Medigadda Barrage | హైదరాబాద్, మే20 (నమస్తే తెలంగాణ): ‘అనుభవమైతేగాని ఏదీ తెలిసి రాదు’. ఇలానే ఇప్పుడు రైతుల కోపాగ్ని తాకితేగాని కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కారుకు తత్వం బోధపడలేదు. నిన్నటిదాకా ప్రాజెక్టే నిరర్ధకం, నిష్ప్రయోజనమని మాట్లాడిన నోటితోనే ఇప్పుడు మరమ్మతులు చేసి నీటిని ఎత్తిపోస్తామని సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రకటించింది. ప్రాజెక్టును బందు పెట్టడం వల్ల జరిగిన నష్టమేమిటో బోధపడడంతో దిద్దుబాటుచర్యలు చేపట్టింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినా పెడచెవిన పెట్టి, పిల్లర్ల కుంగుబాటుపై రాద్ధాంతం చేసి.. లక్షలాది ఎకరాలను ఎండబెట్టి చివరికి రైతుల ఆగ్రహాన్ని చవిచూశాక ఇప్పుడు తప్పు తెలుసుకున్నది. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బరాజ్‌ల మరమ్మతులకు సంసిద్ధత తెలిపింది.
ఇన్నాళ్లూ తప్పుడు ప్రచారం
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్‌లోని 20పిల్లర్ కుంగుబాటునకు గురైన విషయం తెలిసిందే. ఆ ఒక్క సాంకేతిక లోపాన్ని సాకుగా చూపి మొత్తం ప్రాజెక్టే నిష్ప్రయోజనమనే తప్పుడు ప్రచారానికి కాంగ్రెస్ పూనుకున్నది. ఇదే ఎన్నికల ప్రచార అస్త్రంగా చేసుకొని రాజకీయ లబ్ధికోసం అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు కూడా కూలిపోతాయంటూ విషం చిమ్మింది. అధికారంలోకి వచ్చాక బరాజ్‌ల మరమ్మతులు మాని, రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలి, కేవలం రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేసుకున్నది. ప్రాజెక్టు పేరిట కేసీఆర్‌ను బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది. మంత్రులు, ముఖ్యమంత్రి స్వయంగా బరాజ్‌లను సందర్శించి మరీ అవి నిష్ప్రయోజనం, నిరర్ధకం, వృథా అంటూ కొండెక్కి కూశారు. అసెంబ్లీ వేదికగా అబద్ధపు ప్రచారం చేశారు. నీటి ఎత్తిపోతలు ఆపేసి, అప్పటికే బరాజ్‌లలో నిల్వ ఉన్న నీటిని సైతం దిగువకు వృథాగా వదిలేశారు. దీంతో యాసంగిలో ప్రాజెక్టు పరిధిలోని లక్షలాది ఎకరాలు సాగునీరందక ఎండిపోయాయి. పదేళ్లలో ఎన్నడూ లేనంతగా భూగర్భజలాలు పడిపోయాయి. ఫలితంగా రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.
కేసీఆర్ చెప్పినా పెడచెవిన..
మేడిగడ్డ బరాజ్‌ను పునరుద్ధరించవచ్చని, అది పెద్ద సమస్య కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, రాష్ట్ర ఇంజినీరింగ్ నిపుణులు సైతం మొదటినుంచీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెబుతూ వస్తున్నారు. మేడిగడ్డ బరాజ్ ఎగువన చిన్నపాటి అడ్డుకట్ట వేస్తే నీటిని లిఫ్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని నొక్కి చెప్పారు. అయి నా కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. రైతుల్లో అసహనం, ఆగ్రహం పెరిగాక ఇప్పు డు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ నివేదికను ముందుపెడుతూ బరాజ్‌లను మరమ్మత్తులు చేయించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. వచ్చే వానకాలంలో నీటిని లిఫ్ట్ చేసే అంశాలపైనా దృష్టి పెట్టినట్టు స్పష్టం చేసింది. ఇదేదో యాసంగిలోనే చేసి ఉంటే లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోకపోయేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.