తొలుత 5న విచారణకు హాజరుకావాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. 11న వచ్చేందుకు అవకాశమివ్వాలని కేసీఆర్ కోరగా కమిషన్ అంగీకరించింది. బుధవారం ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్లో కొనసాగనున్న కమిషన్ బహిరంగ విచారణకు కేసీఆర్ హాజరుకానుండగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ విచారణకు హాజరై అనేక అంశాలను వెల్లడించారు. ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు రీ-డిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణ ఆవశ్యకత, తీసుకున్న నిర్ణయాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అధ్యయనాలను కమిషన్‌కు వివరించారు. తాజాగా కమిషన్ ఎదుటకు కేసీఆర్ హాజరుకానుండగా సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
ఎవరనుకున్నారు? గోదావరి ఉరకలెత్తి 200కు పైగా కిలోమీటర్లు దాటి కోదాడ చేరుతుందని! ఎవరు కలగన్నారు? పూడికతో వట్టిపోతున్న శ్రీరాంసాగర్‌కు పునరుత్థానం జరుగుతుందని! ఎవరనుకున్నారు? 600 అడుగుల ఎత్తుమీద ఉన్న తెలంగాణ భూములను నదీ జలాలు సస్యశ్యామలం చేస్తాయని! ఎవరనుకున్నారు? ఎములాడ రాజన్న పాదాలను గోదావరి జలాలు అభిషేకం చేస్తాయని! అప్పటిదాకా అధికారంలో ఉన్న సన్నాసులంతా ఎత్తుమీద ఉంటే నీళ్లెట్ల వస్తయ్ అన్నోళ్లే . ‘ఎందుకు రావు?’ అనుకున్నాడు కాబట్టే ఆయన దార్శనికుడు. ‘తెచ్చి చూపిస్త’ అని పట్టుబట్టాడు కాబట్టే ఆయన తెలంగాణ యోధుడు.
మిషన్ భగీరథ ప్రారంభోత్సవంలో దేశ ప్రధానే చెప్పారు.. ‘కేసీఆర్ ఎప్పుడు కలిసినా నీళ్ల గురించే మాట్లాడేవారు. నీరు ఆయన జీవితకాలపు మిషన్ అయిపోయింది’ అని. ఆ నీళ్లకోసం ఆయన నిద్రలేని రాత్రులు గడిపారు. ఢిల్లీ చుట్టూ తిరిగారు. మహారాష్ట్ర చుట్టూ తిరిగారు. కొండలు, గుట్టల ఎత్తుపల్లాలు కొలిచారు. ముగ్గురు సీఎంలను మెప్పించి ప్రారంభానికి రప్పించారు. తెలంగాణ సకల దరిద్రాలకు నీరే పరిష్కారమని తెలిసిన వాడు ఆయన. కరువులు, కన్నీళ్లు, వలసలతో గోసపడే తెలంగాణకు కాలం అందించిన పరిష్కారమే ఆయన. ఆయన ఒక జల స్వాప్నికుడు. జల సాధకుడు. జల చోదకుడు. నదీజలాలకు నడక నేర్పినవాడు. ఆకాశగంగను భగీరథుడు నేలకు దించితే.. పాతాళ గంగను పైకి తెచ్చి పచ్చని తెలంగాణను సృష్టించిన అపర భగీరథుడాయన. ఆయన గోదావరి ఉత్తుంగ తరంగాల తుంపరల మీద పరుచుకున్న ఇంద్రధనుస్సు.
ఆ దార్శనికుడిని ఎదుర్కోలేక నీలాపనిందలు. విచారణల వేధింపులు. కక్షసాధింపులు. కుట్రలు కుతంత్రాలు. డెభ్బై ఏండ్ల భారత ప్రజాస్వామ్యం వయసుడిగి చివరికి మూర్ఖుల పాలైంది. కుక్కమూతి పిందెలు కుర్చీలెక్కి రెచ్చిపోతున్నాయి. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే..కుట్రలు కుతంత్రాలకు ఆర్భాటం ఎక్కువ. ఆయుష్షు తక్కువ. అయినా మాయాజూదంలో గెలిచిన కౌరవులే కురుక్షేత్రంలో కుక్కచావు చచ్చారు!! అందుకే ధర్మం జయించు గాక. అధర్మం నశించుగాక!! అనేక అగ్ని పరీక్షలు దాటి పులుగడిగిన ముత్యంలా మెరిసిన కేసీఆర్ కాళేశ్వర కమిషన్ విచారణతో గంగాపునీతమవడం ఖాయం!
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై విచారణకు ఏర్పాటైన కమిషన్ ముందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం హాజరుకానున్నారు. కమిషన్‌కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ ఆయనను విచారించనున్నారు. అన్నిదశల్లో విచారణ పూర్తిచేసిన జస్టిస్ ఘోష్ ప్రస్తుతం రాజకీయ ప్రముఖుల విచారణ ప్రారంభించారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్‌రావు, ఈటల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో చివరగా మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించాలని నిర్ణయించారు.