హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు (KCR) మరో ఉద్యమానికి పిడికిలెత్తారు. రైతుకు బాసటగా నిలిచేందుకు బయల్దేరారు. అన్నదాతకు అండగా నిలిచేందుకు పొలంబాట పట్టారు. ఇందులో భాగంగా నేడు జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు. ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు.. పొలాల వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అన్నదాతకు ధైర్యాన్నిచ్చి భరోసా కల్పించనున్నారు.
ఇందులో భాగంగా జనగామ జిల్లా పర్యటనకు బయల్దేరారు. ఎర్రవల్లి వ్యవక్షేత్రం నుంచి రోడ్డు మార్గాన దేవరుప్పల మండలం ధరావత్‌తండాకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పొలాలను పరిశీలించి, రైతుల సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోకి ప్రవేశిస్తారు. తుంగతుర్తితో పాటు అర్వపల్లి, సూర్యాపేట మండలంలో ఎండిన పంటలను పరిశీలించి, మధ్యాహ్నం ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి, 3 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 3.30 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం 4.30 గంటలకు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరుకు చేరుకుంటారు. అక్కడ పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతారు. సాయంత్రం ఆరు గంటలకు బయల్దేరి నల్లగొండ మీదుగా రాత్రి 9 గంటలకు ఎర్రవల్లి చేరుకుంటారు.