హైదరాబాద్, జూన్ 7 (నమస్తేతెలంగాణ): ‘గోదావరి, కృష్ణా నదుల్లోని ప్రతి బొట్టును ఒడిసిపట్టి ఒక్క చుక్కను కూడా వదలకుండా కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, సీతారామ ప్రాజెక్టులను 90 శాతం పూర్తిచేసి తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడిచింది కేసీఆరే’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ కుమ్మైక్కె నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా రెండు పార్టీలు కూడబలుక్కొని కుట్రలకు తెగబడుతున్నాయని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరంలోని 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటని, ఈ ప్రాజెక్టులోని రెండు పిల్లర్లలో ఒక్కచోట పగుళ్లు వస్తే అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
శనివారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. ‘నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాగ్‌లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. వీటిని కేసీఆర్ తన పదేండ్ల పాలనలో సంపూర్ణంగా నెరవేర్చారు. కానీ నేటి కాంగ్రెస్ పాలనలో ఆ ట్యాగ్‌లైన్ మాయమైంది. బీఆర్ఎస్పై నిందలు, కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి దందాలు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు చందాలు పంపడం’ అని ఎద్దేవా చేశారు. ‘కాళేశ్వరం కమిషన్ విచారణ పేరిట బీఆర్ఎస్పై కాంగ్రెస్ బురద జల్లుతున్న తరుణంలో కాళేశ్వరంపై ప్రజల ముందు వాస్తవాలు పెట్టాలని, దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్న ఉద్దేశంతో కేసీఆర్ పాలనలో కోటి ఎకరాల మాగాణం సృష్టికర్త, మిగతా మంత్రుల కంటే గొప్పగా పనిచేసిన నేత, ఉద్యమ బిడ్డ, నీళ్ల వినియోగంపై సంపూర్ణ అవగాహన ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్స్ చూస్తుంటే సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు, కేసీఆర్‌కు నీటిపారుదల సలహాదారుడిగా మనందరికీ దిశానిర్దేశం చేసిన విద్యాసాగర్‌రావు గుర్తుకు వస్తున్నారని అన్నారు. ఆయన ‘నీళ్లు-నిజాలు’ అనే పుస్తకం రాసి నదీజలాల వినియోగంలో దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ తెలంగాణకు చేసిన అన్యాయాలను ఎలుగెత్తి చాటారని కొనియాడారు.
గుజరాత్‌లోని మార్బీ బ్రిడ్జి కూలిపోయి 140 మంది మరణించినా, బీహార్‌లో నాలుగు రోజులకో బ్రిడ్జి కూలిపోయినా ఎన్టీఎస్ఏగానీ, ఏ కేంద్ర ఏజెన్సీగానీ స్పందించలేదు. కాంగ్రెస్ హయాంలో సుంకిశాల కూలిపోయి రూ. 100 కోట్ల నష్టం జరిగినా ఎన్డీఎస్ఏ రాదు. కాంగ్రెస్ అవినీతి కోసం చేపట్టిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు టెన్నెల్ కూలిపోయి ఎనిమిది మంది మరణించినా సీఎం రేవంత్ మాట్లాడరు.
-కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ రిజర్వాయర్‌లో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే సీఎం రేవంత్, బీజేపీ కలిసి ఊరూవాడా ఏకం చేసి ఏదో జరిగిపోయినట్టు ఎన్డీఎస్ఏను రప్పించి రాద్ధాంతం చేశాయని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘గుజరాత్‌లోని మార్బీ బ్రిడ్జి కూలిపోయి 140 మంది మరణించినా, బీహార్‌లో నాలుగు రోజులకో బ్రిడ్జి కూలిపోయినా ఎన్టీఎస్ఏగానీ, ఏ కేంద్ర ఏజెన్సీగానీ స్పందించలేదు. 140 మంది చావులకు కారణమెవరో తేల్చలేదు. అదే కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో సుంకిశాల కూలిపోయి రూ. 100 కోట్లు నష్టం జరిగినా ఎన్డీఎస్ఏ రాదు.
కాంగ్రెస్ అవినీతి కోసం చేపట్టిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు టెన్నెల్ కూలిపోయి ఎనిమిది మంది మరణించినా సీఎం రేవంత్ మాట్లాడరు. మంత్రి ఉత్తమ్ నోరు మెదపరు. కేంద్ర పెద్దలు పట్టించుకోరు. వట్టెం పంప్‌హౌస్ మునిగిపోయినా దాని గురించి మాట్లాడేటోళ్లు లేరు. పెద్దవాగు రెండుసార్లు కొట్టుకుపోయినా అడిగే నాథుడు లేడు’ అని విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం విషయంలో మాత్రం ఇంకోవిధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ‘ఎన్డీఏ ఆఫీసులో వండివార్చి రిపోర్టును రూపొందించి ప్రజలను భ్రమింపజేసే ప్రయత్నం జేసిన్రు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని వంద కంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి. అందులోని మూడు బరాజ్‌లలో 370 పిల్లర్లు ఉంటే రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వచ్చినయ్. దాన్ని పట్టుకొని దున్నపోతు ఈనిందని కాంగ్రెసోడు అంటే దూడను కట్టెయ్యమన్నట్టు బీజేపోడు రెండు రోజుల్లో ఎన్డీఎస్ఏను పంపిండు.
-కేటీఆర్
కాళేశ్వరం కట్టిన ఎల్అండ్టీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్‌ను తిరస్కరించిందని, ఇది చెత్త బుట్టలో పడేయడానికి తప్ప ఎందుకూ పనికిరాదని తేల్చిచెప్పిందని గుర్తుచేశారు. ఎల్అండ్టీ పనికిరానిదైతే కాంగ్రెస్ కార్యాలయాన్ని ఎందుకు కట్టించావని రేవంత్‌ను ప్రశ్నించారు. ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయాన్ని సైతం తెలంగాణ నుంచి పోయిన మూటల నుంచే కట్టించారని, ఈ వాస్తవాలు ప్రజలకు తెలుసని చురకలంటించారు.
గోదావరి నీటిని చెరబట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును తెరపైకి తెచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. అనుమతుల్లేని ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిసినా ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చోద్యం చూడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఈ విషయంలో అటు కేంద్రం కూడా నోరు తెరవడం లేదని విమర్శించారు. ఏ నాటికైనా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు, రైతాంగానికి శ్రీరామరక్ష అని స్పష్టంచేశారు.
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై కాళేశ్వరం కమిషన్ పేరిట నాటకాలుడుతున్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. నీళ్లిచ్చిన కేటీఆర్ మీద అభాండాలు వేస్తున్నాయని దుయ్యబట్టారు. ఆ విషయంలో వాస్తవాలు బయటపెట్టేందుకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని హరీశ్‌రావును కోరానని తెలిపారు. ‘ఇక్కడే కాదు అమెరికాలోని డాలస్‌లో సైతం అక్కడి వారు కూడా వాస్తవాలు చెప్పాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై తెలంగాణ బొండిగ పిసికేందుకు చేసే ప్రయత్నాలను తిప్పికొడతమని చెబుతున్నరు’ అని గుర్తుచేశారు. తొమ్మిది నెలల క్రితం మేడిగడ్డను సందర్శించి వాస్తవాలు మీడియాకు చూపించామని పేర్కొన్నారు. మేడిగడ్డను రిపేర్ చేయించాలని ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను సైతం చూపించామని తెలిపారు. కట్టిన కంపెనీ మరమ్మతులు చేయించాలని ఎన్టీఎస్ఏ యాక్ట్‌లో స్పష్టంగా ఉన్నా కాంగ్రెస్ నాయకులు నోరు మెదపడం లేదని మండిపడ్డారు.