KCR | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలంటూ బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సాక్షిగా, లక్షలాది ప్రజల సమక్షంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కేంద్రాన్ని చేసిన డిమాండ్ రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు సృష్టించింది. ‘ఆపరేషన్ కగార్’ పేరిట మావోయిస్టులతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని అమాయక ఆదివాసీలను భ ద్రతా బలగాలు కాల్చిచంపుతున్నాయనే ఆరోపణలు ఉన్నా, దేశవ్యాప్తంగా ఇతర పార్టీలేవీ బహిరంగంగా స్పందించడం లేదు. దీనిపై వామపక్ష పార్టీల నేతలు, పౌరహక్కుల నేతలు స్పందిస్తున్నప్పటికీ, గట్టిగా మాట్లాడితే ‘అర్బన్ నక్సలైట్లు’ ముద్ర వేస్తారనే భయం మేధావుల్లో సైతం లేకపోలేదు. ‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయాలని, ప్రభుత్వంతో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించినప్పటికీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు.
మావోయిస్టులను మట్టుబెట్టే కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేసింది. కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్ దీనికి నిరద్శనం. ఈ నేపథ్యంలో కేసీఆర్ అత్యంత సాహసోపేతంగా ‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయాలంటూనే మావోయిస్టులతో చర్చలు జరపాలనే డిమాండ్‌ను గట్టిగా వినిపించడం ద్వారా ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రదర్శించారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కేసీఆర్ స్ఫూర్తితో ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయాలపై మరింత బిగ్గరగా మాట్లాడేందుకు, ‘ఆపరేషన్ కగార్’కు వ్యతిరేకంగా గట్టిగా నినదించేందుకు చాలామంది ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ రజతోత్సవ సభలో మాట్లాడుతూ.. ‘కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్‌గఢ్‌లో ఊచకోత కోస్తున్నది. అది ధర్మం కాదు. నక్సలైట్లు చర్చలకు సిద్ధమంటున్నరు. బలం ఉందని చంపుకుంటూ పోవడం ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్‌ను ఆపేయండి. నక్సలైట్లను పిలిచి చర్చలు జరపండి’ అంటూ కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం ద్వారా ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రదర్శించారని పలువురు కొనియాడుతున్నారు. కేసీఆర్ దేశ రాజకీయాలను మలుపు తిప్పారని, ఉద్యమకాలంలో చూపిన ప్రజాస్వామిక స్ఫూర్తినే మరోసారి చాటిచెప్పారనే భావన నెలకొన్నది. కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నట్టు పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు ఒక ప్రకటన చేశారు.
ఆదినుంచీ కేసీఆర్‌ది అదే పంథా..
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ అనేక సందర్భాల్లో మావోయిస్టు పార్టీతో శాంతిచర్చలు జరపాలని నినదించారు. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో కాం గ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు హ యాంలో దండకారణ్యం నెత్తురోడింది. సల్వాజుడుం, ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరిట మారణహోమాన్ని కొనసాగించింది. ఆదివాసీలతోపాటు తెలంగాణ బిడ్డలు ఎందరో నేలకొరిగారు. ప్రతి సందర్భంలోనూ, కాంగ్రెస్ చర్యలను కేసీఆర్ ఖండించడమే కాకుండా, తెలంగాణ ఏర్పాటు తరువాత ఒక్క ఎన్కౌంటర్ కూడా ఉండబోదని స్పష్టంచేశారు. మలి దశ ఉద్యమంలో అనేక సందర్భాల్లో కూడా తెలంగాణ ఏర్పాటు తరువాత అన్నల అజెండాను అమలు చేస్తామని బాహాటంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక అమలుచేసి చూపారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం
మావోయిస్టులతో చర్చలు జరపాలంటూ కేంద్రాన్ని కేసీఆర్ చేసిన డిమాండ్.. ఇటు తెలంగాణ ప్రభుత్వం మీద కూడా తీవ్ర ప్రభావమే చూపినట్టు కనిపిస్తున్నది. ఒకవైపు రజతోత్సవ సభ సాక్షిగా శాంతిచర్చల డిమాండ్‌ను కేసీఆర్ ఎజెండా మీదకు తీసుకొని రావడం, పౌరహక్కుల నేతలు తనను కలిసి మావోయిస్టులతో కేంద్రంతో చర్చలు జరిపేందుకు ముఖ్యమంత్రిగా చొరవచూపాలని కోరిన నేపథ్యంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి జానారెడ్డితో సమావేశమయ్యారు. గతంలో వైఎస్ ప్రభుత్వ హయాంలో పీపుల్స్‌వార్ ప్రతినిధులతో చర్చ లు జరిపిన అనుభవం ఉన్నందున అధిష్ఠానంతో సంప్రదింపులు జరపాలని జానారెడ్డిని కోరడం కేసీఆర్ ప్రకటన ఏ స్థాయిలో ప్రభా వం చూపిస్తున్నదో స్పష్టం చేస్తున్నది.
కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నాం ; పౌరహక్కుల సంఘం హర్షం
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయాలంటూ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ డిమాండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు పౌరహకుల సంఘం తెలిపింది. మావోయిస్టులతో చర్చలు జరపాలంటూ కేంద్రానికి లేఖ రాస్తానని ప్రకటించడంపై పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు సోమవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆపరేషన్ కగార్ అంశంలో బలమైన పోరాటాలు కొనసాగించాలని, హత్యాకాండకు ముగింపు పలికేలా చొరవ తీసుకోవాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు పార్టీ నెల క్రితమే చర్చల ప్రక్రియకు సంసిద్ధతను బహిరంగంగా ప్రకటించిన విషయాన్ని కేసీఆర్ దృష్టిలో ఉంచుకొని కేంద్రాన్ని ఒప్పించే దిశగా అడుగులు వేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే సబ్బండవర్ణాలు కదిలి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామో, మధ్యభారతంలో కొనసాగుతున్న ఆదివాసీల హననాన్ని నిలువరించడానికి తెలంగాణ ప్రజలు ముందుకు రావాలని కోరారు. బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతాల్లోని ఆదివాసీలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని,వారిని వెంటనే విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, కార్యదర్శి నారాయణరావు డిమాండ్ చేశారు.
కర్రెగుట్టలపై దాడులు ఆపాలి
అటవీ సంపదను దోచుకునేందుకు చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను తక్షణమే రద్దు చేయాలని ఆదివాసీ, దళిత, గిరిజన, ప్రజాసంఘాల సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కర్రెగుట్టలపై వారంరోజులుగా చేస్తున్న బలగాల దాడులు ఆపాలని డిమాండ్ చేశారు.