KCR | హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): ‘నాకు చేతనైనా కాకపోయినా.. నా కట్టె కాలేవరకు తెలంగాణకు అన్యాయం జరిగితే పులిలాగా కొట్లాడుత. అంతేతప్ప పిల్లిలాగా ఉండను. ఆరునూరైనా తెలంగాణకు ఏ విషయంలోనూ అన్యాయం జరగనివ్వను’.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తరచూ చెప్పే మాటలివి. దానికి తగ్గట్టే కేసీఆర్ మూడు నెలలుగా రాష్ట్ర ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా గత నెలన్నర రోజుల్లో ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలబెట్టారు. ప్రజాసమస్యలపై గొంతెత్తి గర్జిస్తున్నారు. కోట్ల మంది ప్రజాగొంతుకకు రాష్ట్ర ప్రభుత్వం జడిసి, అనేక సమస్యలను పరిష్కరిస్తున్నది. కొన్నింటికి గడువు విధిస్తున్నది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ భావించారు.
దురదృష్టవశాత్తు తుంటి ఎముక విరగటంతో రెండు నెలలు విశ్రాంతి తీసుకున్నారు. ఫిబ్రవరి 13న ‘చలో నల్లగొండ’ సభతో తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ప్రజాసమస్యలపై గళం ఎత్తుతూనే ఉన్నారు. ఎండిపోయిన పంటల పరిశీలన, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు మార్చిలో ప్రత్యేకయాత్ర మొదలుపెట్టారు. అప్పటి నుంచి అనేక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. కేసీఆర్ గొంతెత్తితే.. సర్కార్ తలొగ్గుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు.
కేసీఆర్ ఓ సందర్భంలో ‘ప్రజలు మాకు ప్రతిపక్షంలో ఉండే బాధ్యత అప్పగించారు. ఆ పాత్రను సమర్థంగా పోషిస్తాం. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై కొట్లాడుతం’ అని చెప్పారు. దీనికి తగ్గట్టే దాదాపు 45 రోజులుగా చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజాసమస్యలకు గొంతుకగా నిలిచారని విశ్లేషకులు చెప్తున్నారు. అనేక సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి.. దిగివచ్చి, పరిష్కరించేలా చేశారని వెల్లడించారు. మాటలతోనే ప్రభుత్వాన్ని తలొగ్గేలా చేయగలిగితే.. కేసీఆర్ చెప్తున్నట్టుగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డజనుకుపైగా ఎంపీ సీట్లు వస్తే తెలంగాణకు ఎంతో చేస్తారు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా ఇదే కోణంలో ఆలోచిస్తున్నారని, తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలన్నా, గోదావరిని ఇతర రాష్ర్టాలకు మళ్లించవద్దన్నా, కృష్ణాలో నీటిని కాపాడుకోవాలన్నా, జిల్లాలు రద్దుకాకుండా ఆగాలాన్నా, ఇతర సమస్యలు పరిష్కారం కావాలన్నా బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే సాధ్యం అవుతుందన్న భావన ప్రజల్లో బలంగా కనిపిస్తున్నదని పేర్కొంటున్నారు.
రైతుల గోసను వినేందుకు కేసీఆర్ మార్చి 31న జనగామ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించారు. తర్వాత ఏప్రిల్ 1న నల్లగొండ జిల్లాలో పర్యటించారు. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రైతులను ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు. కాళేశ్వరం నుంచి, దేవాదుల నుంచి నీళ్లు ఎందుకు ఎత్తిపోయడం లేదు? అని ప్రశ్నించారు.
తలొగ్గిన సర్కార్
మార్చి 31న మధ్యాహ్నం 3.30 గంటలకు కేసీఆర్ పర్యటన పూర్తయితే.. సాయంత్రం 4.30 గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి పంప్‌హౌజ్‌లో మోటర్లు స్టార్ట్ అయ్యాయి. లక్ష్మీపూర్ సర్జ్‌పూల్ నుంచి నీటిని ఎత్తిపోశారు. నల్లగొండ జిల్లాలోనూ ఏప్రిల్ 1న పర్యటన చేపట్టిన మరుసటి రోజే నాగార్జునసాగర్ ఎడమ కాలువ గేట్లు తెరుచుకున్నాయి. కాలువల్లోకి నీళ్లు పారాయి.
రైతుబంధును మొదలు పెట్టినప్పటి నుంచి ప్రతి రైతుకు, ప్రతి ఎకరానికి పెట్టుబడి సాయం అందించామని తన ప్రసంగాల్లో కేసీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఐదు ఎకరాలకే పరిమితం చేయాలని చూస్తున్నదని, మరి ఆరు ఎకరాలు, ఏడు ఎకరాలు ఉన్నోళ్లు ఏం పాపం చేశారు? అని ప్రశ్నించారు. ఇస్తే అందరికీ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.
తలొగ్గిన సర్కార్
ఐదు ఎకరాలకుపైన ఉన్న రైతులకూ రైతుబంధు నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 6 నుంచి ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో చేరుతాయని చెప్పింది. దీంతో ఐదున్నర లక్షల మంది రైతు కుటుంబాలు సంబురపడ్డాయి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా రుణమాఫీ చేయకపోవటంపై కేసీఆర్ నిలదీశారు. ‘రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోండి. మేము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిండు. మరి రూ.2 లక్షల రుణమాఫీ అయ్యిందా?’ అని ప్రతి రోడ్‌షోలో, ప్రతి సభలో కేసీఆర్ ప్రజలను ప్రశ్నించి, సమాధానం రాబట్టారు.
తలొగ్గిన సర్కార్
రుణమాఫీపై మొదట్లో నోరు మెదపని ప్రభుత్వం.. కేసీఆర్ ప్రశ్నకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి తలొగ్గక తప్పలేదు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఆ మాటను ప్రజలు నమ్మకపోవటంతో ఎక్కడికి వెళ్తే అక్కడి దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నారు.
తెలంగాణను తాము అంధకారం నుంచి విద్యుత్తు కాంతులతో నింపితే, కాంగ్రెస్ హయాంలో ఎడాపెడా కరెంటు కోతలు మొదలయ్యాయని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కరెంటు తొమ్మిదేండ్లు సక్కగా వచ్చింది కదా.. కేసీఆర్ దిగంగనే కట్క బంద్ చేసినట్టు ఎట్లా పోతది?’ అని నిలదీశారు. కేసీఆర్‌తోపాటు డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటనల సమయంలోనూ కరెంటు కోతలు ఎదురవడాన్ని ప్రస్తావించారు.
తలొగ్గిన సర్కార్
కరెంటు కోతలను నివారించలేపోయినా.. సీఎం, మంత్రులు, కేసీఆర్, ఇతర ప్రముఖుల పర్యటనలు ఉన్న ప్రాంతాల్లో కరెంటు పోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రచార సభలు, ప్రముఖులతో చర్చలు జరిగే ప్రాంతాల్లో ఎన్నడూ లేనివిధంగా ప్రత్యేకంగా విద్యుత్తు సిబ్బందిని మోహరించి, జాగ్రత్త పడుతున్నారు.
ఎండిపోయిన పంటలను, అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించేందుకు కేసీఆర్ ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే ఎకరాకు రూ.25 వేల పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తలొగ్గిన సర్కార్
ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయించి, సమగ్ర వివరాలు సేకరించింది. అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్టు గుర్తించింది. ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ఏప్రిల్‌లో నిర్ణయించింది. తాజాగా రూ.15 కోట్లు విడుదల చేసింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇచ్చి కొంటామని హామీ ఇచ్చింది. మ్యానిఫెస్టోలోనూ చెప్పుకొన్నది. అయితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత యాసంగి కొనుగోళ్లకు బోనస్ ఇవ్వకపోవటంతో కేసీఆర్ ప్రశ్నించారు. ‘రూ.500 బోనస్ వచ్చిందా? బోనస్ బోగస్ అయ్యింది కదా?’ అని ప్రజాక్షేత్రంలో నిలదీశారు.
దిగొచ్చిన సర్కార్
యాసంగి కొనుగోళ్లకు బోనస్‌పై ప్రభుత్వం చేతులెత్తేసింది. అయితే.. వానకాలం వచ్చే సీజన్ నుంచి ధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా ప్రతి పంటకు బోనస్ ఇస్తామని మాత్రం ఇంకా చెప్పడం లేదు.
చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి చేనేత కార్మికులను ఆదుకుంటుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసిందని మండిపడ్డారు.
తలొగ్గిన సర్కార్
మొదట్లో మొండికేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ తర్వాత దిగివచ్చింది. చేనేత కార్మికులకు రూ.351 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. ఏప్రిల్ 19న రూ.50 కోట్లు విడుదల చేసింది.
మేడిగడ్డ బరాజ్‌ను మరమ్మతులు చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. కుంగిపోయిన మూడు పిల్లర్లను రిపేర్ చేయించాల్సిందిపోయి మొత్తం కూలిపోయే పరిస్థితికి తెస్తున్నారని మండిపడ్డారు. ‘వానకాలం నాటికి మరమ్మతులు చేయించకపోతే 50 వేల మంది రైతులను తీసుకెళ్లి, ఎవరు అడ్డం వచ్చినా పండబెట్టి తొక్కుకుంటూ పోయి రిపేర్ చేయిస్తా’ అని ప్రకటించారు.
తలొగ్గిన సర్కార్
మొదట్లో ఎన్డీఎస్ఏ నుంచి పూర్తి స్థాయి నివేదిక వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టబోమని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ఎన్డీఎస్ఏ నుంచి మధ్యంతర నివేదికను తెప్పించుకున్నది. కుంగిన పిల్లర్లను రిపేర్ చేయించాలని అందులో నిపుణులు పేర్కొనటంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. దీంతో మరమ్మతులు చేయించటంపై దృష్టిపెట్టింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని హాస్టల్, మెస్‌లను మే 1 నుంచి 31 వరకు మూసివేస్తున్నట్టు చీఫ్ వార్డెన్ ప్రకటన విడుదల చేసినట్టు ప్రచారం జరిగింది. దీంతో కేసీఆర్ ఫైర్ అయ్యారు. హాస్టళ్లను ఎందుకు మూసివేయాల్సి వస్తున్నదంటూ ట్వీట్ చేశారు.
తలొగ్గిన సర్కార్
కేసీఆర్ ట్వీట్ చేసిన 24 గంటల్లోనే ప్రభుత్వం దిగివచ్చింది. హాస్టళ్లను తెరిచే ఉంచుతామని ఓయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు.