ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 11: నిజామాబాద్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్ బుధవారం హంగామా సృష్టించారు. నగరంలోని హరిచరణ్ మార్వాడీ స్కూల్లోని పోలింగ్ బూత్ వద్ద పోలీసులు, ఎన్నికల సిబ్బందిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థిని బూత్ నుంచి బయటకు పంపించారనే సమాచారంతో అర్వింద్ అక్కడికి చేరుకున్నారు. లోపలికి వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు ఆపడంతో బూతుపురాణం అందుకున్నారు. ఎస్సై నారాయణపై నోటికొచ్చినట్టు తిట్ల దండకం ప్రయోగించారు. పోలీసోడికి ఒళ్లు బలిసిందా? యూజ్లెస్ ఫెలోస్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కండ్లు నెత్తికి ఎక్కినయా? ఏమనుకుంటున్నారు? క్యాండిడేట్‌ను బయటకు పంపుతరా?’ అని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ బూతులతో పోలీసులు ఏమీ చేయలేక పక్కకు తప్పుకొన్నారు. దీంతో అర్వింద్ తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రాల్లోకి దూసుకెళ్లారు. ఎవడాడు… అంటూ విధుల్లో ఉన్న సిబ్బందిపై మరోసారి ఇంగ్లిష్‌లో విరుచుకుపడ్డారు. బుర్ఖాలు తొలగించి ఓట్లు వేయించాలని అక్కడున్న వారికి హుకుం జారీచేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్తున్న క్రమంలో కార్యకర్తలు బీజేపీ అనుకూల నినాదాలు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో అర్వింద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.