దేశ రాజకీయ ప్రాగ్ దిగంతాన కొత్త సూర్యుడు ఉదయించబోతున్నడా?
కల్లోల జాతి కెరటాల మీది నుంచి మరో అరుణోదయం దూసుకు రానున్నదా?
వింధ్య పర్వత శ్రేణులను దాటుకుని కొత్త వాణి ప్రతిధ్వనించనున్నదా? వజ్రోత్సవ భారతి మరో ప్రజాస్వామ్య ప్రాభవాన్ని ప్రభవించనున్నదా?
దేశం ఒక కొత్త నాయకుడి కోసం ఎదురుచూస్తున్నదా?
గద్దెనెక్కాల్సింది ప్రజలు.. పార్టీలు కాదు
దేశానికి ఇప్పుడు కావాల్సింది ఒక పార్టీ గద్దె దిగటం.. ఒక పార్టీ గద్దెనెక్కడం కాదు. ప్రజలు గద్దెనెక్కాలి. వారి జీవితాలు మారాలి. అందుకు దేశం ఒక సామూహిక లక్ష్యాన్ని నిర్దేశించుకొని.. క్రమశిక్షణతో, నియంత్రిత విధానంతో పురోగమించాలి. దేశాన్ని సరైన ప్రగతి పంథాలో నడిపించడానికి హైదరాబాద్ వేదికగా మారితే.. అది మన రాష్ర్టానికి గర్వకారణం.
చట్టం చట్టుబండలైంది.. ఉన్మాద మూకలదే రాజ్యమైంది. పాలన పేరుతో ప్రత్యర్థులను వెంటాడుతున్నరు..
సంస్కరణ సాకుతో షావుకార్లను పోషిస్తున్నరు. వీధుల్లో కేంద్ర మంత్రుల వీరంగం.. రాజ్ భవన్లలో గవర్నర్ల తారంగం. పండించే రైతు కోసం కాదు.. పంచే ప్రధాని బొమ్మ కోసం పంచాయితీ జరుగుతున్నది
75 ఏండ్ల స్వాతంత్య్ర వజ్రోత్సవం.. తాగునీళ్లకు గతిలేని జాతి జనం.. అకలి దప్పుల్లో సమాజం.. అవకాశాలు లేని అంధకారం దేశం పతనమైంది.. ద్వేషమే మతమైంది.. ప్రజాస్వామ్యం పరిహాసం ఆర్థికవేత్తలు అపహాస్యం. ధరలు ఆకాశంలో.. ధైర్యం పాతాళంలో ఏమవుతున్నదీ దేశం? ఎన్నాళ్లీ చీకటి యుగం?
స్వార్థంతో నిండిన రాజకీయాలను శుద్ధిజేయగ పొద్దుపొడుపల్లె వస్తావా స్వాతంత్య్రపోరులో త్యాగ్రహోద్యమం చేపట్టిన గాంధీ మార్గాన వస్తావా స్వరాజ్య కాంక్షతో భగ్గు భగ్గున మండె భగత్సింగు బాట చూపించ వస్తావా సబ్బండ కులపోల్ల ఐక్యంగ నిలిపేటి సర్వాయి పాపన్నవై నువ్వు వస్తావా నలుదిక్కులా నువ్వె పొలికేకలేయంగా నల్లసూర్యుడయ్యి నడిపించ వస్తావా ఎనకడుగు వేయని కొమరంభీమువై ఎక్కుపెట్టిన వీరవిల్లువై వస్తావా ఏటవాలూ కొండ ఎదనిండ బాధుండ ఎరుపెక్కిన ఎర్ర సూర్యుడై వస్తావా
– జయశంకర్ పాటలో…కవి అంబటి వెంకన్న
సీఎంగా ఉంటూనే జాతీయ సమరం
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తారని, ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశ రాజకీయాన్ని నడిపిస్తారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. తాను ప్రాణాలకు తెగించి సాధించిన, తాను ప్రాణం పెట్టి అభివృద్ధి చేసిన తెలంగాణను కాపాడుకుంటూ, తెలంగాణ మాడల్‌ను జాతి జనులకు చూపిస్తూ, తనను గన్న తెలంగాణ తల్లి ఒడిలోంచి, తాను దేవాలయంగా పూజించే తెలంగాణ గర్భగుడిలోంచే కేసీఆర్ జాతీయ ప్రజాస్వామిక రాజకీయ సమరాన్ని సాగిస్తారని అవి స్పష్టంచేశాయి.
(నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణ భూమి పుత్రుడు, రాష్ట్ర సాధకుడు, అభివృద్ధి ప్రదాయకుడు, నాలుగు కోట్ల ప్రజల ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు త్వరలోనే జాతీయ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నరు. కేసీఆర్ నేతృత్వంలో, పోరుగడ్డ తెలంగాణ వేదికగా నూతన జాతీయ రాజకీయ పార్టీ అవతరించబోతున్నది. టీఆర్ఎస్లోని అత్యంత విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అవి తెలియజేసిన సమాచారం ప్రకారం అధికారమే అంతిమంగా చేసే తంత్రాలకు, పదవులే లక్ష్యంగా సాగే పంథాలకు భిన్నంగా, దేశమే జెండాగా, ప్రజలే ఎజెండాగా, జాతి ప్రయోజనాలే దండుగా దేశానికి నూతన రాజకీయ ప్రత్యామ్నాయ పంథాను కేసీఆర్ ప్రతిపాదించబోతున్నరు. అనేక చరిత్రాత్మక పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి అయిన చారిత్రక నగరం హైదరాబాద్ వేదికగానే కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీ ఆవిర్భావం జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశిస్తారని, ముఖ్యమంత్రిగా ఉంటూనే దేశ రాజకీయాన్ని నడిపిస్తారని అవి వెల్లడించాయి. తాను ప్రాణాలకు తెగించి సాధించిన, తాను ప్రాణం పెట్టి అభివృద్ధి చేసిన తెలంగాణను కాపాడుకుంటూ, తెలంగాణ మాడల్‌ను జాతి జనులకు చూపిస్తూ, తనను గన్న తెలంగాణ తల్లి ఒడిలోంచి, తాను దేవాలయంగా పూజించే తెలంగాణ గర్భగుడిలోంచే కేసీఆర్ జాతీయ ప్రజాస్వామిక రాజకీయ సమరాన్ని సాగిస్తారని అవి స్పష్టంచేశాయి. ముఖ్యమంత్రిగా ఉంటూ జాతీయ స్థాయిలో గొంతెత్తినప్పుడే దాని ప్రభావశీలత, వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, అప్పుడే జాతీయ పార్టీని వేగంగా, బలంగా అన్ని ప్రాంతాలకూ విస్తరించగలుగుతామని, అందుకే ఈ వ్యూహాన్ని ఎంచుకున్నామని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుకు కారణాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి అడిగినప్పుడు టీఆర్ఎస్ వర్గాలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించాయి. ఆ వివరాల ప్రకారం..
అగ్గి రాజుకున్నది ఇట్లా
8 ఏండ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కేసీఆర్.. బీజేపీతో, కేంద్ర ప్రభుత్వంతో చాలారోజుల పాటు సత్సంబంధాలను కొనసాగిస్తూ వచ్చారు. కశ్మీర్ వంటి జాతి ప్రయోజనాలకు సంబంధించిన అనేక విషయాల్లో మోదీ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇచ్చారు. అయితే మోదీ ప్రభుత్వం తీరు క్రమంగా మారుతూ వచ్చింది. ఉన్నతస్థాయిలో సత్సంబంధాలను కొనసాగిస్తున్నట్టు నటిస్తూనే, తెలంగాణకు ప్రయోజనం కలిగించే విషయంలో అది నోటితో నవ్వి నొసటితో వెక్కిరించే ధోరణిని ఎంచుకున్నది. ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడం, తెలంగాణ ప్రాజెక్టులకు పైసా సాయం చేయకపోవడం, విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం, ఆర్థిక సంఘం సిఫారసులను బుట్టదాఖలు చేయడం, చివరికి అప్పులు కూడా తెచ్చుకోకుండా ఎఫ్ఆర్బీఎం ఆంక్షలు విధించడం, సంస్కరణల పేరుతో తెలంగాణ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే నిబంధనలు తీసుకురావడం, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా దాష్టీకం చెలాయించడం.. వీటన్నింటితో మోదీ సర్కారు గుంట నక్క వైఖరిని కేసీఆర్ పసిగట్టారు. తాను ప్రాణాలకు తెగించి తెచ్చుకున్న తెలంగాణను తన మార్గంలో తాను అభివృద్ధి చేసుకుంటుంటే దాన్ని కూడా దెబ్బతీయడం ఏమిటని ఆయన ఆలోచించారు. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తెచ్చారు. అయితే మంచిగా ఉన్నట్టు నటిస్తూనే వెన్నుపోటు పొడవటం బీజేపీ నైజమని దేశవ్యాప్తంగా ఇతర మిత్రపక్షాలతో అది వ్యవహరించిన తీరు తెలియజెప్పింది. ఇదే క్రమంలో తెలంగాణలో మత కల్లోలాలు రేపడానికి బీజేపీ నేతలు విద్వేష వ్యాఖ్యలు మొదలుపెట్టారు. దీంతో కేసీఆర్ ఇక రాజీ పడకూడదని నిర్ణయించారు. బీజేపీతో తాడోపేడో తేల్చుకోవడమే మంచిదని భావించారు. దీంతో రెండు పార్టీల మధ్య అగ్గి రాజుకుంది.
ప్రజలు, పార్టీ సంపూర్ణ ఆమోదం
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నదని గ్రహించిన బీజేపీ రాజకీయ నాయకత్వం.. ఆయనను తెలంగాణకే కట్టడి చేయాలనే కుట్రలు మొదలుపెట్టింది. తెలంగాణలో మత కల్లోలాలకు తెరలేపేలా విద్వేష వ్యాఖ్యలు చేయించడం, కేసులు పెడతామని బెదిరించడం, కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా చేసుకోవడం, కేంద్ర మంత్రులందర్నీ తెలంగాణలోనే మోహరించడం, మునుగోడుకు ఉప ఎన్నిక తేవడం ఇందులో భాగమే. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇక బీజేపీని తరిమికొట్టక తప్పదనే నిర్ణయానికి వచ్చారు. అయితే తెలంగాణ ప్రజల బిడ్డ అయిన తాను, వారి ఆశీస్సులతో ఇంత ఎత్తుకు ఎదిగిన తాను, వారి దీవెన లేకుండా ముందుకు సాగడం సరికాదని నిర్ణయించుకున్నారు. అందుకే నాగార్జున సాగర్ సభ మొదలుకుని.. నిన్నటి నిజామాబాద్ సభ దాకా.. జాతీయ రాజకీయాల్లోకి పోవాలా? దేశం కోసం కొట్లాడాలా? అని ప్రతిచోటా ప్రజలను అనేకసార్లు అడిగి మరీ అభిప్రాయం తీసుకున్నారు. తెలంగాణ ప్రజలు ప్రతి చోటా ముక్తకంఠంతో కేసీఆర్‌కు ఆశీస్సులు అందించారు. జాతి కోసం కొట్లాడాల్సిందేనని పిడికిలెత్తి నినదించారు. దీంతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించక తప్పదని కేసీఆర్ ఒక సంకల్పానికి వచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు కేసీఆర్ సిద్దిపేటలో ప్రజల అభిప్రాయాలు తీసుకుని పని మొదలుపెట్టారు. ఇప్పుడు జాతి కోసం కొట్లాడే అంశంపై అనేక సభల్లో ప్రజల నుంచి, ప్లీనరీలో పార్టీ నేతల నుంచి ఇప్పటికే మద్దతు లభించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలకు సంపూర్ణ ఆమోదం లభించినట్టేనని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఫ్రంటులు, టెంటులు ఇప్పుడు కాదు
ప్రత్యామ్నాయ రాజకీయాలకు దేశం తయారుగా ఉన్నదా అన్నదానిపై ఉన్నతస్థాయి రాజకీయ వర్గాల మధ్య విస్తృత చర్చ జరిగింది. ‘ఎదుటి వాడికి ఎదురు లేదని ఎవరైనా అనుకొంటే అది శుద్ధ తప్పు. ప్రకృతి విరుద్ధం’ అని టీఆర్ఎస్ నాయకుడొకరు బీజేపీని ఉద్దేశించి పేర్కొన్నారు. ‘తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు. తెలంగాణ వస్తుందా? ఇది అయ్యే పనేనా? అన్న సందేహాలే ఎక్కువ. కానీ కేసీఆర్ ఒక్కడుగా తెలంగాణ జెండా పట్టుకొని బయల్దేరాడు. ఉద్యమ పార్టీని ప్రారంభించాడు. తన వాదన బలంగా వినిపించాడు. జనాన్ని ఒప్పించాడు. చివరికి దేశంలోని ప్రతి పార్టీతోనూ జై తెలంగాణ అనిపించాడు. పార్లమెంటును మెప్పించాడు. తెలంగాణ తెచ్చాడు. అదీ ఆయన శక్తి. ఎలాంటి పెద్ద పని ప్రారంభించినా అనుమానించే సందేహ పక్షులు ఉండనే ఉంటాయి. కానీ నడిపించేవాడే నాయకుడు. ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించగలిగినప్పుడే లీడర్ అవతరిస్తాడు. సిద్ధాంతాన్ని ఇవ్వగలిగినప్పుడే పార్టీ అవిర్భవిస్తుంది. కేసీఆర్‌కు ఆ శక్తి ఉన్నది. తెలంగాణతో ఆయన దీన్ని రుజువు చేశారు. ఇప్పుడు అదే పంథాలో పయనించి విజయం సాధిస్తారు’ అని కేసీఆర్‌తో సన్నిహితంగా పనిచేస్తున్న రాజకీయ నిపుణుడు ఒకరు విశ్లేషించారు.
‘కొందరు విపక్ష నాయకులు చెప్తున్నట్టు ఫ్రంటులు, టెంటులు కాదు. కేసీఆర్ సారథ్యంలో ప్రత్యామ్నాయ జాతీయ రాజకీయ శక్తి అతి త్వరలో ఆవిర్భవిస్తుంది. ముంబయి నుంచి కోల్‌కతా దాకా, కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా అన్నివర్గాలు, అన్ని రాష్ర్టాలను, అన్ని జాతులను, అన్ని భాషలను, అన్ని సమాజాలను, అన్ని వర్గాలను కలగలుపుకొని, సృజనాత్మకంగా, విప్లవాత్మకంగా, ఈ జాతి శ్రేయస్సే ధ్యేయంగా, భారతీయ ఆత్మను ప్రతిఫలిస్తూ, గంగా ప్రవాహ సదృశంగా సాగే జాతీయ పార్టీ ఒకటి అవతరిస్తుంది. ఈ దేశాన్ని నిజంగా ప్రేమించే వారి ప్రేమకు అది పాత్రమవుతుంది. శక్తిగా రూపుదాలుస్తుంది. పార్టీ ఆవిర్భావం తర్వాత భావ సారూప్య శక్తులతో పొత్తు చర్చలు. కలిసివచ్చే వారిని కలుపుకోవడం ఉంటాయి’ అని ఆయన వివరించారు. పార్టీ ఏర్పాటుకు సమాంతరంగా భావసారూప్య శక్తులతో చర్చలు సాగుతాయని, ఈ క్రమంలోనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆదివారం నాడు హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌ను కలుస్తారని ఆయన వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో ఈ మాడల్ సఫలమైందనీ, అందువల్ల జాతీయ రాజకీయాల్లో కూడా దీన్నే అనుసరిస్తామని ఆయన పేర్కొన్నారు. ‘తెగబడి నరికేవాడి ఖగమేల, తురంగమేల కాల్బలమేల.. అన్నట్టు కేసీఆర్‌కు తెగింపు ఉన్నది. ఆలోచన ఉన్నది. ఆకర్షణ ఉన్నది. ఈ మట్టి అంటే ప్రేమ ఉన్నది. దాని తాత్వికతమీద అవగాహన ఉన్నది. మాట ఉన్నది. రాజకీయం ఆడే ఆట ఉంది. చిల్లర నాయకులను దునుమాడే చేవ ఉంది. విజయానికి ఇంతకంటే ఏం కావాలి. ఇలాంటి నాయకుడి కోసం దేశం ఎదురుచూస్తున్నది’ అని పార్టీ చర్చల్లో ప్రముఖంగా పాల్గొన్న నాయకుడు ఒకరు వివరించారు.
మూలాల్ని కూలిస్తేనే మార్పు
‘మోదీ సర్కారుకు దేశం మీద అవగాహన లేదు. ఈ జాతి తాత్వికత దానికి తెలియదు. ప్రజల ఆలోచన దానికి అర్థం కాదు. కారణం.. ఈ దేశంలో అధికారంలో ఉన్నది మరుగుజ్జు నాయకులు. వారిది కురుచ బుద్ధి అయినందువల్లే, వారి కిందున్న వ్యవస్థలిలా వికృతంగా మారా యి. ఈ పరిస్థితిని మార్చాలంటే మూలాన్నే చక్కదిద్దాలి. సమస్య ఉన్న చోటే స్విచ్‌ను ఆఫ్ చేయాలి. బీజేపీని గద్దెదించడం అనే శస్త్రచికిత్స చేస్తే తప్ప ఈ దేశాన్ని బాగుచేయడం సాధ్యం కాదు. ఆ ఆపరేషన్ చేయగలిగిన డాక్టర్ కేసీఆర్. ఇప్పుడు దేశంలో కేసీఆర్‌లాగా జాతిపై పూర్తి స్పష్టత ఉన్న, అన్ని భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడగలిగిన నాయకుడెవరూ లేరు. ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు మొదలుపెట్టక తప్పదు. అందుకే సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేం ఒత్తిడి చేశాం. అందుకు ఆయన అంగీకరించారు’ అని గురువారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసిన వ్యూహకర్త ఒకరు వెల్లడించారు. ‘దేశంలో అతి పెద్ద ప్రతిపక్షం కాంగ్రెస్ చచ్చుబడి పోయింది. రాహుల్‌గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర ఏ మాత్రం కొత్తదనం లేకుండా, పాత చింతకాయ పచ్చడి లాంటి ప్రసంగాలతో నీరసంగా సాగుతున్నది. ఇక మిగతా నాయకులు, పార్టీలు ఆయా రాష్ర్టాలకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో మోదీ అనే పిల్లి మెడలో గంట కట్టగల సాహసికుడు, ఈ దేశంలోని రైతులు, కార్మికులు, దళితులు, బడుగు బలహీన వర్గాలకు భరోసా ఇచ్చే నాయకుడు, ఈ దేశానికి సరికొత్త ప్రత్నామ్నాయ రాజకీయ ఎజెండా, డైమెన్షన్ చూపించే నేత ఒకరు కావాలి. ఈ దేశం ఇప్పుడు ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్నది. ఆ నాయకుడు కేసీఆరే’ అని ఆయన విశ్లేషించారు.
దేశాన్ని తాకిన కేసీఆర్ ప్రశ్నలు
బీజేపీ వ్యవహార శైలిని, మోదీ సర్కారు తీరును కేసీఆర్ క్రమంగా ఎండగట్టడం మొదలుపెట్టారు. సూటిగా, స్పష్టంగా, మూడు భాషల్లో, అంశాల వారీగా, అంకెల తోడుగా కేసీఆర్.. మోదీ సర్కారుకు వేసిన ప్రశ్నలు యావద్దేశాన్నీ ఆకర్షించాయి. మేధావులను ఆలోచింపజేశాయి. దాంతో వారంతా కేసీఆర్‌ను సంప్రదించడం మొదలుపెట్టారు. ఇది ఒక్క తెలంగాణ సమస్య కాదనీ, యావద్దేశమే సమస్యలో, సంక్షోభంలో ఉన్నదని, అందువల్ల జాతి జెండాను, జాతీయ ఎజెండాను చేపట్టాలని ఆయనపై ఒత్తిడి మొదలైంది. దీంతో కేసీఆర్ ఆ దిశగా అనేకమందిని కలిసి అభిప్రాయాలు సేకరించారు. దేవెగౌడ, ప్రకాశ్‌కారత్, సీతారాం ఏచూరి, నితీశ్‌కుమార్, ఉద్ధవ్‌ఠాక్రే, శరద్‌పవార్, లాలూ ప్రసాద్‌యాదవ్, నవీన్ పట్నాయక్, మమతాబెనర్జీ, కేజ్రీవాల్, సుబ్రమణ్యస్వామి, హేమంత్సొరేన్, తదితర అనేక నాయకులతో జరిపిన చర్చలు దేశ దుస్థితిని బయటపెట్టాయి. దేశం ఏకధ్రువ, ఏకపక్ష రాజకీయంగా మారిపోయిందని, ప్రజాస్వామ్యం నియంతృత్వంగా మారుతున్నదని, ఇక ఆలోచిస్తూ కూర్చుంటే అసలుకే మోసం వస్తుందని వివిధ రాష్ర్టాల నేతలు కేసీఆర్‌తో జరిపిన సమావేశాల్లో తేల్చి చెప్పారు. మరోవైపు అనేకమంది మేధావులు, ఆర్థికవేత్తలు కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఒత్తిడి చేశారు. దాదాపు 200 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల సంఘం ఢిల్లీలోని ఇండియా హ్యాబిటెట్ సెంటర్లో కేసీఆర్‌తో సమావేశమై, కేసీఆర్‌లాంటి వ్యక్తి దేశానికి అవసరమని, ఇంకా ఆలస్యం చేయకూడదని విజ్ఞప్తి చేసింది.
కేసీఆర్‌పై పెరిగిన ఒత్తిడి
జాతీయ రాజకీయ ప్రవేశం తీరు తెన్నులపై కేసీఆర్ మథనం కొనసాగుతుండగానే, దేశంలో పరిస్థితి మరింత క్షీణించడం మొదలైంది. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ రాజ్యాంగ విలువలను మరిచిన మోదీ ప్రభుత్వం దేశాన్ని సంక్షోభం దిశగా తీసుకువెళ్తుండటం మేధావులు, ప్రజాస్వామికవాదుల గుండెను రగిలించింది. తెలంగాణ గవర్నర్‌గా వచ్చిన బీజేపీ నాయకురాలు ఇప్పటికి అనేకసార్లు ప్రభుత్వం గురించి, ముఖ్యమంత్రి గురించి నిందాపూర్వకంగా మాట్లాడారు. హద్దుమీరి వ్యవహరించారు. అయినా కేసీఆర్ ఎక్కడా సంయమనం కోల్పోలేదు. పల్లెత్తి మాట అన్లేదు. కానీ పరిస్థితి రోజురోజుకూ దిగజారి పోతున్నది. గవర్నర్లు బజారు గూండాలకన్నా అధ్వాన్నంగా మారిపోయారు. గతంలో ఎక్కడో ఒకచోట గవర్నర్ తీరుపై విమర్శ ఉండేది. కానీ మోదీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను కడు హీనంగా దిగజార్చింది. ఇప్పుడు కేరళలో పంచాయితీ, తమిళనాడులో పంచాయితీ, బెంగాల్లో పంచాయితీ, తెలంగాణలో పంచాయితీ. ప్రభుత్వ అధినేత అయిన గవర్నర్ అధికారాలను కత్తిరించేలా అసెంబ్లీలో తీర్మానాలు చేస్తున్న పరిస్థితి. గవర్నర్లు తమ పరిధిని మరిచి వీధి పోరాటాలకు దిగుతున్న దుస్థితి. ఇదొక వైపుంటే.. మరోవైపు కేంద్రానికి సుప్రీంకోర్టుతో కొట్లాట. రాష్ర్టాలతో కొట్లాట. మేధావులతో కొట్లాట. ఆర్థిక వేత్తలతో కొట్లాట. పొరుగు దేశాలతో కొట్లాట. ఇంకోవైపు ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం. అకాశాన్నంటిన ధరలు. ద్రవ్యోల్బణానికి అడ్డే లేదు. విదేశీ మారక నిల్వలు అడుగంటాయి. విదేశాంగ విధానం విఫలం. ఎవరైనా ప్రశ్నిస్తే చాలు, ఈడీ, సీబీఐ, ఐటీ అంటూ దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇక ఆలస్యం చేయడంలో అర్థం లేదని, వెంటనే జాతీయ రాజకీయాల్లోకి రావాలని వివిధ పార్టీల నాయకులు, మేధావులు వివిధ మార్గాల్లో కేసీఆర్‌పై ఒత్తిడి పెంచడం ప్రారంభించారు.