Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, అద్భుతంగా పాలన అందిస్తున్నామని కేరళలో ఊదరగొట్టిన సీఎం రేవంత్‌రెడ్డికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్‌రెడ్డి విమర్శలకు గణాంకాలు సహా ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ మేరకు విజయన్ శుక్రవారం ట్వీట్ చేశారు. కేరళ గురించి రేవంత్‌రెడ్డి అవమానకరంగా మాట్లాడారని, అవి పూర్తిగా నిరాధారమైనవని స్పష్టంచేశారు.
తమ పాలనను వేలెత్తి చూపించే అర్హత ఆయనకు లేనేలేదని తేల్చిచెప్పారు. ‘సొంత రాష్ట్రంలో (తెలంగాణలో) నిరుపేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపి కూల్చిన వ్యక్తి వచ్చి, కేరళలో సామాజిక పురోగతి (సోషల్ ప్రోగ్రెస్) గురించి ప్రసంగాలు చేయడం విడ్డూరంగా ఉన్నది’ అని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్టున్నారని పేర్కొన్నారు. కేరళలోని సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి నమూనాను దెబ్బతీయాలని చూస్తున్న వారికి రేవంత్‌రెడ్డి ఒక గొంతుకగా మారిపోయారని విమర్శించారు.
కేరళ ప్రభుత్వ ప్రతిష్టాత్మక డిజిటల్ భూ రికార్డుల వ్యవస్థను అధ్యయనం చేయడానికి 2025 సెప్టెంబర్ 16న తెలంగాణ రాష్ట్రం నుంచి రెవెన్యూ, సర్వే అధికారుల ఉన్నత స్థాయి బృందం తిరువనంతపురం వచ్చారని విజయన్ గుర్తుచేశారు. తాము అమలు చేస్తున్న ‘ఎంటే భూమి’ (ఐఎల్ఐఎంఎస్) పోర్టల్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు.
ఓవైపు కేరళ నమూనాను అధ్యయనం చేసి, సొంత రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగంగా తమను ఎగతాళి చేయడం ఏమిటని ప్రశ్నించారు. తమను బీజేపీకి స్నేహితులుగా రేవంత్‌రెడ్డి అభివర్ణించడంపై కేరళ సీఎం మండిపడ్డారు. ‘కేంద్రం, కేరళ ప్రభుత్వాల మధ్య సంబంధం ఉన్నదన్న ఆయన వాదన హాస్యాస్పదం. కేరళ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏనాడూ ఒక మాట కూడా మాట్లాడకుండా, బీజేపీకి అసలైన బీ-టీమ్‌గా వ్యవహరిస్తున్నది వెన్నెముక లేని కాంగ్రెస్ పార్టీయే.
ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మా రాష్ట్రంలో జరుగుతున్న నిరసనలను రేవంత్‌రెడ్డి గమనించలేదా? లేదా కేరళకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని ఆయన సమర్థిస్తున్నారా?’ అని రేవంత్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యాన్ని ప్రస్తావిస్తూ రేవంత్‌రెడ్డికి విజయన్ చురకలు అంటించారు.
‘జీతాలు, పెన్షన్లను పదేపదే ఆలస్యంచేసే ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి.. కేరళకు నేర్పాల్సింది ఏమీ లేదు’ అని ఘాటుగా బదులిచ్చారు. అవసరమైతే కేరళకు వచ్చి పాఠాలు నేర్చుకోవాలని హితవు పలికారు. ‘పరిపాలన, ప్రజాసంక్షేమం గురించి పాఠాలు నేర్చుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రికి కేరళ తరఫున వినమ్రపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం’ అని విజయన్ ఆహ్వానం పలికారు.
కేరళలో అవినీతి పెరిగిందని, ప్రభుత్వం విఫలమైందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేసే ముందు గణాంకాలను పరిశీలించాలని కేరళ సీఎం విజయన్ సూచించారు. నీతి ఆయోగ్ ఎస్డీజీ ఇండెక్స్ (2023-24) ప్రకారం దేశంలోనే అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రంగా కేరళ నిలిచిందని ఆయన గమనించలేదా? అని ప్రశ్నించారు.
‘ఎస్డీజీ సూచిక ప్రకారం కేరళ 79 పాయింట్లతో మొదటి స్థానంలో నిలువగా, తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నది. మీ సొంత రాష్ట్రంలోని లోపాలను కప్పిపుచ్చుకోవడానికి కేరళను ఎగతాళి చేయడం అత్యంత విచారకరం’ అని విజయన్ పేర్కొన్నారు. నీతిఆయోగ్ ప్రకారం కేరళలో పేదరికం రేటు కేవలం 0.55% అని, ఇది దేశంలోనే అత్యల్పమని పేర్కొన్నారు. 2025 చివరి నాటికి దేశంలో తీవ్ర పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచిందని నీతి ఆయోగ్ ప్రశంసించిందని తెలిపారు. మరోవైపు తెలంగాణలో పేదరికం రేటు 5.88%గా ఉన్నదని గుర్తుచేశారు.
కేరళ 95.3% అక్షరాస్యత రేటుతో దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణ ఇప్పటికీ 76.9%తో వెనుకబడి ఉన్నదని ఎద్దేవా చేశారు. కేరళ మీడియాలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జాకెట్ యాడ్స్‌ను ప్రస్తావిస్తూ విజయన్ ఘాటు విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్‌కు పరోక్షంగా సహాయపడటానికి కేరళలో రాజకీయ ప్రకటనలకు రూ.కోట్లు ఖర్చు పెట్టే బదులు, ఆయన తన సొంత గడ్డ(తెలంగాణ)పై పేదరికాన్ని నిర్మూలించడం, అక్షరాస్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టొచ్చు కదా?’ అని వ్యాఖ్యానించారు.
కేరళలో శిశు మరణాల రేటు (ఐఎంఆర్) ఐదుకు తగ్గిందని, ఇది అమెరికా (5.6) కన్నా తక్కువ అని తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణలో ఐఎంఆర్ దాదాపు నాలుగు రెట్లు ఎకువగా ఉన్నదని పేర్కొన్నారు. కేరళలోని పటిష్టమైన ప్రజారోగ్య వ్యవస్థ కారణంగా ఒక మలయాళీ జీవితకాలం సగటు భారతీయుడి కంటే 5-7 సంవత్సరాలు ఎకువగా ఉన్నదని తెలిపారు.