ్యతిరేకించాయని గుర్తుచేశారు. దేశంలో మతోన్మాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న నేతలే జాతీయవాదులుగా చెలామణి కావడానికి ప్రయత్నించడం దారుణమని అన్నారు. దేశ స్వాతం త్య్ర పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యమని, జాతీయవాదానికి దూరంగా ఉన్న సంఘ్పరివార్ ఇప్పుడు జాతీయవాదులను గుర్తిస్తామనడం అసంబద్ధమని విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీలు దొందూదొందేనని దుయ్యబట్టారు.కేంద్రం ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. పీఎం కిసాన్ పథకం కూడా బీజేపీ ఎన్నికల స్టంటేనని ఆరోపించారు. 2019లో పీఎం కిసాన్ పథకం కింద తెలంగాణలో 39.10 లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉంటే.. 2022 నాటి కి వారిని 24 లక్షలకు కుదించిందని విమర్శించారు. బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలను వ్యతిరేకించే శక్తులన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మోదీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడమే పనిగా పెట్టుకున్నదని, ఈ విక్రయాల ద్వారా రూ.65 వేల కోట్లు సమకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల ఇప్పటికే కోటి మంది రైతులు వ్యవసాయానికి దూరమయ్యారని, దేశంలో రోజూ 16 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈజీఎస్ను నిర్వీర్యం చేస్తూ పని దినాల సంఖ్యను తగ్గిస్తున్నదని ఆరోపించారు.దేశంలో తామే బలమైన ప్రతిపక్షమని చెప్పుకొంటున్న కాంగ్రెస్.. ప్రజల పక్షాన పోరాడకపోగా బీజేపీకి రిక్రూట్మెంట్ ఏజెన్సీగా మారిందని దుయ్యబట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ బలమైన పోరాటం చేస్తున్నందున ఆయనతో కలిసి నడుస్తున్నామని అన్నారు. సభలో సీపీఎం నేతలు నాగయ్య, జూలకంటి రంగారెడ్డి, సీతారాములు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్ పాల్గొన్నారు.