హైదరాబాద్: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రతిష్ఠాత్మ ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలువైపులా కేసీఆర్ సర్కార్ చేపట్టిన టిమ్స్ దవాఖానల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేయకపోతే అత్యాధునిక హంగులతో ఇప్పటికే అందుబాటులోకి వచ్చేవన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేయడం ఎవరి తరం కాదని, ఆరోగ్య తెలంగాణ దిశగా బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన అడుగులు చరిత్రలో నిలిచిపోతాయని చెప్పారు. నిర్మాణ దశలో ఉన్న ఈ హాస్పిటళ్ల తాజా దృశ్యాలు దానికి నిదర్శనమంటూ హైదరాబాద్‌లోని నాలుగు టిమ్స్ హాస్పిటళ్లు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు.
‘వైద్యరంగానికి పెద్దపీట వేస్తూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను మెరుగుపరిచి, జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని స్థాపించి, జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో కొత్త ఆసుపత్రులు, పట్టణ ప్రాంత పేదల కోసం బస్తీ దవాఖానాలను కేసీఆర్ సర్కార్ నెలకొల్పింది. అంతే కాకుండా.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో, ఒక బృహత్ ప్రణాళికతో.. హైదరాబాద్ నగరానికి నలువైపులా 1,000 పడకల నాలుగు టిమ్స్ (Telangana Institute of Medical Sciences) ఆసుపత్రులు, వరంగల్ నగరానికే తలమానికంగా 2,200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 2,000 పడకలతో నిమ్స్ ఆసుపత్రి విస్తరణ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది.
కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేయడం ఎవరి తరం కాదు. ఆరోగ్య తెలంగాణ దిశగా కేసీఆర్ సర్కార్ వేసిన అడుగులు చరిత్రలో నిలిచిపోతాయి. నిర్మాణ దశలో ఉన్న ఈ ఆసుపత్రుల తాజా విజువల్స్ దానికి నిదర్శనం. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేయకుంటే ఈపాటికే సరికొత్త హంగులతో ఈ ఆసుపత్రులన్నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి. ఈ ఆసుపత్రుల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, వైద్య సేవలు ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
In the lines of AIIMS, KCR Garu had conceptualised 4 TIMS (Telangana Institute of Medical Sciences)
The latest visuals of these Govt super specialty institutions across Telangana, stand as a testament to KCR’s commitment to the people of Telangana
KCR’s legacy cannot be… pic.twitter.com/r7AouzRcTj
— KTR (@KTRBRS) August 24, 2025