జడ్చర్ల టౌన్/మూసాపేట/భూత్పూరు/ ఆదిలాబాద్, మార్చి 14(నమస్తే తెలంగాణ) : పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చిరు వ్యాపారస్తులు గ్యాస్ సిలిండర్లు అందక అవస్థలు పడుతున్నారు. ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులుతీరుతున్నారు. జడ్చర్లలో సర్వర్ సమస్య ఉందంటూ ఏజెన్సీ నిర్వాహకులు చెప్పడంతో గ్యాస్ కోసం నిరీక్షిస్తున్నారు. గోదాంలో నిల్వలు ఉన్నా.. బ్లాక్ మార్కెట్కు తరలించేందుకు స్టాక్ లేదంటూ చెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూత్పూరు గ్యాస్ ఏజెన్సీ వద్ద నో స్టాక్ బోర్డు దర్శనమిచ్చింది. భూత్పూర్ చౌరస్తాలో నిత్యం రద్దీగా ఉండే టిఫిన్ సెంటర్లు గ్యాస్ కొరతతో శనివారం మూత పడ్డాయి.
హోటళ్లు, దాబాల్లో నిత్యం వండటానికి కమర్షియల్ సిలిండర్ల కొరత ఉండటంతో కట్టెల పొయ్యిల మీద వంట చేయాల్సి పరిస్థితి ఏర్పడిందని నిర్వాహకులు వాపోతున్నారు. మూసాపేట మండలం సంకలమద్ది వద్ద హైవే-44పై లక్ష్మమ్మ, ఆమె కూతురు చిన్నపాటి చాయ్, బజ్జీ హోటల్ నిర్వహిస్తున్నారు. గ్యాస్ కొరతతో చేసేది లేక కట్టెల పొయ్యిపై వండుతున్నారు.
హాస్టళ్లు, గురుకులాలు, అంగన్వాడీ కేంద్రాల్లోనూ గ్యాస్ సమస్య నెలకొన్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి ఏజెన్సీ కేంద్రం వద్ద వినియోగదారులు బారులుదీరారు. స్టాక్ లేకపోవడంతో నిర్వాహకులు బుక్ చేసుకున్న వారికి రసీదులు ఇచ్చి స్టాక్ వచ్చిన తర్వాత సిలిండర్లు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో వినియోగదారులు చేసేదేమీ లేక ఖాళీ సిలిండర్లతో వెనుదిరిగారు.