Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): దక్షిణాదిలో తొలి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించడంలో హైదరాబాద్ మహానగరం కీలక పాత్ర పోషించనున్నదా? జనాభా, శాసనసభ స్థానాలపరంగా నాలుగింట ఒక వంతుగా ఉన్న మహానగర (హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి) ఓటర్లు అధికార బీఆర్ఎస్కే మరోసారి బ్రహ్మరథం పట్టబోతున్నారా? 29 అసెంబ్లీ స్థానాలకు ఏకంగా 20 స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడనున్నదా? తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో కేసీఆర్ ప్రభుత్వ కృషిని గుర్తించిన నగరవాసులు బీఆర్ఎస్ వైపే ఉన్నారా? ఆది నుంచి అంతంత మాత్రంగానే ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభావం ఇంకా మెరుగుపడలేదా? పాతబస్తీని ఈ సారి కూడా మజ్లిస్ పార్టీ నిలుపుకోనున్నదా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
పురోగతికి నిదర్శనం హైదరాబాద్
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఛోదక శక్తులు నగరాలే. హైదరాబాద్ మహానగరం తెలంగాణకే కాదు.. భారతదేశానికి కూడా బలమైన ఆర్థిక శక్తిగా ఉన్నది. గతానికి భిన్నంగా గడిచిన పదేండ్లలో బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అనూహ్య అభివృద్ధి సాధించింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థల పెట్టుబడుల కేంద్రంగా నగరం నిలిచింది. శాంతిభద్రతల్లోనూ గంగా జమున తెహజీబ్‌కు ఆలవాలంగా మారింది. అందుకే ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడుతున్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామం నుంచి అనేక మంది విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం కోసం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. రాష్ట్రంలోని లక్షల కుటుంబాల నుంచి కనీసం ఒకరు హైదరాబాద్‌లో ఉంటున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షలాది మంది ఉద్యోగం, ఉపాధి కోసం ఇక్కడే స్థిరపడ్డారు. ఇలా వీరంతా నగరంలో గృహం, ఓపెన్ ప్లాటు, వ్యాపారం ఇలా వివిధ రూపాల్లో పెట్టుబడులు కూడా పెట్టారు. అందుకే వీరందరికీ కులం, మతం, ప్రాంతం మరీ ముఖ్యంగా రాజకీయాలతో పెద్దగా సంబంధం ఉండదు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ ఈ అంశాలు ప్రజలపై పెద్దగా ప్రభావం చూపవు. తమ ఆదాయ వనరులు పెరిగేందుకు సహకరించేలా నగరం ఉండటం వీరికి అత్యంత ముఖ్యం. నగరంలో ఉన్న సీమాంధ్రులతోపాటు కొత్తగా వచ్చి స్థిరపడిన వారేగానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఒక్కరూ ఈ ప్రాంతాన్ని వీడినవారు లేకపోవడమే హైదరాబాద్ పురోగతికి నిదర్శనం.
అభివృద్ధి యజ్ఞం ఆగొద్దంటున్న మహా నగర ఓటర్లు
తొమ్మిదిన్నర ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ప్రగతి పరుగును చూసిన మహానగర ఓటర్లు ఈ అభివృద్ధి ఒరవడి ఆగిపోవద్దనే ధృడ సంకల్పంతో ఉన్నారు. సాధారణంగా ఎన్నికలు వచ్చినపుడు రాజకీయంగా పొడసూపే కుల, మత, ప్రాంత, రాజకీయ అంశాలను వీరు ప్రామాణికంగా తీసుకోవడంలేదని క్షేత్రస్థాయి అధ్యయనం వెల్లడైనట్టు రాజకీయ పరిశీలకులు తెలిపారు. ముఖ్యంగా తమ పిల్లల భవిష్యత్తును రిస్క్‌లో పడనీయొద్దనే అప్రమత్తత ప్రజల నుంచి వ్యక్తమవుతున్నట్టు పేర్కొన్నారు.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని 15 స్థానాలతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో మజ్లిస్ తన పాత ఏడు నియోజకవర్గాలను నిలబెట్టుకొనే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి. మిగిలిన 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఏకంగా 20 స్థానాలను కైవసం చేసుకోనున్నదని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్రభావం ఈ ఎన్నికల్లో నామమాత్రంగానే ఉంటుందనే విషయం తేలిపోయిందని అంటున్నారు. దీని ప్రభావం రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలపైనా ఉంటుందని భావిస్తున్నారు.
గత ఎన్నికల్లోనూ అభివృద్ధి వైపే మొగ్గు
గత ఎన్నికల్లో హైదరాబాద్ ఓటర్ల తీర్పును పరిశీలిస్తే.. ఆది నుంచి ప్రజలు అభివృద్ధికే పట్టం కడుతున్నట్టుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో 29 స్థానాలకు అప్పటి టీఆర్ఎస్ మూడు సీట్లే వచ్చాయి. ఐదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి 2018 ఎన్నికల్లో 29 స్థానాలకుగాను ఏకంగా 19 స్థానాలను ఓటర్లు గులాబీ పార్టీకి కట్టబెట్టారు. మిగిలిన వాటిలో ఏడు స్థానాలు మజ్లిస్ పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలను చూస్తే.. 2009 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ పోటీలోనే లేదు.
2015లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 99 డివిజన్లను కైవసం చేసుకున్నది. 2020 ఎన్నికల్లో వరుసగా రెండోసారి గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. ఇతర పార్టీల పరిస్థితి చూస్తే… మజ్లిస్ మినహా మిగిలిన కాంగ్రెస్, బీజేపీది ప్రభావం నామమాత్రమేనని తేలింది. 2015 గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు, కాంగ్రెస్ రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించాయి. 2020 ఎన్నికల్లో బీజేపీకి సీట్లు పెరిగినప్పటికీ కాంగ్రెస్ రెండు స్థానాలకే పరిమితమైంది. అభివృద్ధికే నగర ప్రజలు పట్టం కడుతున్న దరిమిలా తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ 20 స్థానాలను గెలుచుకోవడమనేది సులవేనని స్పష్టమవుతున్నది.