ప్రముఖ చరిత్రకారుడు, కేసీఆర్ గురువు డాక్టర్ జైశెట్టి రమణయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జగిత్యాలలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తనకు చదువు చెప్పిన గురువు రమణయ్య మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు.
తనకు గురువుగా, అత్యంత ఆత్మీయుడైన రమణయ్యతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. రమణయ్య సిద్దిపేటలో లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో, తను ఇంటర్మీడియట్ విద్యార్థిగా తన దగ్గర విద్యనభ్యసించిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వారి మరణంతో శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రమణయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కాగా..1971లో సిద్దిపేట జూనియర్, డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్‌గా డా. జైశెట్టి రమణయ్య పని చేశారు. చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన అరుదైన వ్యక్తిగా, జగిత్యాలలో మొట్టమొదట పొందిన డాక్టరేట్ పొందిన పరిశోధన విద్యార్థిగా ఆయన పేరొందారు. “సౌత్ ఇండియా టెంపుల్స్” అనే పరిశోధనాత్మక గ్రంథాన్ని సమర్పించి జైశెట్టి రమణయ్య పీహెచ్డీ డాక్టరేట్ పట్టాను పొందారు.