హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): పదేండ్ల కింద ఫ్లోరైడ్బండతో నడుములొంగిన నల్లగొండ పదేండ్ల తరువాత లేచి నిలబడింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఒక్క పంటకే గగనమైన చోట రెండు పంటలకు పుష్కలమైన నీళ్లు. ఎస్సారెస్పీ కాలువల్లో కాళేశ్వరం ఉప్పొంగితే ఆరేడేండ్లు ఉమ్మడి కరీంనగర్ మీదుగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో జలసిరులు. కృష్ణమ్మతో గోదావరి కరచాలనం. బేసిన్లను చెరిపేసే జలబంధం ఆవిష్కరణ. రైతుల ఇండ్లు పంటరాసులతో పరవశించిన దృశ్యాలు. పదేండ్ల కేసీఆర్ పాలనలో తులతూగిననేల ఎందుకో చిన్నబోయింది. నిన్నమొన్నటిదాకా సిరులు కురిసిన నేల నేడు చిన్నబోయింది. రైతుబంధు పోయింది. బోనస్ బొంకులు రుణమాఫీ. దేవుళ్ల నెత్తిన చెయ్యి. రుణమాఫీ ఆశల ఉసురు తీస్తున్నరు. పాతను రోత అంటున్నరు. ఓట్లకోసం తిట్లపురాణం తెరిస్తే తెరిసిండ్లు.. మంచిదే కానీ, ధాన్యపు సిరులతో కాలర్ ఎగరేసిన రైతు ఇప్పుడు చేతులు జోడించి పంట కొనమని ప్రాధేయపడుతున్న దయనీయ చూపులు. గన్నీబ్యాగుల కోసం ఎదురుచూపులు. ఐకేపీ కేంద్రంలో 20 రోజులైనా సంచుల వడ్లు సంచులనే మూలుగుడు. యాభైఏండ్ల గోస ..14 ఏండ్ల పోరాటం.. పదేండ్లు నవ్వులు.. నాలుగైదు నెలలకే బొగ్గులను నాటేస్తున్న పాలకులు. ‘బండెనక బండికట్టి.. పదహారుబండ్లు కట్టి.. ’ పాటపుట్టన నేల మీద పరిహాసపు సర్కారు పగబట్టిన సిత్రాలు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం ఇల్లు బైలెల్లిండు. ఎన్నికలవేళ అన్ని పార్టీలు ఓట్లు అడగడం సహజం. కానీ, కేసీఆర్ అందుకు భిన్నమైన పంథాను ఎంచుకున్నారు. రాష్ట్రసాధన ఉద్యమ సమయంలో అనుసరించిన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ, సూర్యాపేట ఈ రెండుచోట్ల మినహా మరెక్కడా ఓట్ల ప్రస్తావన తేలేదు. ఆ రెండు చోట్ల మాత్రమే రాజకీయ ప్రసంగాలు చేశారు. కానీ, హైదరాబాద్లోని తన నివాసం (నందినగర్) నుంచి తెలంగాణ భవన్ చేరుకొని అక్కడ తెలంగాణ తల్లికి పూలమాల వేసి బస్సుయాత్ర నల్లగొండకు బయలుదేరింది. ఉప్పల్, ఎల్బీనగర్, చౌటుప్పల్, నార్కట్పల్లి, నల్లగొండ మాడ్గులపల్లి, మిర్యాలగూడ, వేములపల్లి, మాడ్గులపల్లి, తిప్పర్తి, నార్కెట్పల్లి బైపాస్ కేతెపల్లి, సూర్యాపేట మీదుగా కేసీఆర్ తొలిరోజు బస్సుయాత్ర సాగింది. బస్సు నడిచిన బాటలో గ్రామాలు, పట్టణాలు కలిసినచోటల్లా గులాబీపూనవాన కురిస్తే, పంటపొలాలు.. రైతుకల్లాలున్నచోట రైతన్నల ధీనగాథలు వింటూ సాగారు. కేసీఆర్ తన పర్యటనలో రైతుల దుస్థితిపై పిడికిలెత్తారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో నెలకొనే వాతావరణానికి సంకేతమిచ్చారు. అప్రమత్తంగా ఉండి రైతును ఆదుకోకపోతే సర్కారుపై తిరుగుబాటు చేస్తామని హెచ్చరిక జారీచేశారు. రైతుగుండెకు ఎలా ధైర్యమిచ్చారో.. సామాన్యులకు అంతేఅండగా ఉంటానని హామీ ఇచ్చారు. పదేండ్లు ఉండడం వల్ల కేసీఆర్ పలకరింపునకు దూరమైన పల్లెలు మాడ్గులపల్లి దాబా సాక్షిగా పులకరించిపోయాయి.