హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : కేంద్రీయ విద్యాలయాల్లో(కేవీ) టీచర్ల కొరత వేధిస్తున్నది. దీంతో కేవీల్లో బోధన ముందుకుసాగడంలేదు. అన్ని కేవీల్లో 8,457 టీచర్‌పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం పార్లమెంట్లో వెల్లడించింది. మరో 1,716 మంది బోధనేతర సిబ్బంది పోస్టులు కూడా ఖాళీగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది.
కేవీల్లో 56,520 పోస్టులు ఉండగా, ప్రస్తుతం బోధన, బోధనేతర సిబ్బందితో కలిపి 46,347 మంది పనిచేస్తుండగా, 10,173 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. 2014 నుంచి 23 వరకు 33,350 పోస్టులను భర్తీచేసినట్టు తెలిపింది. 2024-25లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో 6,920 మంది కాంట్రాక్ట్ టీచర్లను నియమించినట్టు వెల్లడించింది.
హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో ఎఫ్ఆర్ఎస్ (ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్) సవాలుగా మారింది. రెగ్యులర్ పాఠశాలల సమయానికి విభిన్నంగా గురుకులాల పనివేళలు ఉండటంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రభుత్వ కాలేజీలు, పాఠశాలల్లో ఉపాధ్యాయులందరికీ నిర్ణీత పనివేళలు ఉన్నాయి. గురుకులాల్లో ప్రిన్సిపాల్‌తో పాటు పీడీ, పీఈటీ, హెల్త్ సూపర్వైజర్లు ప్రతి రోజూ ఉదయం 5గంటలకు హాజరుకావాల్సి ఉంటుంది. వార్డెన్లు స్థానికంగా ఉండి పాఠశాల పర్యవేక్షణలో పాల్గొనాలనే నిబంధన ఉంది.
ఇతర ఉపాధ్యాయులు ఉదయం 8 గంటలకు హాజరు కావాలి. ఆఫీస్ సిబ్బంది 10 గంటలకు డ్యూటీలో చేరాలి. నైట్ డ్యూటీ సిబ్బంది మధ్యాహ్నమే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. వివిధ రకాలుగా సమయపాలన ఉండటంతో ఎఫ్ఆర్ఎస్ ఎలా చేయాలని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. రెగ్యులర్ పాఠశాల, కాలేజీ సిబ్బందికి అమలు చేస్తున్న ఎఫ్ఆర్ఎస్ అప్లికేషన్నే గురుకులంలో అమలు చేయడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. గురుకుల పాఠశాలల పనివేళలకు అనుగుణంగా అప్లికేషన్‌ను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. ఎస్సీ గురుకులంలో ఇదేవిధమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సిబ్బంది వివరిస్తున్నారు.ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఎఫ్ఆర్ఎస్ అమలు చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.