హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం జగిత్యాల జైత్రయాత్ర నుంచే మొదలు కావాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజల మంచి కోరే ప్రతిఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనని, తెలంగాణ సమాజం అంతా ఏకతాటిపైకి రావాలని, రాష్ట్ర అభివృద్ధి కోసం మళ్లీ పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. రాజకీయ శక్తుల పునరేకీకరణ చేసుకుంటూ తప్పకుండా విజయం సాధించాలని పేర్కొన్నారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు, ఆటో కార్మికులు అందరి జీవితాలు అగమ్యగోచరంగా మారినయ్. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ఒక సీమ్ కూడా ఈ ప్రభుత్వం తీసుకురాలేదు. కచ్చితంగా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తది.
తెలంగాణను మళ్లీ గాడిలో పెడుతుంది’ అని స్పష్టంచేశారు. జగిత్యాల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ‘కాంగ్రెసోళ్ల మాటలు వింటే కోటలు దాటినట్టు.. చేతలు గడపదాటనట్టు ఉన్నయి’ అని విమర్శించారు. ‘కాంగ్రెస్ పాలనలో రెండున్నరేండ్లు గడిచిపోయినయ్. వట్టి ముచ్చట్లు, మాటలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. నాడు దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లెప్రగతి కార్యక్రమాలు నిర్వహించినం. చనిపోతే అంత్యక్రియలు జరుపుకోవడానికి కూడా 75 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ పాలకులు కనీసం జాగ చూపించలేదు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు కట్టినం. క్రీడా ప్రాంగణాలు కట్టినం. ప్రతిగ్రామంలో నర్సీలు పెట్టినం. పల్లె ప్రకృతి వనాలు పెట్టినం. ప్రతిగ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇప్పించినం. ఇప్పుడు ఆ ట్రాక్టర్లు పనిచేస్తున్నయా? డీజిల్ పోసే దిక్కులేక మూలకు పడినయ్. పల్లె ప్రకృతి వనాలకు నీళ్లుపోసే దిక్కు లేదు. ఏ రోగమొచ్చింది ఈ పాలకులకు? ట్రాక్టర్లలో డీజిల్ పోయించే తెలివి కూడా లేదా?’ అని నిలదీశారు.
కాంగ్రెస్ పోవాలె.. బీఆర్ఎస్ రావాలె
రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా కాంగ్రెస్ పోవాలె.. బీఆర్ఎస్ రావాలె అని కోరుకుంటున్నారని కేసీఆర్ స్పష్టంచేశారు. ‘ఆ రోజు నేను సీఎస్‌కు అవసరమైతే ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టండి గానీ గ్రామ పంచాయతీల డబ్బులు విడుదల చేయాలని చెప్పిన. ఠంఛన్‌గా గ్రామాలకు డబ్బులు పంపించేది. కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేవి. గ్రామాలు మంచిగుండేవి. వాటిని కూడా ఇప్పుడు నాశనం పట్టిచ్చిండ్రు. మున్సిపాలిటీలు మురికికూపాలుగా మారినయ్. ఏం సక్కగున్నట్టు? ఏం బాగున్నట్టు? అందుకే జీవన్‌రెడ్డి లాంటి వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి.. ‘కాంగ్రెస్ పోవాలె.. బీఆర్ఎస్ రావాలె’ అన్నరు. ఆ మాట ఎందుకొస్తది. వట్టిగనే వస్తదా? బాధ్యత లేకుండా వస్తదా? ఏది చూసినా సక్కదనం లేకపోతే, పొద్దునలేస్తే దోపిడీ తప్ప ఇంకేం లేకపోతే ఈ పరిస్థితి వస్తది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాశనం. ఉద్యోగులు ఆగం, రిటైర్డ్ ఉద్యోగులు ఆగం. విద్యార్థుల జీవితాలు ఆగం. ఆటో కార్మికుల జీవితాలు ఆగం. ఎవరు సక్కగున్నరు? ఎవరు సంతృప్తిగ ఉన్నరు? రాష్ట్రంలో ఏం జరుగుతావున్నది? కచ్చితంగా ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలి’ అని పిలుపునిచ్చారు.
హైడ్రాను చెరువులో పారేస్తం
కాంగ్రెస్ పాలనలో ప్రజలను బాగు చేయకపోగా, హైడ్రా పేరుతో పేదలను రోడ్డున పడేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ‘కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పేదలు ఎక్కడున్నరో అక్కడే 3.5 లక్షల మందికి పట్టాలిచ్చినం. వారివి పేద జీవితాలు ఇబ్బంది పెట్టొద్దని పట్టాలిచ్చినం. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్లు బతకాలని పట్టాలిచ్చినం. ఇవాళ పిల్లలు పుస్తకాలు కూడా తీసుకోవడానికి సమయం ఇవ్వకుండా కూల్చివేతలు ఏంది? అంత తొందరపాటు ఎందుకు? గ్యారెంటీగా బీఆర్ఎస్ వచ్చేది ఖాయం. వచ్చిన వెంటనే హైడ్రాను ఎత్తి అవతల పడేస్తం. మొదటి సంతకంతోనే హైడ్రాను పీకి చెరువులో పారేస్తం. 46 వేల చెరువులు మంచిగ చేసినం. ఎవరి గుడిసె అయినా కూల్చినమా? ఇల్లు కూల్చినమా? ఇదేం విచిత్రం! మూసీ వెంట ఉన్న గరీబోళ్లను ఏడిపించడం ఏంది? వాళ్లకు కంటి మీద కనుకులేకుండా ఇబ్బందులు పెట్టుడేంది? ఆ ప్రాజెక్టు అయ్యేది కాదు, పొయ్యేది కాదు. 15 వేల ఇండ్లు కూల్చుతరట! అది ధర్మమేనా? పనికిరాని హైడ్రా తెచ్చి వేల ఇండ్లు కూలగొడ్డటం ఏంది? మూసీని మంచిగ చేయాల్సిందే. మంచిగ చేయొద్దని ఎవరూ అనరు. అన్ని వేల ఇండ్లు కూలగొట్టుడు ఎందుకు? ఇందులో ఏమీ లేదు. భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏమీ లేదు. మూసీ సుందరీకరణ ప్రజల మేలు కోసం కాదు. కాంగ్రెస్ నేతల డబ్బుల కోసం. మామూలుగా చేయాల్సిన దాన్ని డబ్బుల కోసం రియల్ ఎస్టేట్ దందాగా చేస్తున్నరు’ అని ఆగ్రహం వ్యకంచేశారు.
అరాచకం తప్ప మరోటి లేదు
రాష్ట్రంలో రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఏది చూసినా దోపిడీ, గూండాగిరీ, అరాచకం తప్ప మరోటి లేదని కేసీఆర్ విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ఒక్క స్కీమ్ కూడా రాలేదని మండిపడ్డారు. ‘ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆడనే పండబెట్టిండ్రు. ఏం రోగం? ఒకనాడు కాకతీయ వరద కాలువ మీద మోటర్లు పెడితే లారీల్లో వచ్చి వేల మోటర్లను కోసుకపోయేటోళ్లు. కేసీఆర్ సర్కార్ ఉన్నన్ని రోజులు ఎవరైనా మాట్లాడిండ్రా? హాయిగా వ్యవసాయం చేసుకున్నరు. అప్పుడు కూడా నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా ఉండె. వ్యవసాయ కరెంటు మోటర్లకు మీటర్లు పెట్టాలని నాపై ఒత్తిడి తెచ్చిండ్రు. నా గొంతులో ప్రాణం పోయినా, సచ్చినా మీటర్లు పెట్టనని తెగేసి చెప్పిన. మీటర్లు పెట్టకపోతే రూ.30 వేల కోట్ల నిధులు ఇవ్వనని చెప్పిండ్రు. ఇవ్వకుండా కట్ చేసిండ్రు. రాష్ర్టానికి వచ్చే ఆదాయం రూ.30 వేల కోట్లు వదులుకొని కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తెలంగాణ రైతుల మోటర్లకు మీటర్లు పెట్టనివ్వలే. ఇవాళ.. అయ్యా బాంచెన్.. రైతుల మోటర్లకు మీటర్లు పెడుతం. ఆ పైసలు (రూ.30వేల కోట్లు) ఇవ్వుండ్రి అని ఢిల్లీలో సాగిల పడుతున్నరు. కేసీఆర్ పెట్టనన్నరు కాదా.. మేము మీటర్లు పెడుతమని ఈ ప్రభుత్వమే ఢిల్లీకి పోయి సంతకం పెట్టింది. ఇప్పుడు మోటర్లకు మీటర్లు మొదలయితై. ఎదుర్కొందామా? మీటర్ల ఏర్పాటుపై యుద్ధం చేద్దామా? కొట్లాడుదామా?’ అని అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి అడిగారు. ‘కొట్లాడుదాం.. కొట్లాడుదాం’ అని ఘంటాపథంగా ప్రజలు సమాధానమిచ్చారు.
సంక్షేమ పథకాలు ఎందుకు బందైనయ్?
‘మనం ఏమన్నం. రైతులు మంచిగుండాలె. పల్లెలు మంచిగుండాలె. ఎవుసం మంచిగుండాలె, వృత్తి పనులు బాగుండాలె అని.. యాదవులకు గొర్రెలు ఇప్పించినం. ఇప్పుడొస్తున్నయా గొర్రెలు? ఎందుకు బందైనట్టు? దానికేం రోగమెచ్చె? చేపలు పట్టేవారి కోసం చేపపిల్లలు ఇచ్చినం. ఇప్పుడు వస్తున్నాయా? ఎవరికి ఇచ్చినట్టు? ఎవరికి మేలు చేసినట్టు? వృత్తిపనివారికి ఉండదు. బీడీ కార్మికులు ఉన్నరు. వారెవరూ నాకు దరఖాస్తు ఇవ్వలే. అడుగలేదు కూడా. తుల ఉమ బీసీ కార్మికుల బాధల గురించి చెప్పేది. మా అంతట మేమే ఆలోచించుకొని బీడీ కార్మికులకు పింఛన్ తెచ్చినం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తున్నరా? కాంగ్రెస్ నాయకులు పింఛన్లు పెంచుతమని ఎగబెట్టిర్రా? లేదా? ఎన్ని ఆశలు పెట్టిండ్రు? మహాలక్ష్మీ పేరుతో ఇంట్లో ఉండే ఆడోళ్లకు నెలకు రూ.2,500 ఇస్తమన్నరు. ఇచ్చిండ్రా? రూపాయి వచ్చిందా? అట్లా ఎన్ని? ఆరు గ్యారెంటీలు! 420 హామీలు అన్నరు. ఒక్కటైనా అమలు చేస్తున్నరా? స్కూటీలు ఎక్కడబాయె? ఏమన్నా వచ్చినయా?’ అని నిప్పులు చెరిగారు.
రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగాలి
‘ఇక్కడికి వచ్చిన సభలో ఉన్నవాళ్లు మాత్రమే కాదు. యావత్ తెలంగాణ నా మాటలు వింటున్నది. వారంతా అర్థం చేసుకోవాలె. నేను చెప్పినవి నిజమా? అబద్ధామా? తెలంగాణ ప్రజానీకం ఆలోచించుకోవాలె. ప్రజల మంచి కోరే ప్రతిఒక్కరూ ఒక్కటి కావాలె. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ మొదలు కావాలె’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. దాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.
‘ఇబ్బంది ఉన్నదని ఆగిపోతమా? ఊకుందామా? పోరాటం చేయాల్సిందే. వారిని నిలదీయాల్సిందే. కచ్చితంగా తెలంగాణ పునర్మిర్మాణ యజ్ఞం మళ్లీ ప్రారంభం కావాల్సిందే. తెలంగాణ ప్రజలు గెలిచి నిలువాల్సిందే. మొత్తం ప్రాజెక్టులు పండబెట్టిండ్రు. వలసల జిల్లా, కరువు జిల్లా అయిన మహబూబ్‌నగర్‌లో పాలమూరు ఎత్తిపోతల పథకం 90 శాతం పూర్తిచేసినం. కొద్దిమొత్తంతోటి అయిపోతది. వాళ్లనూ నాశనం బట్టించిండ్రు. అన్నీ అబద్ధాలు. ఒక్కటి కూడా ప్రజలకు పనికివచ్చే క్రియాశీలక పని చేయలే. అదిలేకపోగా, కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుదాడులు. ఎవరైనా ఎదురు మాట్లాడితే వారిని పట్టుకెళ్లడం, జైళ్ల వేయడం? ఇదా రాజకీయమంటే? ఈ విధమైన కథనా ఉండేది? జగిత్యాల సభకు జీవనన్న వెంట తండోపతండాలుగా తరలివచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. సభలో ఉన్నదానికంటే బయట ఎక్కువ మంది ఉన్నరు. మీ అందరికీ స్వాగతం పలుకుతున్నం. అందరం కలిసి బ్రహ్మాండంగా పనిచేద్దాం. జగిత్యాల జైత్రయాత్రనే.. రాజకీయ శక్తుల పునరేకీకరణ చేసుకుంటూ విజయం సాధించే దిశగా ముందుకెళ్దాం. తప్పకుండా విజయం సాధించాలి. తెలంగాణ పునర్మిర్మాణ యజ్ఞం పునఃప్రారంభం కావాలి. సభకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్న’ అని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.