నల్లగొండ నుంచి హైదరాబాద్ ప్రతినిధి, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): ‘కేసీఆర్ అధికారం కోల్పోయి మానసికంగా కుంగిపోయాడు.. తుంటికీలు శస్త్రచికిత్స తర్వాత శారీరకంగా కూడా బలహీనుడయ్యాడు.. ఇక కేసీఆర్ పని అయిపోయినట్టే..’ ఇలా ఎన్నో కామెంట్లు, ఎన్నో అనుమానాలు. వాటన్నింటికీ నల్లగొండ సభలో చెక్ పెట్టారు కేసీఆర్. ‘నన్ను ఏమన్నా పట్టించుకోను. కానీ, తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగితే మాత్రం పులిలెక్క కొట్లాడుతా’ అని కేసీఆర్ తరుచూ చెప్పినట్టే.. మంగళవారం నల్లగొండలో నిర్వహించిన ‘చలో నల్లగొండ’ సభలో పులి మాదిరిగా గర్జించారు. పదేండ్లుగా ప్రాజెక్టులు పరాయిపాలు కాకుండా తాను అడ్డుగోడలా నిలిచి కాపాడితే.. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల్లోనే బోర్డులకు ఎలా అప్పజెప్పిందో ప్రజలకు వివరించి చైతన్యం చేశారు.
ఈ ఒక్క సభతోనే సరిపోదని, మన నీళ్ల హక్కుల కోసం మరిన్ని ఉద్యమాలు చేయాల్సి వస్తుందని దిశానిర్దేశం చేశారు. ‘మీరిచ్చిన అధికారంతో పదేండ్లు కష్టపడిన. ప్రతిపక్షంలోకి వచ్చినంక నాలుగొద్దులు ఆరాంగా రెస్ట్ తీసుకుందామనుకున్న. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుంటే సహించలేక కుంటుకుంటనో, కట్టెపట్టుకొనో వచ్చిన’ అంటూ తెలంగాణ మట్టిపై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వివరిస్తూనే.. మరోవైపు ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగిస్తే జరిగే నష్టాన్ని వివరిస్తూ ప్రజలను చైతన్యం చేశారు. భవిష్యత్ ఉద్యమాలకు దిశానిర్దేశం చేశారు. ‘నా కట్టె కాలే వరకు.. చివరి శ్వాస వరకు.. తెలంగాణ ప్రజల కోసం పులిలెక్క కొట్లాడుతా’ అంటూ కార్యాచరణను ప్రకటించారు.
‘గతంలో ఉద్యమంలో ఉన్నం కాబట్టి ఉద్యమభాషలో మాట్లాడినం. ఇప్పుడు అధికారంలో ఉన్నం కాబట్టి బాధ్యతతో మాట్లాడాలె’ అన్నది పదేండ్లుగా కేసీఆర్ ఆచరించిన సిద్ధాంతం. నల్లగొండ సభతో ‘పాత’ కేసీఆర్ మళ్లీ కనిపించారు. ‘నల్లమొఖం ఎలుక పోయి సచ్చిన ఎలుకను పట్టుకొచ్చిందట.. పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్నరు..’ ఇలాంటి ఎన్నో పంచులు, ప్రాసలు, సామెతలతో ప్రసంగాన్ని హోరెత్తించారు. దీంతో సభకు వచ్చినవాళ్లంతా ‘ఇది కదా కేసీఆర్ అంటే.. ఇప్పుడు మా కడుపు నిండింది’ అంటూ సంబురపడ్డారు. కేసీఆర్ సామెతలు వాడిన ప్రతిసారీ ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. ‘రైతుబంధు అడిగితే చెప్పుతోని కొడుతా అంటరా? రైతులకు కూడా చెప్పులుంటయి.. అవి గట్టిగుంటయి.. వాటితో కొడితే ఒక్క దెబ్బకు మూడు పండ్లు రాలుతయి’ అన్నప్పుడు సభలో ఉన్న రైతులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తంచేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా కరెంటు పోలేదని, ఇప్పుడు అసెంబ్లీలో కూడా జనరేటర్ పెట్టుకున్నరని విమర్శించగానే ‘అవును’ అంటూ ప్రజల నుంచి సమాధానం వచ్చింది.
‘రైతుబంధు కూడా ఇవ్వడానికి శాతనైతలేదా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించగానే.. ‘పడలేదు’ అంటూ ప్రజలు సమాధానం ఇచ్చారు. ‘సారు ఉన్నప్పుడు టైముకు పైసలు పడుతుండే. కాంగ్రెసోళ్లు డిసెంబర్లో అధికారంలోకి రాగానే రూ.15 వేలు ఇస్తమన్నరు. ఇప్పుడు రెండు నెలలైనా ఇస్తలేరు’ అని హాలియాకు చెందిన సైదులు అనే రైతు వాపోయారు. ‘రైతులను అవమానిస్తరా? ఎన్ని గుండెలురా మీకు? కండకావరమా? కండ్లు నెత్తికెక్కినయా?’ అంటూ కేసీఆర్ విరుచుకుపడిన ప్రతి మాటనూ ప్రజలు హర్షధ్వానాలతో స్వాగతించారు. ‘ఉయ్..’ అంటూ రెట్టించిన ఉత్సాహం కనబరిచారు. ‘ప్రాజెక్టులను బోర్డులకు అప్పగిస్తే పంటకు నీళ్లు కావాలన్నా.. తాగేనీళ్లు కావాలన్నా చిప్ప పట్టుకొని అడుక్కోవాలె’ అన్న కేసీఆర్ మాటలు ప్రజల్లో ఆలోచన రేకెత్తించాయి. ‘కేసీఆర్‌ను తిరుగనీయం అంటరా. ఏం చేస్తరు? సంపుతరా? సంపి మీరు తిరుగుతరా?’ అన్నప్పుడు ప్రజలు కూడా భావోద్వేగానికి గురయ్యారు.
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని నాలుగు నెలలుగా ఎదురవుతున్న ప్రశ్నలకు నల్లగొండ సభలో తెరదించారు. ‘కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదు.. మూడు బరాజ్‌లు, పంప్‌హౌజ్‌లు, కాలువలు, సబ్స్టేషన్లు..’ అని వివరిస్తున్నప్పుడు ప్రజలు చెవులు రిక్కించి విన్నారు. ‘మేడిగడ్డలో ఉన్న వందల పిల్లర్లలో రెండుమూడు కుంగినయి. ఇట్లా ఎన్ని ప్రాజెక్టులకు జరగలేదు? నాగార్జునసాగర్‌లో కుంగలేదా? ప్రభుత్వం వాటికి మరమ్మతులు చేసి నీళ్లు ఎత్తిపోసి పంటలకు నీళ్లందించాలి. కానీ, కేసీఆర్ మీద కోపంతో నీళ్లు ఎత్తిపోసుడు బంద్ పెట్టిన్రు’ అంటూ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగట్టారు. ఇప్పటికీ ప్రాణహితలో నీళ్లు ఉన్నాయని, వెంటనే ఎత్తిపోయకపోతే సూర్యాపేటకు కూడా కావాల్సిన నీళ్లు రావని హెచ్చరించారు. దీంతో ‘కొట్లాడి నీళ్లు తెచ్చేటోడు లేక కాలువలకు నీళ్లు రాలేదు.
శానా ఏండ్ల తర్వాత మా పంటలు ఎండిపోయినయి’ అంటూ సభలో ఉన్న నల్లగొండకు చెందిన సతీశ్‌రెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను పక్కనపెట్టి ఇతర అంశాలను మాట్లాడదని, కానీ తాను ‘చలో నల్లగొండ’ పిలుపు ఇవ్వగానే ప్రభుత్వానికి చెమటలు పట్టాయని, అందుకే ఆగమేఘాల మీద తీర్మానం పెట్టిందని ఎద్దేవా చేశారు. ఆ సమయంలో హరీశ్‌రావు ఒక్కడే సమర్థంగా మొత్తం ప్రభుత్వాన్నే ఎదుర్కొన్నారని అభినందించగానే ప్రజలు హర్షధ్వానాలు చేశారు. ‘మేం చలో నల్లగొండ అంటే.. వాళ్లు మేడిగడ్డకు పోయినరు. మేడిగడ్డ.. బొందలగడ్డ.. అనుకుంట తిరుగుతున్నరు. మేడిగడ్డ కాడ మీ తోకమట్ట ఉన్నదా?’ అంటూ ధ్వజమెత్తడంతో ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు.
సభాప్రాగణంపైకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు వచ్చినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ స్వాగతం పలికారు. ఆ తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డి వేదిక మీదికి రాగా.. సభికుల్లో ఉత్సాహం రెట్టించింది. మల్లారెడ్డి తనదైన ైస్టెల్లో రెండు చేతులు ఎత్తి అభివాదం చేయగానే మరింత ఉత్సాహం కనిపించింది. దీంతో ‘మల్లన్న క్రేజే వేరు’ అని సభికుల నుంచి కామెంట్ వినిపించింది. సభలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాకారులు పాడిన పాటలకు ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. ముఖ్యంగా ‘ఏమాయెనే నల్లగొండ’ పాటకు సభికుల నుంచి మంచి స్పందన వచ్చింది. నల్లగొండ జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో ఎలా ఉండేది.. పదేండ్లలో ఎలా మారింది.. ఇప్పుడు ఏ దశలో ఉన్నదో పాటల్లో వివిరించారు.
కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సభా ప్రాంగణం సమీపంలోకి వచ్చినప్పటి నుంచే ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. అందరూ కుర్చీల్లో నుంచి లేచి అభివాదం చేశారు. తర్వాత కేసీఆర్ స్టేజీ మీదికి వెళ్లి కుర్చీలో కూర్చునే వరకు చప్పట్లు, విజిల్స్‌తో స్వాగతం పలికారు. పిడికిలి ఎత్తి అభివాదం చేశారు. కేసీఆర్ ప్రసంగం ప్రారంభించగానే ‘సీఎం.. సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు వినిపించాయి. ఆ తర్వాత కూడా రెండుమూడుసార్లు ‘సీఎం.. సీఎం’ అంటూ హోరెత్తించారు. దీంతో ఒక దశలో ‘ఆపండయ్యా బాబు’ అని కేసీఆర్ అనాల్సి వచ్చింది. ‘డబుల్ స్పీడ్‌తో మనం అధికారంలోకి వస్తాం’ అని కేసీఆర్ అనగానే సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లింది. ‘సారు లేకపోతే ఏమైతదో ఇప్పుడు అర్థమైతున్నది. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నయి. కరంటు ఆగమైంది. రైతుబంధు ఆగిపోయింది’ అని మిర్యాలగూడకు చెందిన కోటిరెడ్డి అనే రైతు వాపోయారు. ‘అప్పుడు తప్పు చేసినం.. ఈసారి తప్పు చేయం. మల్లా సారు వస్తేనే పరిస్థితి చక్కబడుతది’ అని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘సారు మల్లా సీఎం కావాలె. తెలంగాణ బాగుపడాలె’ అని సురేశ్ అనే యువకుడు చెప్పారు.
సాధారణంగా కేసీఆర్ తన పునరాగమన సభలను ఉత్తర తెలంగాణలో నిర్వహిస్తుంటారు. కానీ ఈసారి సంప్రదాయానికి భిన్నంగా దక్షిణ తెలంగాణ నుంచి ప్రారంభించారు. ఇదే సభను బీఆర్ఎస్ గెలిచిన సూర్యాపేటలో పెట్టుకునే అవకాశం ఉన్నది. కానీ.. అన్ని సీట్లు కోల్పోయిన నల్లగొండ జిల్లాలో సభ పెట్టడం ద్వారా తాను ప్రత్యేకమైన లీడర్‌ను అని నిరూపించుకున్నారు. సభకు పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చారు. సాయంత్రం 4 గంటలకు సభ కాగా.. ఉదయం 11 గంటల నుంచే సభా ప్రాంగణానికి ప్రజలు రావడం మొదలైంది.