KCR | హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): అసమర్థ, అవివేక, తెలివి తక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో కరెంటు, సాగు నీటి కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఫైరయ్యారు. ఎండిన పంటలు, రైతుల కండ్లలో కన్నీళ్లు చూస్తుంటే గుండె బరువెక్కుతున్నదని చెప్పారు. 100 రోజుల్లోనే 200 మంది ఆత్మహత్య చేసుకోవటం ఏమిటని సర్కారును నిలదీశారు.
కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలోనే రాష్ట్రం నాశనమైపోతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన ప్రతి ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలని లేకపోతే ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించారు. రైతులను పరామర్శించి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన పూర్తి సారాంశం ఆయన మాటల్లోనే..
రైతులు కన్నీరు మున్నీరవుతున్నరు
జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ బృందం నాతో కలిసి పరిశీలించింది. చాలా చోట్ల రైతులు కన్నీరు మున్నీరయ్యారు. పెట్టుబడులు పెట్టినష్టపోయినమని, మమ్మల్ని ఆదుకోవాలని విలపించారు. చాలా గ్రామాల్లో చెప్పిందేంటంటే.. నీళ్లు ఇస్తమని అన్నరు. మొదట ఇచ్చారని, నమ్మి పంటలు వేసుకున్నరు. మొదలే ఇయ్యబోమని చెప్తే కనీసం వెయ్యకుండా ఉండేవాళ్లం. మాకు అనవసరంగా ప్రభుత్వం నష్టం చేసింది అని రైతులు చెప్తున్నరు.
గత పది సంవత్సరాల్లో మొదట 2-3 ఏండ్లు మినహాయిస్తే మిగిలిన 7-8 ఏండ్లు వ్యవసాయ స్థిరీకరణ అనే అంశాన్ని కేంద్రబిందువుగా పెట్టుకుని, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టమైన విధానాలు తీసుకుని చర్యలు చేపట్టింది. ఒకటి రైతులకు అనేక పద్ధతుల ద్వారా నీరు సరఫరా చేయటం. రెండవది రైతుబంధు అనే వినూత్న కార్యక్రమాన్ని తీసుకువచ్చి రైతులకు సరైన సమయంలో పెట్టుబడి సాయం చేయటం. మూడవది 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయటం.
నాలుగవది రైతుల పంటలన్నీ 7,600కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయటం. ఐదవది రైతుబీమా ఏర్పాటు చేయటం. ఇలాంటి నిర్ధిష్టమైన పనులతో వ్యవసాయంలో తెలంగాణ అద్భుతమైన దశకు చేరుకున్నది. 2014కు ముందు 30-40 లక్షల టన్నుల ధాన్యం కూడా పండించని తెలంగాణ, 3 కోట్ల టన్నులకుపైగా ధాన్యాన్ని పండించి పంజాబ్‌కు పోటీగా నిలిచింది. దేశంలో అగ్రస్థానానికి దూసుకుపోయింది. ఇది అందరి కండ్లముందున్న దృశ్యం.
కాళేశ్వరంపై చిల్లర డ్రామాలు
ఇటీవల ఓ చిల్లర డ్రామాకు తెరతీశారు. చీప్ టాక్టిక్ కోసం.. కాళేశ్వరంలో పోయే నీళ్లు కూడా సముద్రంలోకి వదలిపెట్టారు. ఏం మునిగి పోయిందని దానిపై దుష్ప్రచారం చేసి, ప్రపంచం కొట్టుకుపోయినట్టు.. భూ మండలమంతా కిందామీదైనట్టు.. దాంట్లో ఏదో జరిగిపోయినట్టు.. ఓ తప్పుడు కథ పెట్టుకొని, మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి నీళ్లను వృథాగా వదలిపెట్టారు. మొన్నటివరకు కూడా కాళేశ్వరం నుంచి 6 వేలు, 7వేల క్యూసెక్కుల నీళ్లు పోయాయి.
సింగిల్ మోటర్ నడుపుకున్నా కాల్వలు పారించొచ్చు. వీళ్లు గవర్నమెంట్‌కు వచ్చే టైమ్‌లో 25 వేలు, 30 వేల క్యూసెక్కుల నీళ్లు పోతుంటే.. వాటిని ఎత్తడానికి వీళ్లకు ఏమైంది? ఎమర్జెన్సీ ఉంటే నీళ్లు ఇవ్వాలి కదా. పైన ఉన్న బ్యారేజీల్లో నీళ్లు తమాషాకు వదిలిపెట్టి.. ఊట నీళ్లు పోతున్నా కూడా దానిని ఫొటోలు, వీడియోలు తీసి.. అది ఖతమైపోయినట్టు ప్రచారం చేసిర్రు. ఉత్తరప్రదేశ్‌లోనో, బీహార్లోనే ఓ బ్రిడ్జి కడుతుంటే కూలిపోయింది.
ఓ నిర్మాణం చేస్తున్నప్పుడు ఇట్లాంటివి సహజం. నాగార్జునసాగర్ బ్యారేజ్ కూడా కుడివైపు కుంగిపోయింది. మళ్లీ పునరుద్ధరించలేదా? పనులు పూర్తి చేయలేదా? కడెం ప్రాజెక్టు కొట్టుకుపోలేదా? అమెరికాలోని ఓ హూవర్‌డ్యామ్ నాలుగుసార్లు కొట్టుకుపోయింది. వాళ్లేమన్నా విడిచిపెట్టిర్రా? కొందరు ఇంజినీర్ల తప్పువల్లనో, అనుకోకుండా ఏర్పడిన ఫలితాల వల్లనో, గోదావరి జియాలజీలో ఎక్కడైనా కిందమీదైతనో, పిల్లర్ల కింద ఇసుక కొట్టుకుపోతేనో కొన్ని తప్పిదాలు జరుగుతాయి. అదేదో ప్రళయం బద్ధలైనట్టు, దానికొక గందరగోళం పెట్టి, అదే ప్రపంచమన్నట్టు చిల్లర రాజకీయ కథ చేసి నీళ్లే ఇవ్వలేదు. నీళ్లను వదిలిపెట్టండి మీరు. సమ్మక్క బరాజ్‌కు ఏమైంది? దేవాదుల నీళ్లు ఎందుకు పంప్ చేస్తలేరు? స్టేషన్‌ఘన్‌పూర్, ఆలేరు, జనగామలో పొలాలను ఎందుకు ఎండబెడుతున్నారు?
100 రోజుల్లో 200 మంది రైతుల ఆత్మహత్య
చాలా బరువైన గుండెతోని మాట్లాడుతున్న. బాధ కలుగుతున్నది. 110 రోజుల్లోనే మళ్లా ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తమని కలలో కూడా అనుకోలె. రైతులు ఇంత ఏడ్చేంత పరిస్థితికి పోతదని అనుకోలె. మాకున్న సమాచారాన్ని బట్టి 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు. కొందరు కరెంటు షాకులతోని, కొందరు ఆత్మహత్యలు చేసుకుని దాదాపు 200 మంది రైతులు ప్రాణాలు విడిచారు. రైతులు మళ్లా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తదని నేను కలలో కూడా అనుకోలె. ఎందుకంటే మేం చాలా పనులు చేసిపెట్టినం. పటిష్టంగా చేసి పెట్టినం.
మరెందుకు ఆత్మహత్యలు సంభవిస్తున్నట్టు? లక్షల ఎకరాల పంటలు ఎందుకు ఎండిపోతున్నట్టు? జర్నలిస్టులు కూడా ఆలోచన చేయాలె. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినయ్? మీరు కూడా పరిశీలన చేసి రాయండి. రాష్ట్రం మేలును కాక్షించి రాయండి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయ్. పెద్ద ఇష్యూ కాదు. గెలిచేటోళ్లు గెలుస్తరు. ఓడేవాళ్లు ఓడుతరు. అది సాధారణ విషయం. ఈ సామాజిక పరిస్థితి. ధాన్యంలో దేశంలోనే తొలి స్థానానికి చేరుకున్న రాష్ట్రం అనతి కాలంలో ఎందుకు బాధలకు గురికావాలె? కారణమేంది?
పంటలు ఎందుకు ఎండుతున్నయి?
నాకు తెలిసిన సమాచారం మేరకు రాష్ట్రం లో 15 లక్షల పైచిలుకు ఎకరాల్లో పంటలు ఎండుతున్నయి. కనీసం సమీక్ష నిర్వహించారా? పంటలు ఎండని జిల్లానే లేదు. ఒక్క నల్లగొండ జిల్లాలోనే సాగర్ ఆయకట్టు సహా మిగిలినవి కలుపుకుంటే మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతున్నది.ప్రతి ఊళ్లో రెండు, మూడు వందల ఎకరాల పంటలు ఎండుతున్నయి. సూర్యాపేటలో 20-24వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నయ్. ఇవాళ కూడా ఎండీడీఎల్ (మినిమమ్ డ్రా డౌన్ లెవెల్) ఎబో లెవెల్ సాగర్‌లో ఏడు టీఎంసీల నీళ్లున్నాయి. ఎన్డీడీఎల్ కింద కూడా మరో ఏడెనిమిది టీఎంసీల నీళ్లు ఉన్నాయి. సాగర్‌లో ఇప్పుడు కూడా 14-15 టీఎంసీల నీటిని వాడుకునే పరిస్థితి ఉన్నది.
ఆనాడు కూడా కేఆర్ఎంబీ ఉండే. కేఆర్ఎంబీ అంటే రెండు రాష్ర్టాల మధ్య నీటి పంపిణీకి సమన్వయకర్త మాత్రమే. వాడేమి మనకు బాస్ కాదు. కేంద్రమంత్రి తియ్యగ పుల్లగ మాట్లాడితే మొత్తం ప్రాజెక్టును తెలివితక్కువగా వాడికి అప్పజెప్పి ఇవాళ నాగార్జునసాగర్ కట్టమీదికి ఎక్కలేని దుస్థితి తీసుకొని వచ్చిన అసమర్థ ప్రభుత్వం ఇది. మమ్మల్ని కూడా కేఆర్ఎంబీ నిరోధించేది. మేము దటాయించేది వాళ్లను. పోయిన 2-3 సంవత్సరాల్లో ఆంధ్రా మాకన్న ఎక్కువ తీసుకున్నది మాకు క్యారీఫార్వడ్ చేయాలని అడిగినం. వాడు ఆపినా తూములు లేపి రెండు మూడు తడులు ఇచ్చినం. నాగార్జునసాగర్ కింద ఒక్క ఇత్తనం కూడా ఎండనీయకుండా పద్దెనిమిది పంటలు పండించినం. ఇవాళ సాగర్ కింద ఎందుకు లక్షల ఎకరాలు ఎండిపోయింది?
మిషన్ భగీరథ ఏమైంది? ఖాళీ బిందెలకు కారకులెవరు?
మిషన్ భగీరథ పథకాన్ని ఐక్యరాజ్యసమితితో పాటు దేశంలోని పదిహేను, పదహారు రాష్ర్టాలు మెచ్చుకున్నయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి మంచి నీళ్లు ఇచ్చినం. కానీ ఇప్పుడు నీళ్లు రావడం లేదు. మిషన్ భగీరథ పథకంలో లోపం ఏముంది? మేము ఐదారేళ్లు అద్భుతంగా నడిపాం. ఆనాడు హైదరాబాద్‌లో కానీ, బయట గ్రామాల్లో కానీ ఒక్క బిందె బయటకనపడిందా? ఒక్క ట్యాంకర్ అయినా కనపడిందా? ఇవాళ ట్యాంకర్లు కొనుక్కునే దుస్థితి ఎందుకొచ్చింది? బిందెలతో నీళ్లు తెచ్చుకునే పరిస్థితికి కారకులెవరు? ఆ అసమర్థులు ప్రభుత్వం, సీఎం, మంత్రులు కాదా? కనీసం పట్టింపన్నా ఉన్నదా వీళ్లకు? సమీక్ష నిర్వహించారా? మిషన్ భగీరథను పట్టించుకునే నాథుడు లేడు.
మిషన్ భగీరథ సరిగ్గా నడవాలంటే నిరంతర విద్యుత్తు సరఫరా ఉండాలి. నేను ఇంజినీర్లను అడిగితే.. సార్ ఇందులో అసలు కిటుకు వేరే ఉన్నదని చెప్పారు. మా ప్రభుత్వంలో ప్రత్యేకంగా స్మితాసబర్వాల్ ఉండేవారు. ప్రతిరోజూ దీనిపై పర్యవేక్షణ ఉండేది. చిన్న పైప్ ముక్క పోయినా తెల్లారేసరికి వేసేవాళ్లు. ఇవాళ 15 రోజులైనా పట్టించుకునేవాళ్లు లేరు. అజమాయిషీ కొరవడిందని ఇంజినీర్లు చెప్తా ఉన్నారు. ఎందుకు మంచినీళ్ల కొరత రావాలె? చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్లనేమో నీటి సోర్సెస్ అన్నీ బరాబరే ఉన్నయని, ఎవరూ భయపడే అవసరం లేదని చెప్తున్నరు.
అసలు హైదరాబాద్ సిటీలో ఒక రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి, 20 వేల లీటర్ల ఫ్రీ వాటర్ ఇస్తే దానిలో లోపమెందుకు వస్తది? మేం అసెంబ్లీలో చాలెంజ్ చేసినం. ఈ టర్మ్‌లోగా భగీరథ కంప్లీట్ చేయకపోతే మా పార్టీ కూడా పోటీ చేయదని చెప్పి కంప్లీట్ చేసినం. ఆ తర్వాత ఐదేండ్లు బ్రహ్మండంగా పథకాన్ని నడిపినం. బిందె పట్టుకుని ఎక్కడా ఆడబిడ్డ కనబడలె. పబ్లిక్ స్టాండ్ పోల్స్ మాయమైపోయినయ్. ఏ పల్లె, పట్టణంలోనూ ట్యాంకర్లు కనిపించలె. మరెందుకు ఇప్పుడు బిందెలు ప్రత్యక్షమవుతున్నయ్? ఎందుకు నీళ్ల మోతలు స్టార్ట్ అవుతున్నయ్? నీళ్ల ట్యాంకర్లు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నయ్?
మళ్లీ బోర్ల హోరు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు
పట్టుగొమ్మల్లాగున్న పల్లెసీమల్లో ఇవాళ బోరుబండ్ల హోరు వినిపిస్తున్నది. గత ఎనిమిదేళ్లుగా బోరుబండి కనపడలే. జనరేటర్లు అమ్ముకునే దుకాణాలు తెలంగాణ నుంచి పారిపోయినయ్. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబ్లైజర్ల దుకాణాలు దివాలా తీసినయ్. కరెంటు మోటర్ల వైండింగ్ లేకుండే. ఇప్పుడు మళ్లా మొదలైంది. ఈ దుస్థితి ఎందుకొస్తున్నది ఈ ప్రభుత్వ తెలివితక్కువతనం వల్ల లక్షల మోటర్లు కాలిపోతున్నయ్. ఒక్కో రైతు మోటర్లు రెండు, మూడు సార్లు కాలిపోతున్నయ్.
పంట పండుతుందేమోనని కొత్తగా బోర్లు వేయటం, వాగుల్లో, వరద కాలువల్లో చెలిమలు,క్రేన్లతో పూడికలు తీయటం వంటివి చేస్తున్నరు. గతంలో మాయమైనవన్నీ వంద రోజుల్లోనే ప్రత్యక్షమయ్యాయి. జర్ర కేసీఆర్ గలమ దాటంగనే కటకేసినట్టే బంద్ అయితయా? నేను ఈ విషయం జోక్‌గా చెప్పడం లేదు. ఇది ప్రజలు, సమాజ విషయం. జూన్ చివరికి ఊటలు వస్తాయి. ఇంకా మూడు నెలలు గడవాలి. భగవంతుడు కరుణించి మంచి వర్షాలు కురుస్తే ఏ జూలైకో మంచి ఊటలు వస్తాయి. ఇంకా మూడున్నర నెలలు పరిస్థితి ఎంత భయకరంగా ఉంటుందో!
వంద రోజుల్లోనే నాశనమైతదని అనుకోలె
నా కండ్లముందే వందరోజుల్లోనే ఇంత నాశనమైతదని అనుకోలె. నా కండ్ల ముందే బిందెలతో ఆడబిడ్డలు రోడ్లపై తిరుగుతరని, ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు వస్తాయని అనుకోలె. నిజంగా కొన్ని సందర్భాలు చూస్తుంటే కండ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఏ కారణం లేకుండానే నీళ్ల షార్టేజీ ఏర్పడింది. నీటి అవసరాల దృష్ట్యా ఎల్లంపల్లి నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం లేదని పాత అక్కంపల్లిపైనే ఆధారపడకుండా రూ.1,450 కోట్లతో సుంకిశాల ప్రాజెక్టును మంజూరు చేసినం. అదికూడా దగ్గర పడింది. 70-75 శాతం పనులు అయిపోయినయ్. మొన్న నేను కాంట్రాక్టర్‌ని అడిగితే ప్రభుత్వం చెప్తే 2, 3 నెలల్లో పూర్తిచేసి ఇస్తామన్నరు. అది పూర్తయితే నీటి సరఫరాకి ఢోకా ఉండదు.
సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం వాడుకునే పరిస్థితి ఉంటది. ఎనిమిదేండ్లు నిరంతరంగా ఇచ్చిన కరెంట్ ఏక్దమ్ ఎట్ల మాయమైతది? ఎవరు సమర్థులు? ఎవరు అసమర్థులనేది ప్రజలే తేల్చుతరు. పదేండ్ల పాటు రైతులను కడుపులో పెట్టుకొని సాదుకున్నం. రైతుబంధు ఇచ్చి, రైతుబీమా ఇచ్చి, పంటలు కొనుగోలు చేసి, అనేక సదుపాయాలు కల్పించి, అకాల వర్షాలొస్తే రూ.10 వేల నష్టపరిహారం అందించి ఆదుకున్నాం. అన్ని రకాలుగా కాపాడుకున్న రైతులను మా కండ్ల ముందే నాశనం చేస్తుంటే బరువెక్కిన గుండెతో మాట్లాడుతున్నా. రైతులకు ఎదురవుతున్న ఈ పరిస్థితి మీకు (కాంగ్రెస్ ప్రభుత్వానికి) మంచిది కాదు.
అనుక్షణం అభివృద్ధి కోసమే ఆలోచించినం
కాంగ్రెసోళ్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కానీ మేం అలా చేయలేదు. మేం అహో రాత్రులు రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు, నీళ్లు, కరెంట్, మెడికల్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, గురుకులాలు ఇలా వీటిపై మా మైండ్ కరగబెట్టినం. ఆ ఫలితాలు చూపించినం. అవన్నీ ప్రజల కండ్ల ముందున్నాయి. మేము గాలి మాటలు చెప్పడం లేదు. పదేండ్లు మా హృదయాన్ని, మా మెదడును, సమయాన్ని ఖర్చుపెట్టి అభివృద్ధి పనులన్నీ చేసినం. రాత్రింబవళ్లు కష్టపడ్డాం. నీళ్లు తెచ్చినం, కరెంట్ తెచ్చినం, మంచినీళ్లు తెచ్చినం, గురుకులాలు తెచ్చినం, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినం, ఉన్నోన్ని లేనోన్ని అందర్నీ కడుపులో పెట్టుకొని కంటికి రెప్పోలే చూసుకున్నాం. ఇప్పుడు మీరు(కాంగ్రెస్ సర్కారు) మోసం చేస్తామంటే ఊరుకోం.
కుక్కలు, నక్కల్ని గుంజుకుపోయి సంకలు గుద్దుకుంటున్నరు
39 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు ఒక్కర్నో, ఇద్దర్నో కుక్కల్నో.. నక్కల్నో గుంజుకొనిపోయి.. ఆహా, ఓహో అంటూ సంకలు గుద్దుకోవచ్చు. ఇదొక చీప్ పొలిటికల్ స్టంట్. దీన్ని మేం లెక్కే చేయం. ప్రజల బాధలు, ఎండిన పంట పొలాల ముందు చిల్లర రాజకీయాలు సరైనవి కాదు.ఇవి ఇష్యూనే కాదు. చిల్లర కాయకొరుకుడు మాటలు.. పూటకొక్క పీఆర్ స్టంటు పెట్టి, లంగా ముచ్చట్లు ప్రచారం చేసుడు. రాజకీయాలు మేము కూడా మస్తుగ చేసినం. చాలామందిని పాతరబెట్టినం. చాలామందిని ఎత్తినం. మేము కూడా గద్దెలు ఎక్కినం. పదేండ్లు పరిపాలన చేసినం. అదంత పెద్ద గొప్ప విషయం కాదు. అధికారం వస్తా ఉంటది, పోతా ఉంటది. నథింగ్ గ్రేట్ ఎబౌట్ ఇట్. కానీ ప్రజలు ఎక్కడికి పోవాలి? ప్రజలు, రైతులు, గ్రామాలు ముఖ్యం కదా.
దమ్ముంటే సింగూరు నుంచి నీళ్లివ్వు
రైతులంటే కాంగ్రెస్‌కు పట్టింపే లేదు. వాళ్లు అరిగోస పడుతున్నా రైతుబంధు ఇవ్వనే లేదు. రైతుబంధు వస్తదా? రాదా? అనే భయంకరమైన పరిస్థితిని తెచ్చారు. సాగునీరు ఇవ్వటంలో విఫలమయ్యారు. తాగునీరు ఇవ్వడంలోనూ ఘోరంగా విఫలమవుతున్నారు. ఏం కారణం? ఇకనైనా మేల్కోండి. మేము ఒక్కటంటే ఒక్క మోటరు కాలనివ్వలేదే. ఒక్క ఎకరం ఎక్కడైనా ఎండనివ్వలేదే. నాడు ఎస్పారెస్పీలో నీళ్లు తక్కువైతే నిజాంసాగర్‌లో కూడా అంతంత మాత్రంగానే ఉంటే.. 20 టీఎంసీలు దేవుని దయ వల్ల సింగూరు ప్రాజెక్టులో ఉంటే.. సింగూరు టు నిజాంసాగర్ తెచ్చి, అక్కడ్నుంచి ఎస్పారెస్పీకి తెచ్చి, ఆ నీటిని ఎస్పారెస్పీ ఆయకట్టుకు ఇచ్చాం. మొన్నటిదాకా సింగూరులో 20 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. నేను మీతో మాట్లాడుతున్న ఈ సమయానికి అందులో 17 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఉన్నప్పుడు రైతులకు ఇవ్వడానికి మీకేం బీమారొచ్చింది నాకర్థం కాదు? 2-3 టీఎంసీల గ్యాప్ నింపితే సరిపోయేది.
వర్షం ఎక్కువ పడినా పడలేదంటున్నరు
ఎవరి అసమర్థత వల్ల ఎల్లంపల్లి డెడ్‌స్టోరేజీ అయ్యింది. సాధారణ వర్షపాతం కన్నా 6 శాతం వర్షం అధికంగా పడ్డది. ఇది నేను చెప్పేది కాదు. భారత వాతావరణ శాఖ చెప్పిన లెక్క. కాంగ్రెస్‌వాళ్లు చెప్పేది శుద్ధ తప్పు. నాగార్జునసాగర్‌లో డెడ్స్టోరీ కంటే అధికంగా జలాలున్నాయి. అయినా హైదరాబాద్‌కు నీటి కొరత ఎందుకొస్తుంది? ఇక్కడ పంటలు ఎండగొట్టిండ్రు. హైదరాబాద్‌కు కూడా నీటి కొరత. మేం 20 వేల లీటర్లు ఫ్రీ ఇచ్చిందానికి ఇవ్వాల సిగ్గులేకుండా బిల్లులు పంపిస్తున్నరు. ఈ రకమైన దరిద్రపుగొట్టు వ్యవహరం చేసింది కాంగ్రెస్సే. ఎస్ఎల్బీసీ కాకుండా చేశారు. ఎస్ఎల్బీసీ కాంగ్రెస్ ప్రభుత్వ పాపం కాదా? రాష్ట్రం రాకముందు పదేండ్లు అధికారంలో ఉన్నది వాళ్లే కదా!
రైతుల తరఫున పోరాటం చేస్తాం
మేం రాజకీయాలు చేయటానికి రాలేదు. రైతుల కోసం వచ్చినం. మేం ప్రజల తరపున అడుగుతున్నం. రైతాంగం పక్షాన అడిగినం. చేస్తరా.. చెయ్యరా చూస్తం. ఎక్కడికక్కడ ప్రజా ఉద్యమాలు లేవదీస్తాం. రాష్ర్టాన్ని రణరంగం చేస్తాం. ఊరుకోం. నిద్రపోం. ఊరుకునే ప్రసక్తే లేదు. రైతులు, ప్రజల పక్షాన పోరాడుతాం.
పోలీసులకు విజ్ఞప్తి.. అతి చేయొద్దు
వాగ్దానాలు ఎగబెడదామనుకుంటున్నారా? పండనివ్వం బిడ్డా జాగ్రత్త. పరిగెత్తిస్తాం. ఇది ప్రజాస్వామ్యం. నలుగురు కార్యకర్తలపై కేసులు పెడితే అయిపోతదా? ‘సార్ మీరు వస్తే మీకు మా సమస్యలు చెప్పొద్దని కాంగ్రెసోళ్లు బెదిరిస్తున్నరు’ అని తుంగతుర్తి నాయకులు చెప్పారు. వాళ్లకు కలిగిన బాధ కూడా చెప్పుకోవద్దట. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని పోలీసులు కూడా బెదిరిస్తున్నారు. నేను పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలకు బాధలుంటయి. ప్రజాస్వామ్యంలో మీరు అనవసరంగా అతిగా పోవద్దు. అధికారంలో ఎవరూ శాశ్వతం కాదు. మేం కూడా 10 ఏండ్లు అధికారంలో ఉన్నాం. ఆ పదేండ్లలో మేం ఇలాంటి పనులు చేస్తే నశానికి కూడా కాంగ్రెస్ ఉండకపోతుండే. ఒక్కడు కూడా మిగలకపోతుండే. కానీ మేం అలా దురుసు ప్రవర్తన చేయలేదు అని కేసీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది
ఇది వచ్చిన కరువు కానే కాదు.. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. ఇవ్వాల ఈ పంటలన్నీ ఎండటానికి కారణం కాంగ్రెస్సే. కరెంటు లోవోల్టేజీలో సప్లయ్ చేయడానికి కారణం మీరు. మీకంటే ముందు 8 ఏండ్లు నాణ్యమైన కరెంటు అద్భుతంగా ఇచ్చినం. అట్లాంటిది మీరు ఇవ్వలేకపోతున్నారంటే మీరు అసమర్థులే కదా. మీరు చేతగాని వాళ్లే కదా. దీన్ని అర్థం చేసుకోవడానికి సంస్కృతమా? రాకెట్ సైన్సా?
తెలంగాణ వచ్చినంకనే ఇక్కడికి నీళ్లు వచ్చినయ్
తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సూర్యాపేట, తుంగతుర్తిలో తిరుగుకుంటూ.. ఇదే సమైక్య రాష్ట్రం ఉంటే ఈ కాల్వల్లో మన మునిమనవళ్లు కూడా నీళ్లు చూడరు. తెలంగాణ వస్తేనే నీళ్లు వస్తయని చెప్పిన. తెలంగాణ వచ్చాక ఎంతో శ్రద్ధపెట్టి కష్టపడ్డాం. కాళేశ్వరం కట్టి, ఎస్సారెస్పీని పైకి సరిపెట్టి ఎంత నీళ్లు తెచ్చినమో సూర్యాపేటవాసులు కండ్లారా చూసిర్రు. అంతే అద్భుతంగా నీళ్లు వచ్చినయ్, పంటలు పండినయ్. చాలాచోట్ల జాలు కారుతున్నయ్ సార్ అని చెప్పిర్రు. ఆ జాలు కారిన పొలాల్లోని జాలను మాయం చేసిన దొంగ ఎవడు? అంతటి అసమర్థుడు ఎవడు? జవాబు చెప్పేవాడు ఎవడు? ఇవన్నీ ఏమీ లేవు.. చిల్లర పొల్లర మాటలు, పాడిందే పాటరా పాసిపండ్ల దాసరి అన్నట్టు పబ్బం గడుపుతున్నరు.
రైతులు భయంతో ఉన్నారు
కరీంనగర్ జిల్లా వాళ్లు కూడా నన్ను రమ్మని పెద్ద గొడవ చేస్తున్నారు. ‘రైతులకు జరుగుతున్న నష్టంపై పెద్ద ఉద్యమం చేద్దాం సార్.. ఈ ప్రభుత్వాన్ని నిద్ర పోనివ్వం. వాళ్ల సంగతో, మా సంగతో తేలాలి. వీళ్లు అడుగుపెట్టుడు పెట్టుడే అడుగు నుంచి నాశనం చేస్తున్నరంటే వీళ్లు ఇంకేమిస్తరు’ అని భయంతో ఉన్నారు. వాళ్లకు భరోసా ఇవ్వాలని, వాళ్ల పక్షాన నిలవాలని నిర్ణయం తీసుకున్నాం.
రైతులకు ఉరేసేందుకే పవర్ సేవింగా?
పవర్ సేవ్ చేస్తమని చెబుతుండ్రు.. ఎవరికోసం సేవ్ చేస్తున్నారు? రైతులను ఉరితీయడానికా? కరెంటు మీద పిచ్చోడు ఒకడు మాట్లాడితే, రైతుల కోసం రూ.20 వేల కోట్లు కాదు.. అవసరమైతే రూ.30 వేల కోట్లు కూడా ఖర్చుపెడతామని నేనే అసెంబ్లీలో చెప్పిన. కరెంటు ఇచ్చేదే రైతుల గురించి కదా. బరువుగా పంటలు పండితే నాలుగేండ్లలో అప్పులన్నీ తీరిపోతయని, వారి ఆర్థిక స్థితి బాగుపడతదని చెప్పా. పెట్టే పెట్టుబడులు ఎవరికోసం పెడతాం? ప్రజల అభివృద్ధి కోసం కాదా? పెట్టుబడంటే పారిశ్రామికవేత్తలే కాదు కదా? గ్రామసీమల్లో రైతులు మంచిగైతరనుకుంటే పెట్టుబడి పెడతాం కదా. అలా చేస్తే స్టేట్ ఎకానమీ బలపడతది. అట్లనే మేము జీఎస్డీపీ పెంచాం. 4.5 లక్షల కోట్లు ఉన్న జీఎస్డీపీని 14.5 లక్షల కోట్లకు తీసుకెళ్లాం.
మోదీ ప్రభుత్వ సహాయ నిరాకరణలో జీఎస్డీపీని బ్రహ్మాండంగా పెంచాం. పారిశ్రామికాన్ని, ఐటీని పెంచాం. ఇవన్నీ ఝూఠా మాటలు కావు కదా. జెనీవాలోని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్వో) మొన్నటి నివేదికలో బీఆర్ఎస్ అభివృద్ధి గురించి చెప్పింది. 2019 నుంచి 2021 వరకు భారత్‌లో తెలంగాణ బ్రహ్మాండమైన ప్రగతి సాధించిందని, 17 లక్షల మందికి పరిశ్రమలల్లో ఉద్యోగాలు కల్పించిందని ప్రకటించింది. వాళ్లు పైరవీలు చేసినా, దండం పెట్టినా ప్రకటించరు. నిజంగా అభివృద్ధి జరిగితేనే ప్రకటిస్తారు. పారిశ్రామికంగా, ఐటీలోనూ అభివృద్ధి చేశాం. పర్‌క్యాపిటా పెంచాం, జీఎస్డీపీ పెంచాం. బడ్జెట్ పెంచాం.. రాష్ట్ర రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాం.
ఆత్మహత్యలు వద్దు..
రైతుబంధు వేయలేదు. దీంతో రైతులు ప్రైవేటు అప్పులు తెచ్చుకుని కొంత నాశనం అయ్యారు. బ్యాంకువాళ్లు మళ్లీ రుణం ఇచ్చే పరిస్థితి లేదు. పంట వేసుకోవాలంటే రైతుల గతి ఏం కావాలి? వీటిపై ప్రభుత్వానికి కనీసం ఆలోచనైనా ఉన్నదా? రైతుల పక్షాన ఎవరున్నారు.. ఎవడు మాట్లాడుతరని ప్రభుత్వం అనుకుంటుందేమో! రైతుల పక్షాన బీఆర్ఎస్ ఉన్నది. రైతుల పక్షాన పోరాటం చేస్తుంది. రైతులకు దండంపెట్టి చెప్తున్నా ఆత్మహత్యలు చేసుకోకండి. మీ కేసీఆర్, మీ బీఆర్ఎస్ మీ పక్షాన రణరంగమైనా సృష్టిస్తది. ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఆ బాధ్యత మాకు ఇచ్చారు.
మేం నిద్రపోం. ఈ ప్రభుత్వానికి రెండు, మూడు నెలల టైం ఇవ్వాలని అనుకున్నాం. లేదంటే మాది పుండాకూరు వ్యవహారం అవుతది. ఓర్వలేనితనంతో వాళ్లు అధికారంలోకి రాగానే వీళ్లు దుకాణం మొదలుపెట్టారని అంటరు కాబట్టి 4 నెలల వరకు నేను నాలుక కూడా తెర్వలేదు. కేఆర్ఎంబీకి సంబంధించి ఒకటో రెండో మీటింగులు పెట్టిన తప్ప నాలుక కూడా తెర్వలేదు. ఇష్టమొచ్చినట్టు దురుసుగా, మోటుగా, చరిత్రలో ఏ సీఎం మాట్లాడనంత మొరటుగా, హీనాతిహీనంగా మాట్లాడినా, నిందించినా నోరు తెర్వలేదు. ఈ రోజు రైతుల లక్షల ఎకరాల పంట ఎండిపోతుంటే చూస్తూ ఊరుకోలేక నేనే స్వయంగా చూద్దామని వచ్చిన.