హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ప్రముఖంగా ఉంది. ఆయ నే ఉద్యమాన్ని నడిపించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రసంగం అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్రతోపాటు.. తెలంగాణ రావడంలో సోనియాగాంధీ పాత్ర కూడా ఉందని ఆయన తెలిపారు. ‘1960లో వందల మంది చనిపోయినా తెలంగాణ రాలేదు. బీజేపీ పాలనలో కూడా తెలంగాణ రాలేదు. ఉద్యమం జోరుగా సాగుతున్న తరుణంలో వందలాది మంది చనిపోతున్నారని సోనియాగాంధీ ఓ తల్లిగా మానవీయ కోణంలో తెలంగాణ ఇచ్చారు.
‘మీ పాత్ర (బీఆర్ఎస్-కేసీఆర్) లేదనలేదు. ఆమె పాత్ర కూడా ఉంది’ అని స్పష్టం చేశారు. ‘మీరు పనులేమీ చేయలేదని నేను అనలేదు. వంద శాతం చేశారు. కానీ, చేయాల్సినవన్నీ చేయలేదు’ అంటూ మంత్రి జూపల్లి తడబడ్డారు. ‘టూంబ్స్ చేశారు. మొజంజాహీ మార్కెట్ అభివృద్ధి, బుద్ధవనం.. అన్నీ చేశారు. నేను కాదనలేదు. కొల్లాపూర్లో కూడా బాగానే చేశారు’ అని చెప్పారు. అంబేదర్క్ విగ్రహం గేటు తాళాలు తీస్తామని, అక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. అమరవీరుల స్థూపాన్ని కూడా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.