హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తేతెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అల్లావుద్దీన్ అద్భుత దీపం తరహాలో చెప్తే బీసీలకు రిజర్వేషన్లు సాధ్యాంకావని, భూకంపం పుట్టించి.. మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తేనే బీసీలకు 42 శాతం కోటా సాధ్యమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టంచేశారు. బీసీ సంఘాల నేతలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని రైతులు, యువకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని గ్రహించిందుకే బీసీ కోటాను కాంగ్రెస్ సర్కారు తెరపైకి తీసుకొచ్చి, పూటకో నాటకమాడుతున్నదని నిప్పులు చెరిగారు. పార్లమెంట్లో పోరాటాన్ని పక్కనబెట్టి.. జంతర్ మంతర్ వద్ద ధర్నా పేరిట డ్రామా చేసిందని తలసాని విమర్శించారు.
రిజర్వేషన్లు సాధ్యం కాదనే ఆ ధర్నాకు కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్‌గాంధీ ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చెల్లని జీవో ఇచ్చి బీసీ వర్గాలను దగా చేశారని తలసాని విరుచుకుపడ్డారు. జీవో రాగానే కొందరు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకాలు చేసి బీసీల చాంపియన్‌గా చిత్రీకరించేందుకు యత్నించారని దుయ్యబట్టారు. జీవో చెల్లుబాటు కాదన్న హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యను కూడా తప్పుబట్టారని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలోనే బీసీలకు మేలు జరిగిందని తలసాని స్పష్టంచేశారు. అసెంబ్లీలోనూ రిజర్వేషన్లు పెంచాలని తీర్మానం చేశారని తెలిపారు. కేసీఆర్ నాయకత్వమే బలహీనవర్గాలకు శ్రీరామరక్ష అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే క్యాబినెట్‌లోని మూడు ఖాళీలను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మోడీ ఇంటి ఎదుట ధర్నాకు సిద్ధం: గంగుల కమలాకర్, మాజీ మంత్రి
కాంగ్రెస్ సర్కారు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి చూపడంలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఢిల్లీకి జంతర్‌మంతర్ దగ్గర ధర్నా పేరిట రాద్ధాంతం చేయడం తప్పా సాధించిందేమీలేదని దెప్పిపొడిచారు. నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే ప్రధాని మోడీ నివాసం వద్ద ధర్నా చేయాలని, బీఆర్ఎస్ కూడా కలిసి వస్తుందని స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ సవరణతోనే సాధ్యం: శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి
రాజ్యాంగ సవరణతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ ఇదే విషయాన్ని మొదటి నుంచీ చెప్తున్నదని స్పష్టంచేశారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం మభ్యపెడుతూ బీసీలను వంచిస్తున్నదని ధ్వజమెత్తారు. చిత్తశుద్ధితో బీసీ కోటా కోసం యత్నించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం బీసీ సంఘాల నాయకులతో కలిసి పోరాడేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని బీఆర్ఎస్ బీసీ నేత రాజారాంయాదవ్ స్పష్టం చేశారు. అంబేద్కర్, పూలే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ మార్గదర్శనంలో ముందుకు సాగితేనే బీసీ రిజర్వేషన్ల కోటా సాకారమవుతుందని చెప్పారు. బీఆర్ఎస్లోనే బలమైన బీసీ నాయకత్వం ఉన్నదని బీసీ జేఏసీ నేత నారగోని వ్యాఖ్యానించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, బీఆర్ఎస్ నేతలు దూదిమెట్ల బాలరాజు యాదవ్, శీలం వెంకటేశ్, చెరుకు శ్రీనివాస్, శుభప్రద్‌పటేల్, కిశోర్‌గౌడ్, దాసు సురేశ్, ఉపేంద్ర, సుమిత్రా ఆనంద్, కిర్తీలతాగౌడ్, పావనీగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ ముందుచూపుతోనే బీసీలకు అవకాశాలు: ఆర్ కృష్ణయ్య, రాజ్యసభ సభ్యుడు
తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ ముందుచూపుతోనే బలహీనవర్గాలకు మేలు జరిగిందని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య తెలిపారు. గురుకులాలు నిర్మిం చి, ఫీజు రీయింబర్స్మెంట్, ఉపాధి అవకాశాల ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు. కేసీఆర్ తెచ్చిన విప్లవాత్మక మార్పులతోనే రాష్ట్రం లో పేదరికం తగ్గిందని విశ్లేషించారు. తెలంగాణ సమాజంలో గుణాత్మక మార్పు వచ్చిందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తిలేదని స్పష్టంచేశారు. వలసలను అరికట్టడానికి కేసీఆర్ విధానాలే దోహదపడ్డాయని ప్రజాపోరాటలతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమని చెప్పారు. ఇందుకోసం సంఘటితంగా ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని స్పష్టం చేశారు.
బీసీ వర్గాలకు కేసీఆర్ మద్దతు: జాజుల శ్రీనివాస్‌గౌడ్
బీసీ వర్గాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగడుగునా మద్దతు పలికారని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ గుర్తుచేశారు. తమిళనాడు తరహాలో బీసీలతోపాటు ఇతర అణగారిన వర్గాల రిజర్వేషన్ల పెంపునకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించారని చెప్పారు. పర్యాద కృష్ణమూర్తి, బెల్లి సిద్ధయ్యతో కమిటీ వేసి, బీసీల స్థితిగతులపై అధ్యయనం చేయాలని సూచించారని స్పష్టంచేశారు. ఆ కమిటీ నివేదిక మేరకు 44 శాతం బీసీ రిజర్వేషన్లు కావాలని గట్టిగా కొట్లాడిన నేత కేసీఆర్ అని చెప్పారు. కులగణన చేయాలని
మొదటగా కేంద్రం దృష్టికి
తీసుకెళ్లారని గుర్తుచేశారు.