హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సాహిత్యం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు. సీఎం కేసీఆర్ స్వతహాగా కవి, రచయిత కావడంతో సాహిత్య అకాడమీని పునరుద్ధరించి, తెలుగు సాహిత్యాన్ని బతికించేందుకు సమర్థమైన చర్యలు తీసుకొంటున్నారని చెప్పారు. శుక్రవారం ఆయన తెలంగాణ సాహిత్య అకాడమీని సందర్శించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఒకప్పటి కేరళ సాహిత్య అకాడమీ మాదిరిగా పురోగమిస్తున్నదని ప్రశంసించారు. తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వెనుకబడి ఉన్నదని చెప్పారు. ‘మన ఊరు-మన చెట్లు’ అంశంపై నిర్వహించిన కథల పోటీల్లో ఐదు లక్షల మంది విద్యార్థులు పాల్గొనడం గొప్ప విషయమని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, రైతునేస్తం సంపాదకుడు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.