హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం కమిషన్ ఎదుట బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్న తేదీ మారింది. వాస్తవానికి ఈ నెల 5న విచారణకు రావాల్సిందిగా కేసీఆర్‌ను జస్టిస్ ఘోష్ కమిషన్ ఆహ్వానించింది. అయితే, 5వ తేదీన కాకుండా 11వ తేదీన హాజరవుతానంటూ కేసీఆర్ లేఖ రాయడంతో, కమిషన్ అందుకు అంగీకారం తెలిపింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు కూడా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వారిద్దరు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 6, 9 తేదీల్లో విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇక కాళేశ్వరం కమిషన్ విచారణ ఇప్పటికే తుది దశకు చేరుకున్నది. ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లు, డిజైన్స్, డీపీఆర్, నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ విచారించింది. కాగ్ అధికారులను సైతం పలు అంశాలపై ప్రశ్నించింది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలను సైతం అధ్యయనం చేసింది. ఆయా అంశాలన్నింటినీ క్రోడీకరించి దాదాపు 400 పేజీలతో నివేదిక తయారుచేసినట్టు సమాచారం.
విచారణలో భాగంగా చివరగా రాజకీయ ప్రముఖుల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నోటీసులు జారీ చేసింది. విచారణ అనంతరం ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించనున్నట్టు కమిషన్‌వర్గాలు చెప్తున్నాయి.