హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసమే తీసుకుంటారని నాయకులు కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికకు బీ(టీ)ఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించడాన్ని స్వాగతించారు. మునుగోడు అభివృద్ధి చెందాలంటే ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఎవరైనాఎన్నికల్లో టి కెట్ ఆశించడంలో తప్పులేదని, కొన్ని కారణాల వల్ల తనకు ఆ అవకాశం రాలేదని కర్నె ప్రభాకర్ తెలిపారు. ఆశావాహులు ఎంతమంది ఉన్నా కేసీఆర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ఏకాభిప్రాయం అందరి అభిప్రాయమని పేర్కొన్నారు.
కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహించాల్సిన బాధ్యత తమ పై ఉంటుందని స్పష్టం చేశారు. తాను కేసీఆర్ తయారు చేసిన సైనికుడినని వెల్లడించారు .‘ తనను బుజ్జగించాల్సిన పరిస్థితి గతంలో లేదు. ఇకపై జరగదు. అప్పజెప్పిన ప్రతి పనిని విజయవంతం చేయడమే తన పని’ అని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రజలపై రుద్దిందని ఆరోపించారు.
సీఎం ఆదేశాలు పాటిస్తా : బూర నర్సయ్యగౌడ్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు పాటిస్తానని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యుడిగా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తన అవసరం జాతీయ రాజకీయాల్లో ఉందని సీఎం పేర్కొన్నారని తెలిపారు. వ్యక్తిగతంగా తాను ఎన్నడూ కూడ టికెట్ ఆశించలేదని తెలిపారు. బీ(టీ)ఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భావం దృష్ట్యా తన సేవలు తెలంగాణలో కాకుండా ఢిల్లీలో అవసరమని కేసీఆర్ గుర్తించారని అన్నారు.